బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం సీజ్‌

29 Mar, 2018 08:23 IST|Sakshi
మున్సిపల్‌ – బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారుల వాగ్వాదం

18 ఏళ్లుగా మున్సిపాల్టీకి చెల్లించని పన్నులు

రూ.5 లక్షల మేర పేరుకుపోయిన బకాయిలు

జగ్గయ్యపేట అర్బన్‌ : ఇంటి పన్ను చెల్లించకపోవటంతో స్థానిక బీఎస్‌ఎన్‌ఎల్‌ సబ్‌ డివిజినల్‌ కార్యాలయాన్ని బుధవారం మున్సిపల్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఈ మేరకు పన్ను వసూళ్లకు వచ్చిన పురపాలక సంఘ రెవెన్యూ అధి కారులు.. కార్యాలయంలోని సిబ్బందిని బయటకు పంపివేసి ప్రధాన ద్వారానికి తాళాలు వేసి సీల్‌ వేశారు. పన్ను చెల్లింపునకు ఈనెల 31 వ తేదీ డెడ్‌లైన్‌ కావటంతో మున్సిపల్‌ కమిషనర్‌ పి.రమేష్‌ ఆదేశాల మేరకు పన్ను బకాయిల వసూలు లక్ష్యంతో రెవెన్యూ విభాగం సిబ్బంది  స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. దీనిలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ గత 18 ఏళ్లుగా రూ.5.13 లక్షల ఇంటి పన్నును చెల్లించకపోవటంతో అనేకసార్లు నోటీసులు జారీ చేశారు. అయినా ఖాతరు చేయలేదు.

దీంతో బుధవారం కార్యాలయానికి వచ్చి మరొకసారి పన్ను బకాయిలు చెల్లించాలని కోరారు. అయినా స్పందించకపోవడంతో రెవెన్యూ ఆఫీసర్‌ ఆర్‌. వసంతరావు ఆధ్వర్యంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కేజే శంకర్, టీమ్‌ లీడర్‌ చావా ప్రేమ్‌చంద్, సీనియర్‌ అసిస్టెంట్‌ ఆంజనేయులు, బిల్‌ కలెక్టర్లు నాగరాజు, ఇతర సిబ్బంది కార్యాలయాన్ని సీజ్‌ చేస్తున్నట్లు నోటీస్‌ జారీ చేసి ప్రధాన ద్వారాలకు తాళాలు వేసి సీల్‌ వేశారు. కాగా ఒక దశలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు, సిబ్బందికి.. మున్సిపల్‌ అధికారులు, సిబ్బందికి తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినా రెవెన్యూ అధికారులు ససేమిరా అనటంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు ఈ విషయాన్ని వారి ఉన్నతాధికారులకు తెలియజేశారు. అలాగే, మున్సిపల్‌ అధికారులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. 

>
మరిన్ని వార్తలు