పవన్‌ కల్యాణ్‌ ఎవరో తెలియదు: ముద్రగడ

4 Jan, 2018 12:58 IST|Sakshi

రిజర్వేషన్ల అమలుకు డిమాండ్‌

వెంకటగిరి వాసులను పలకరించిన ముద్రగడ

సాక్షి, వెంకటగిరి : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌కల్యాణ్ ఎవరో తనకు తెలియదని, ఆయనతో తనకు పరిచయం లేదని వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పర్యటించిన ముద్రగడ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు. కాపు రిజర్వేషన్ల కోసం కలిసి రాని వారిని బలవంతపెట్టాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వానికి మార్చి 31 వరకూ గడువిస్తున్నామని, ఆలోపు రిజర్వేషన్లు అమలు చేయకపోతే తమ పోరాటం మళ్లీ కొనసాగిస్తామన్నారు.

వెంకటగిరికి చెందిన ప్రముఖ వైద్యుడు వై.కమలాకర్‌సాయి, ప్రముఖ న్యాయవాది బీరం రామదాసులు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారిని ముద్రగడ పద్మనాభం పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాపు రిజర్వేషన్ల బిల్లుపై గవర్నర్‌ సంతకం చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో సంక్రాంతి కానుకగా రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బ్రిటిష్‌ కాలంలోనే కాపు, ఒంటరి కులస్తులకు రిజర్వేషన్లు అమలయ్యాయని గుర్తు చేశారు. వాటిని పునరుద్ధరించమని మాత్రమే తాము కోరుతున్నట్లు తెలిపారు.

కేంద్రంలో అమలు చేయాలంటే రాష్ట్రపతి సంతకం అవసరమని, రాష్ట్రంలో గవర్నర్‌ అనుమతితో కాపు రిజర్వేషన్లు అమలు చేయవచ్చని న్యాయకోవిదులు చెబుతున్నారని తెలియజేశారు. అనంతరం రాజా కుటుంబీకులు డాక్టర్‌ వీబీ సాయికృష్ణ యాచేంద్రను ముద్రగడ పద్మనాభం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట కాపు సంఘం నాయకులు ఉన్నారు.

మరిన్ని వార్తలు