కలెక్షన్ ఫుల్ !

11 Jul, 2014 00:32 IST|Sakshi

కర్నూలు : సామాన్యుడు సేవించే ఛీప్ లిక్కరైనా.. ధనవంతులు తాగే బ్రాండేడ్ మద్యమైనా ఎమ్మార్పీ కంటే అదనంగా చెల్లించాల్సిందే. రూ.75 ధర ఉన్న ఛీప్ లిక్కర్ బాటిళ్లను రూ.80లకు, రూ.110 ధర పలికే క్వార్టర్ బాటిల్‌పై రూ.10 అదనంగా మద్యం దుకాణదారులు వసూలు చేస్తున్నారు. రూ.95 పలికే బీర్‌ను దుకాణాల్లో రూ.110, బార్లలో రూ.120 నుంచి 130 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. కారణంగా వారికి కూడా నెల మాముళ్లు ముట్టతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.  

 ఖర్చు తగ్గినా అమలు కాని ఎమ్మార్పీ...
 ఏ మద్యం వ్యాపారిని కదిపినా ఇందులో భారీగా నష్టపోతున్నామని చెబుతుంటారు. ఖర్చు తగ్గినప్పుడు ధర కూడా తగ్గాలనే ప్రశ్నకు మాత్రం జవాబు దాటవేస్తారు. ఉదాహరణకు మండల కేంద్రం వెల్దుర్తిలో మద్యం దుకాణానికి 2010లో నిర్వహించిన వేలంలో రూ.4 కోట్లకు దక్కించుకున్నారు. జిల్లాలో అప్పుడు అది రికార్డు. గత నెల చివరి వారంలో ఇదే దుకాణానికి నిర్వహించిన లక్కీ డిప్‌లో రూ.32.5 లక్షల స్లాబ్‌లకు వచ్చింది. కోట్ల వ్యయం నుంచి లక్షల్లోకి తగ్గినప్పటికీ వ్యాపారులు మాత్రం మద్యం ధరలను పెంచుతూనే ఉన్నారు.

కొందరు వ్యాపారులు సిండికేట్‌గా మారి మద్యం దుకాణాలు దక్కించుకున్నారు. గతంలో దుకాణాల వారీగా కల్లూరులోని ఐఎంఎల్ డిపో నుంచి లారీల్లో మద్యాన్ని రవాణా చేసుకునేవారు. ట్రాన్స్‌పోర్టు చార్జీలు తగ్గించుకునేందుకు ఎక్కడికక్కడే వ్యాపారులు సిండికేట్‌గా మారి మూడు, నాలుగు దుకాణాలకు కలిపి ఒకే వాహనం ద్వారా మద్యం సరఫరా చేసుకుంటూ ఖర్చులు తగ్గించి లాభాలు గడుస్తున్నారు. జిల్లాలోని 90 శాతం పైగా మద్యం దుకాణాదారులు ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నప్పటికీ ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు.

 ఒక్కొక్కరికో లేక్క..
 ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయాలు జరపాలంటూ ప్రభుత్వం నిబంధనలు విధించిన ప్పటికీ జిల్లాలో ఎక్కడా అమలు కావడం లేదు. మద్యం అధిక ధరలను నియంత్రించేందుకు గాను జిల్లాలో 14 ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీ ధరలను అమలు చేయాల్సిన బాధ్యత స్టేషన్ అధికారులతో పాటు కొత్తగా ఏర్పాటైన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ విభాగంపై ఉంది. నిఘా వేసి నియంత్రించాల్సిన  అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారు.

 ప్రతి ఎక్సైజ్ స్టేషన్‌కు నెలకు రూ.10 నుంచి రూ.15 వేలు, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి రూ.5 వేలు, డీటీఎఫ్‌కు రూ.5 వేలు, ఒక్కొక్క దుకాణం నుంచి మామూళ్లు ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. సివిల్ పోలీసులకు కూడా ఒక్కొక్క దుకాణం నుంచి రూ.10 నుంచి రూ.15 వేల దాకా మామూళ్లు ముట్టజెప్పుతున్నారు. ఈ లెక్కన ప్రతి మద్యం దుకాణం నుంచి ఎక్సైజ్, సివిల్ పోలీసులకు కలిపి నెలకు రూ.50 వేలు మామూళ్ల రూపంలో ముట్టజెప్పుతున్నారు. దీంతో వ్యాపారులు యదేచ్ఛగా ధరలు పెంచి విక్రయాలు సాగిస్తున్నారు.

 నిబంధనలకు పాతర..
 మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు పలు నిబంధనలు ఉన్నాయి. పాఠశాలలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, ప్రార్థనా మందిరాలకు వంద మీటర్ల దూరంలో మద్యం దుకాణం, పర్మిట్ రూం ఏర్పాటు చేసుకోకూడదు. ఈ నిబంధన చాలా చోట్ల తుంగలో తొక్కారు. గార్గేయపురంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోనే మద్యం దుకాణాన్ని ప్రారంభించారు.

 జొహరాపురంలో మద్యం దుకాణం ఏర్పాటును గ్రామస్తులంతా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయాలు ఎక్సైజ్ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాత షాపులు మార్చినందుకు దుకాణదారుల నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు తెలుస్తోంది. గ్రామాల్లో ఇంకా బెల్టుషాపులు యథాతధంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు