గొలుసుకట్టుకు ‘తాళం’

1 Dec, 2013 01:02 IST|Sakshi

 ఏపీఎంఎల్‌ఎం ప్రొహిబిషన్ యాక్టు- 2013 సిద్ధం
 రాష్ట్ర ప్రభుత్వానికి డ్రాఫ్టు బిల్లు అందజేసిన సీఐడీ
 
 సాక్షి, హైదరాబాద్: మల్టీ లెవెల్ మార్కెటింగ్ (గొలుసుకట్టు మార్కెటింగ్) ద్వారా డిపాజిట్ దారులను నిలువునా ముంచుతున్న సంస్థలపై నేర పరిశోధన విభాగం(సీఐడీ) ఉక్కుపాదం మోపనుంది. దీని కోసం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఏపీ మల్టీలెవెల్ మార్కెటింగ్ ప్రొహిబిషన్ యాక్టు-2013ను సీఐడీ రూపొందించి ముసాయిదా బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల అందించింది. ప్రభుత్వం ఈ ముసాయిదా బిల్లును అసెంబ్లీ ఆమోదానికి పంపనుంది. లేదా ఆర్డినెన్స్ ద్వారా ఈ చట్టం అమల్లోకి తీసుకురానుంది. ఎంఎల్‌ఎం ద్వారా మోసాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలతోపాటు, ఆస్తులను జప్తు చేసే విధంగా కొత్త చట్టానికి రూపకల్పన చేశారు. పలు రకాల వ్యాపారాల్లో పుట్టగొడుగుల్లా పుట్టుకువస్తున్న ఎంఎల్‌ఎంలు రాష్ట్రంలో ప్రతి ఏటా రూ.15 వేల కోట్ల వరకూ వసూలు చేస్తున్నట్లు సీఐడీ అధ్యయనంలో తేలింది. ఆన్‌లైన్ సర్వే పేరుతో సింగపూర్‌కు చెందిన స్పీక్ ఏసియా సంస్థ దేశవ్యాప్తంగా 19 లక్షల మంది వద్ద 2,200 కోట్లు వసూలు చేసిన వ్యవహారంపై సీఐడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. నెల్లూరు, ఒంగోలు, వరంగల్ జిల్లాలలో హిమ్ సంస్థ మోసాలకు పాల్పడింది. గోల్డ్‌క్వెస్ట్ తొమ్మి ది రాష్ట్రాలలో 5.5 లక్షల మంది వద్ద 1,650 కోట్ల వరకూ వసూలు చేసింది. కాగా, కేఎంజీ ల్యాండ్ డెవలపర్స్, అక్షయ గోల్డ్, పెరల్స్ వంటి పలు సంస్థలపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ  కంపెనీలపై ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ (బ్యానింగ్) యాక్టు 1978 ప్రకారం కేసులు నమోదు చేశారు. తమ సంస్థ కార్యకలాపాలు ఆ చట్టపరిధిలోకి రావంటూ ఆ సంస్థ లు కోర్టును ఆశ్రయించడంతో దర్యాప్తు సంస్థలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చట్టాన్ని సీఐడీ రూపొందించింది. ప్రతి జిల్లాలో సెంట్ర ల్ క్రైం స్టేషన్‌లను నోడల్ ఏజెన్సీగా ఎంఎల్‌ఎంలపై ప్రత్యేక దాడులకు సీఐడీ సన్నాహాలు చేస్తోంది. కాగా, ఎంఎల్‌ఎం విధానంలో సభ్యులను చేర్చుకుని ఉత్పత్తులను విక్రయిస్తున్న ఆమ్వే సంస్థపై సీఐడీ రెండు రోజు ల క్రితం మరో కేసు నమోదు చేసింది. 2006 నుంచే ఈ సంస్థ కార్యకలాపాలకు సంబంధించి సీఐడీ దర్యాప్తు జరుగుతోంది. ఆ సంస్థ కార్యకలాపాలకు సంబంధించిన ప్రచురణలు, ప్రకటనలు విడుదల చేయకూడదని రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఆ కేసుపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగానే రాష్ర్టంలో మళ్లీ ప్రకటనలు విడుదల చేయడాన్ని సీఐడీ అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఆ సంస్థకు సంబంధించిన ప్రకటనలు, ప్రచురణలను సీజ్ చేయాలని ఎస్పీలు, పోలీస్ కమిషనర్‌లకు సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.

>
మరిన్ని వార్తలు