ప్రజల కష్టాన్ని తగలబెట్టింది చంద్రబాబు కాదా?

3 Jan, 2019 12:53 IST|Sakshi

సాక్షి, కాకినాడ : తెలంగాణలో ప్రజలు తరిమికొట్టినట్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కూడా చేస్తారని భయంతో చంద్రబాబును ఎదురు దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి కాపురిజర్వేషన్‌ పోరాటసమితి నాయకుడు ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. బలిజ, తెలగ, ఒంటరి, కాపు కులాలు పొగొట్టుకున్న రిజర్వేషన్‌లు తిరిగి రావాలంటే తనపాలన రావాలని చంద్రబాబు గత ఎన్నిక సమయంలో ఉపన్యాసాలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వాటిని అమలు చేయాలని అడిగితే అబద్దాల మీద అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మహారాష్ట్ర ముఖ్యమంత్రి మరాఠీలకు ఇచ్చినహామీ చూసైనా నేర్చుకోవాలన్నారు. 

'రాష్ట్ర ఆదాయాన్ని, వనరులను దోచుకున్నది మీరు కాదా? ప్రజల కష్టాన్ని మీ సొంత ఖర్చులకు, విహారయాత్రలకు తగలబెట్టింది మీరు కాదా? మీ జీవితంలో ఒక్కసారైనా నిజం మాట్లాడి ఉంటే దయ చేసి చెప్పండి' అంటూ చంద్రబాబు నాయుడుపై ముద్రగడ నిప్పులు చెరిగారు. రాష్ట్ర సంక్షేమం కోరేవారైతే హోదా కోసం మీరు, మీ కుటుంబం ఆమరణ నిరాహార దీక్ష చేయండి. మీకు అండగా అందరం ఉంటాం అని లేఖ రాస్తే నోరు విప్పలేదని తూర్పారబట్టారు. 

'ఏం ఘనకార్యం చేశారని మీకు రాష్ట్ర ప్రజలు అండగా ఉండాలి. అసలు గజదొంగ మీరా లేక ఇతర పార్టీ నాయకులా?  అమాయక ప్రజలకు హామీలు కురిపించి మరోసారి అధికార దాహం తీర్చుకోవడం కోసం ఈ తహతహ కాదా? ఊసరవెల్లి రంగులు మార్చినట్టు ముందు బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్‌, రేపు మళ్లీ బీజేపీ అధికారంలోకొస్తే వారికి జై కొట్టడం అలవాటుగా మారిపోయింది. మీ ఆరాటం చూస్తుంటే మీ కుటుంబ ఆస్తి కాపాడుకోవడం కోసం, అధికారం కావాలి అన్నది నగ్న సత్యం కాదా?' అని చంద్రబాబుపై ముద్రగడ ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు