నేనేమీ మీలాగా అపర మేధావిని కాను: ముద్రగడ

6 Nov, 2019 13:21 IST|Sakshi

ఆంధ్రజ్యోతిపై ముద్రగడ అసహనం

సాక్షి, తూర్పు గోదావరి : ఇసుక విషయమై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తాను ఇచ్చిన సలహాను ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన తీరుపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అసహనం వ్యక్తం చేశారు. తాను రాసిన లేఖ గురించిన వార్తను ముక్కలు చేసి ముఖ్యమైన సలహాను రాయకుండా దాచడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. చేతిలో పెన్ను, కాగితాలు ఉన్నాయి గనుక మీ ఇష్టారీతిన ప్రవర్తించడం సరికాదని.. ఇకపై ఆంధ్రజ్యోతి చానెల్‌ను గానీ, పత్రికను గానీ చూడదలచుకోలేదు అని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ముద్రగడ లేఖ రాశారు.

నేనేమీ మీలాగా అపర మేధావిని కాను..
‘04-11-2019వ తేదీన ఇసుక విషయమై సలహా ఇస్తూ ముఖ్యమంత్రికి లేఖ రాసి పత్రికలకు విడుదల చేశాను. నేనేమి మీలాగ అపర మేధావిని కాను. రాష్ట్రంలో ఇసుక కోసం ప్రజలు పడుతున్న బాధలు చూసి ఇసుక పాలసీ పక్కాగా రూపొందించే వరకు ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేయండి అని లేఖలో రాసాను. ఆంధ్రజ్యోతిలో ఆ వార్తను ముక్కలు చేసి ముఖ్యమైన సలహాను రాయకుండా దాచడం ఎంత వరకు న్యాయమని అడుగుతున్నాను. నేను లిఖిత పూర్వకంగా ఇచ్చిన సలహాను రాష్ట్రంలోనే కాదు. దేశంలో ఉన్న గౌరవ మేధావులను తప్పు అని చెప్పమనండి బేషరతుగా క్షమాపణ చెబుతాను. నా సలహాను ఎందుకు పత్రికలో రాయకూడదని, రాయొద్దని హుకుం జారీ చేసారు. ప్రభుత్వాల వల్లన నష్టం జరిగినప్పుడు లొల్లి పెట్టడానికి ప్రింటు, ఎలక్ట్రానిక్‌ మీడియా మీకు ఉన్నాయి. మీ స్వేచ్చకు సంకెళ్లు వేయకూడదు. మాలాంటి వారికి అలాంటివి జరిగినప్పుడు మా బాధను ఎక్కడ చెప్పుకున్నా న్యాయం జరగదు. మీ చేతిలో పెన్ను, కాగితాలు ఉన్నాయి కనుక మీ ఇష్టం. దయచేసి ఇక నుండి నా వార్తలు మీ ప్రింటు, ఎలక్ట్రానిక్‌ చానెల్‌లో చూపకండి. ఇక నుంచి మీ చానెల్‌ గాని, మీ పత్రిక గాని చూడదల్చుకోలేదు’ అని ఏబీఎన్‌ రాధాకృష్ణకు రాసిన లేఖలో ముద్రగడ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు