పరపతి ముద్ర ఉంటేనే రుణం

26 Mar, 2018 10:26 IST|Sakshi

అర్హులకు అందని ముద్ర రుణాలు

నెరవేరని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం  

ధర్మవరం:  కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి ముద్రయోజన (పీఎంఎంవై) లక్ష్యం దిశగా అడుగులు పడటం లేదు. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారులు, తయారీ, సేవా, వాణిజ్య రంగాలకు, నిరుద్యోగులకు పూచికత్తు లేకుండా రుణాలు ఇవ్వాలి. జిల్లాలో 34 బ్యాంకులకు చెందిన 455 శాఖలు ఉన్నాయి. ఒక్కో శాఖనుంచి కనీసం 25 మందికి రుణాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. దాని ప్రకారం జిల్లా వ్యాప్తంగా ఉన్న 15,470 మందికి రూ.50 వేలలోపు రుణాలు ఇవ్వాలి. ఇప్పటి వరకు లక్ష్యంలో 30 శాతం కూడా చేరుకోలేకపోయారు. 

కొన్ని బ్యాంకుల్లో బోణీ కరువు:మండల ప్రాంతాల్లో ఉన్న కొన్ని బ్యాంకుల్లో ఒక్క రుణం కూడా ఇచ్చి న దాఖలాలు లేవు. నూతనంగా ఏర్పాటు తమ శాఖలను ఏర్పాటు చేసిన కొన్ని బ్యాంకులైతే తాము ముద్ర రుణాలు ఇవ్వబోమని ఖరాకండిగా చెబుతున్నారు. మరి కొన్ని శాఖల్లో ఇవ్వలేమని చెప్పకుండా పదే పదే తిప్పుతున్నారు. 

పూచికత్తో, పలుకబడో ఉంటేనే..
పూచికత్తు లేకుండా 50 వేలరూపాయల రుణాలు ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా బ్యాంకర్లు మాత్రం కచ్చితంగా హామీ కోరుతున్నారు. చిన్న వ్యాపారులు ఎవరైనా దీని గురించి తెలుసుకుని వెళ్లి అడిగితే మా లక్ష్యం అయిపోయింది వేరే బ్యాంకులో ప్రయత్నించండని సలహా ఇస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. 

రుణం కోసం ఇవి కావాలి..
= గుర్తింపు ధ్రువపత్రం (ఆధార్‌కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ పాన్‌కార్డు, ఓటర్‌ గుర్తింపుకార్డు, పాస్‌పోర్టుల్లో ఏదో ఒకటి)
= నివాస ధ్రువపత్రం(విద్యుత్‌ బిల్లు, టెలిఫోన్‌ బిల్లు, ఇంటిపన్ను రసీదు, ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు వంటి చిరునామా ఉన్నవి ఏదైనా)
= ఇటీవల తీసుకున్న పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు–2
= కొనదలచిన యంత్ర సామగ్రి/ వ్యాపార సామాను/మూలధన పెట్టుబడికి ఉపయోగపడే కొటేషన్‌
= సప్లయర్‌ పేరుతో కూడిన సరుకుల వివరాలు
= వ్యాపార సంస్థ గుర్తింపు/చిరునామా ధ్రువపత్రం, ఇటీవల లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్‌ ధ్రువపత్రం ఇతర పత్రాలు

అందని ద్రాక్షే..
ముద్ర రుణాలు  అందని ద్రాక్షలా మారాయి. అధికార పార్టీ వారికి, పలుకుబడి ఉన్న వారికి మాత్రమే బ్యాంకర్లు రుణాలు మంజూరు చేస్తున్నారు. సాధారణ కార్మికులు మాత్రం ప్రైవేట్‌ ఫైనాన్సర్ల చేతిలో కాల్‌మనీ వేధింపులతో అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం స్పందించి అరులకు ముద్ర రుణాలు ఇప్పించాలి.– హైదర్‌వలి, ఆటోయూనియన్‌ జిల్లా అధ్యక్షుడు, ధర్మవరం

మరిన్ని వార్తలు