నెల రోజులే గడువు

6 Nov, 2017 08:29 IST|Sakshi

కాపు రిజర్వేషన్ల అమలుపై ముద్రగడ

సీఎం చంద్రబాబు హామీలను ఇక నమ్మలేం

ఉద్యమం విస్తృతికి అభిప్రాయ సేకరణ

ఆలమూరు (కొత్తపేట): కాపు సామాజిక వర్గాన్ని బీసీ జాబితాలో చేర్చేందుకు నెల రోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే, శాంతియుత పద్ధతిలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకృష్ణదేవరాయ కాపు అభ్యుదయం సంఘం ఆలమూరులో ఆదివారం ఏర్పాటు చేసిన కార్తిక వనసమారాధనలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల కాపు అభ్యుదయ సంఘం అధ్యక్షుడు చల్లా ప్రభాకరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వచ్చే నెల ఆరున జరిగే డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ వర్ధంతి లోపు కాపులను బీసీల్లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

కాపు సామాజికవర్గానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా భవిష్యత్తు వ్యూహం రూపొందించుకుంటామన్నారు. ఎస్‌ఎంఎస్‌లు, ఉత్తరాలు, సామాజిక ప్రచార మాధ్యమాల ద్వారా కాపు మేధావులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, యువత, మహిళల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నామన్నారు. ఇప్పటికే చాలమంది కాపు నేతలు తమ అభిప్రాయాలు తెలిపారని, రానున్న నెల రోజుల్లో మరిన్ని అభిప్రాయాలు సేకరించి, దానికనుగుణంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని ముద్రగడ చెప్పారు. కాపులను బీసీల్లో చేర్చుతామంటూ సీఎం తన మంత్రివర్గ సభ్యులతో పలికిస్తున్న చిలక పలుకులను కాపు సామాజికవర్గం నమ్మే పరిస్థితి లేదన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చాక కాపులకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. కొద్ది రోజుల క్రితం కొంతమంది కాపు నేతలను అమరావతి తీసుకువెళితే ఏదో ఒక శుభవార్త వింటామని ఎదురుచూసిన కాపు జాతికి నిరాశే మిగిలిందన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి కాపు రిజర్వేషన్ల అమలుపై కప్పదాటు వైఖరి ప్రదర్శించి, కాపు నేతల చెవిలో క్యాబేజీ పూలు పెట్టారని ఎద్దేవా చేశారు. అందువల్లనే చివరిగా వచ్చే నెల నుంచి ఉద్యమానికి శ్రీకారం చుట్టి రిజర్వేషన్లు సాధించేవరకూ పోరాడతామని ఆయన స్పష్టం చేశారు.

అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు తరలిరావాలి
ఈ నెల 12న కిర్లంపూడిలో కాపు నేతల ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన డాక్టర్‌ అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు దళితులు, కాపు నేతలు అధిక సంఖ్యలో తరలిరావాలని ముద్రగడ పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్‌కు లక్షలాది విగ్రహాలు ఏర్పాటు చేసినా విధించని నిబంధనలు కిర్లంపూడిలో మాత్రమే విధించడంపై ఆయన మండిపడ్డారు. అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణను అడ్డుకునేందుకు ప్రభుత్వం పోలీసుల సాయంతో అడ్డగోలు నిబంధనలు తీసుకురావడం దురదృష్టకరమన్నారు. పోలీసుల పడగ నీడలో జీవితాలను గడపాల్సిన దారుణమైన పరిస్థితులను కల్పించడం దుర్మార్గమని మండిపడ్డారు. కాపు జేఏసీ నేతలు ఆకుల రామకృష్ణ, వై.ఏసుదాసు, నల్లా విష్ణు, కల్వకొలను తాతాజీ, నయనాల హరిశ్చంద్రప్రసాద్, దున్నాబత్తుల నరేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు