టెలీ డాక్టర్లు

6 Apr, 2020 03:15 IST|Sakshi

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఫోన్‌లో ఉచితంగా పలు వైద్య సంఘాల సేవలు 

నిత్యం 30 వేల మందికి టెలీమెడిసిన్‌ ద్వారా మందులు

ఆర్థోపెడిక్, సైకియాట్రీ, గైనకాలజీ, జనరల్‌ ఫిజీషియన్‌ సేవలు అందుబాటులో..

సాక్షి, అమరావతి, సాక్షి నెట్‌వర్క్‌: లాక్‌డౌన్‌ కారణంగా కాలు బయట పెట్టలేక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి టెలీ మెడిసిన్‌ సేవలు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌పేషెంటు (ఓపీ) సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో నిత్యం సగటున 4.75 లక్షల మంది ఔట్‌పేషెంట్‌ సేవల కోసం ఆస్పత్రులకు వెళుతుంటారు. వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులు, వైద్య సంఘాలు ఆన్‌లైన్‌ కన్సల్టెన్సీ సేవలను ఉచితంగా నిర్వహిస్తున్నాయి. ఆడియో, వీడియో కాల్స్‌ ద్వారా పేషెంట్లతో మాట్లాడి అత్యవసరం కాని వాటికి ఫోన్‌లోనే పరిష్కారం చూపిస్తున్నారు. ఆర్థోపెడిక్, సైకియాట్రీ అసోసియేషన్‌లతో పాటు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌లు టెలిఫోన్‌ ద్వారా రోగులకు ఉచితంగా సేవలందిస్తున్నాయి. రోజూ ఆన్‌లైన్‌ సేవలు పొందుతూ చికిత్స తీసుకుంటున్నవారు 30 వేల మంది వరకు ఉన్నట్లు తేలింది.

ప్రతి జిల్లాలో ఉచితంగా సేవలు
‘ఆర్థోపెడిక్‌ సర్జన్ల సొసైటీ తరఫున రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ ఆన్‌లైన్‌లో ఓపీ సేవలు ఉచితంగా అందిస్తున్నాం. హెల్ప్‌ లైన్‌ నెంబరు 8801446611 కు ఫోన్‌ చేస్తే ఏ జిల్లాలో సేవలు కావాలంటే ఆయా డాక్టర్లు మాట్లాడతారు. ఉచిత టెలీ కన్సల్టేషన్‌ సేవలు లాక్‌డౌన్‌ పూర్తయ్యేవరకూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి’
–డా.జె.నరేష్‌బాబు, వెన్నుపూస వైద్య నిపుణులు, జనరల్‌ సెక్రటరీ, ఆర్థోపెడిక్‌ సర్జన్స్‌ అసోసియేషన్‌ 

– గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన 42 ఏళ్ల గృహిణికి అకస్మాత్తుగా వెన్నెముక, ఎడమ కాలు మోకాలి భాగంలో తీవ్ర నొప్పి మొదలైంది. లాక్‌డౌన్‌తో ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేనందున గుంటూరుకు చెందిన ఆర్థోపెడిక్‌ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ జె.నరేష్‌కు ఫోన్‌ చేసి సమస్య వివరించింది. వీడియో కాల్‌ ద్వారా ఆమెతో మాట్లాడిన డాక్టర్‌ ఏ మందులు వాడాలో సూచించడంతో ఉపశమనం లభించింది. 

– నెల్లూరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో టెలీమెడిసిన్‌ సేవల కోసం ఏర్పాటైన 18004256040 టోల్‌ఫ్రీ నంబర్‌కు తొలి రోజే విశేష స్పందన లభించింది. శనివారం సాయంత్రానికి  67 మంది ఫోన్‌ చేసి వైద్య సలహాలు పొందారు. వైద్య ఆరోగ్యశాఖ తరపున సత్యనారాయణ కాల్స్‌ రిసీవ్‌ చేసుకుని సంబంధిత డాక్టర్‌కు కనెక్ట్‌ చేస్తున్నారు.  

