-

బీసీ నేతలతో ముద్రగడ భేటీ

8 Jan, 2017 01:59 IST|Sakshi
బీసీ నేతలతో ముద్రగడ భేటీ

బీసీల నోటి వద్ద ముద్దను కాజేసే ఉద్దేశం లేదని వెల్లడి

సాక్షి ప్రతినిధి, ఏలూరు/కొత్తపేట: కాపు రిజర్వేషన్ల కోసం చేస్తున్న ఉద్యమానికి బీసీలు, ఆ సంఘాల నేతలు సహకరించాలని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పశ్చిమగోదావరి జిల్లాలోని బీసీ సంఘాల నాయకులకు విజ్ఞప్తి చేవారు. శనివారం పాలకొల్లు, భీమవరం, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాల్లో పర్యటించిన ముద్రగడ భీమవరంలో రాష్ట్ర బీసీ సంఘం నాయకుడు పాకా వెంకట సత్యనారాయణ నివాసంలో వెనుకబడిన తరగతులకు చెందిన వివిధ కుల సంఘాల నేతలతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా కాపు రిజర్వేషన్ల డిమాండ్‌ విషయంలో బీసీ నాయకులు వారి అభ్యంతరాలు, అపోహలను వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు ఇవ్వడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని, కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ముద్రగడ స్పందిస్తూ బీసీ రిజర్వేషన్లకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా.. ఆపైన ప్రభుత్వం రిజర్వేషన్‌ ఇస్తేనే తీసుకుంటామని వెల్లడించారు. బీసీల నోటికాడ ముద్దను కాజేసే ఆలోచన తమకు  లేదన్నారు. అంతకుముందు ఎమ్మెల్సీ మేకా శేషుబాబును కలిసి కాపు రిజర్వేషన్లపై సీఎం చంద్రబాబుకు ఉత్తరం రాయాలని కోరారు.  సాయంత్రం కొత్తపేటలో ముద్రగడ మాట్లాడుతూ.. బీసీలు వారి డిమాండ్ల కోసం రోడ్డెక్కితే మద్దతు ఇస్తానన్నారు.

మరిన్ని వార్తలు