రోగులకు ఎంతో ఉపయోగం
– డాక్టర్‌ గౌరీనాథ్, పల్మనాలజిస్ట్, అపోలో స్పెషాలిటీ ఆస్పత్రి
టెలీ మెడిసిన్‌కు విశేష స్పందన లభిస్తోంది. లాక్‌డౌన్‌ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం టెలీమెడిసిన్‌ ద్వారా రోగులకు ప్రత్యామ్నాయ సేవలు అందించడం అభినందనీయం.

మానసిక సమస్యలకు ఫోన్‌లో పరిష్కారాలు 
– డాక్టర్‌ ఎస్‌.అఖిలేష్, కన్సల్టంట్‌ సైకియాట్రిస్టు, డిస్ట్రిక్ట్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రాం, ప్రకాశం జిల్లా
గత 15 రోజుల్లో 40 మంది వ్యక్తులకు టెలీ మెడిసిన్‌ ద్వారా మానసిక సమస్యలకు సలహాలు ఇచ్చాం. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారు కరోనా సోకినట్లు భ్రమపడి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అల్కహాల్‌ తీసుకునే వారు కూడా ఎక్కువగా ఫోన్‌లు చేస్తున్నారు. వీరందరికీ సూచనలు, అవసరమైన మందులను టెలీ మెడిసిన్‌ ద్వారా సూచిస్తున్నాం.

‘మధుమేహానికి మందులు వాడుతున్నా. మార్చి 31 సాయంత్రం ఒక్కసారిగా షుగర్‌ లెవల్స్‌ పడిపోయాయి. రెగ్యులర్‌గా వెళ్లే ప్రైవేట్‌ హాస్పిటల్‌కి ఫోన్‌ చేస్తే లాక్‌డౌన్‌ వల్ల డాక్టర్లు అందుబాటులో లేరని చెప్పారు. టెలి మెడిసిన్‌ నంబర్‌కి కాల్‌ చేస్తే డాక్టర్‌ దాదాపు 10 నిమిషాలపాటు మాట్లాడి మందులిచ్చారు. అవి వాడిన కొద్ది గంటలకే సాధారణ స్థితికి చేరుకున్నా. 
– సుధాకర్‌రావు, విశ్రాంత ఉద్యోగి, అగనంపూడి

అమెరికాలో మా సంస్ధ ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా టెలి మెడిసిన్‌ సేవలను అందించాం. రాష్ట్రంలో కూడా కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. రోగులు 9703446611 నంబర్‌కు ఫోన్‌ చేస్తే వైద్యులతో అనుసంధానం చేస్తాం. కష్టకాలంలో మావంతు సాయంగా ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నాం. 
– లోకేష్, సీఈఓ, వెబ్‌ట్విక్‌ సొల్యూషన్స్‌

ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం..
ప్రభుత్వం టెలీ మెడిసిన్‌ విధానానికి అవకాశం కల్పించడం మంచి నిర్ణయం. ఆర్థోపెడిక్‌ వైద్యులంతా  కలిసి ఒక కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. హెల్ప్‌ లైన్‌ నంబరు 8801446611కు ఫోన్‌ చేసి అనారోగ్యం వివరాలు చెబితే మందులను సూచిస్తాం.
– ఎస్‌ సుబ్రమణ్య రావు, ఆర్ధోపెడిక్‌ వైద్య నిపుణులు, కడప, వైఎస్సార్‌ జిల్లా

చిత్తూరులోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్‌సీల్లో వైద్యులు టెలిమెడిసిన్‌  ద్వారా విస్తృతంగా పరీక్షలు నిర్వహించి మందులు సూచిస్తున్నారు. తిరుపతిలోని రుయాలో గైనకాలజిస్టు, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, జనరల్‌మెడిసిన్, కార్డియాలజీ వైద్యులు వీడియా కాల్స్‌ ద్వారా పేషెంట్లతో నేరుగా మాట్లాడి మందులు సూచిస్తున్నారు. టెలిమెడిసన్‌ ద్వారా రోజు 20 మందికి వైద్యం చేస్తున్నామని చిత్తూరులోని సత్యనారాయణపురం ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి అనురాధ పేర్కొన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు