పారిశుధ్య యుద్ధం!

9 Apr, 2020 03:55 IST|Sakshi
కరోనా వ్యాప్తి చెందకుండా బుధవారం విజయవాడలో స్ప్రే చేస్తున్న సిబ్బంది

కరోనా కట్టడికి శరవేగంగా చర్యలు 

రూ.31 కోట్లతో ప్రత్యేక కార్యాచరణ

రసాయనాల పిచికారీతో రెడ్‌జోన్లపై ప్రత్యేక దృష్టి

కార్మికులకు పెద్ద ఎత్తున రక్షణ పరికరాలు కొనుగోలు  

సాక్షి, అమరావతి: కరోనా కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన పురపాలక, పంచాయతీరాజ్‌ శాఖలు పారిశుధ్య నిర్వహణ, భౌతిక దూరం నిబంధన అమలుపై ప్రధానంగా దృష్టి సారించాయి. కరోనా కేసులు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా నమోదు అవుతున్న నేపథ్యంలో 120 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మెరుగైన పారిశుధ్య నిర్వహణ కోసం పురపాలక శాఖ రూ.31 కోట్లతో యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ సిద్ధం చేసింది.  

► సాధారణ ప్రాంతాల్లో తరచూ బ్లీచింగ్‌ పౌడర్, సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. రెడ్‌ జోన్లలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కరోనా కేసులు నమోదైన వారి నివాసం నుంచి 3 కి.మీ. పరిధిలో రెడ్‌ జోన్‌గా ప్రకటిస్తున్నారు. అక్కడి నుంచి  మరో 2 కి.మీ. మేర బఫర్‌ ప్రాంతంగా గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 
► రాష్ట్ర వ్యాప్తంగా 35,982 మంది పారిశుధ్య కార్మికులు రేయింబవళ్లు పని చేస్తున్నారు. 
► పారిశుధ్య నిర్వహణకు పురపాలక శాఖ 650 టన్నుల బ్లీచింగ్‌ పౌడర్, 500 టన్నుల సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని కొనుగోలు చేసింది. మరో రెండు నెలల పాటు అవసరమైనవి కొనుగోలు చేసేందుకు కూడా సమాయత్తమవుతోంది. కార్మికుల కోసం 1.49లక్షల మాస్కులు, 59,390 గ్లౌజులు, 10 వేల జతల అప్రాన్లు/బూట్లు కొనుగోలు చేశారు. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ నుంచి మరో 35 వేల  ఫుల్‌ సూట్లు, బూట్లు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. 

గ్రామాల్లో పక్కా ప్రణాళిక... 
► గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించేందుకు పది లక్షల బస్తాల బ్లీచింగ్‌ పౌడర్, పది లక్షల లీటర్ల ఫినాయిల్, 20 లక్షల లీటర్ల సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పంచాయతీరాజ్‌ శాఖ సిద్ధం చేసింది. 
► రాష్ట్ర వ్యాప్తంగా 31,892 గ్రామీణ ప్రాంతాల్లో సోడియం హైపో క్లోరైడ్‌ ద్రావణాన్ని పంచాయతీరాజ్‌ శాఖ సిబ్బంది పిచికారీ చేశారు. గత వారం రోజుల వ్యవధిలో 16,725 ప్రాంతాల్లో ఫాగింగ్‌ మిషన్ల ద్వారా పొగ వెదజల్లారు. మురుగు కాల్వలను  శుభ్రం చేస్తున్నారు. ప్రజలు భౌతిక దూరం పాటించేలా ప్రతి గ్రామంలో దుకాణాల వద్ద మీటరు దూరంతో మార్కింగ్‌ చేశారు. 
► ఏఎన్‌ఎంలు, వలంటీర్లు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు.  
అనంతపురం జిల్లా కదిరి, రెడ్‌జోన్‌గా ప్రకటించిన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు తంగెళ్ళమూడి ప్రాంతంలో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్నిస్ప్రే చేస్తున్న శానిటేషన్‌ సిబ్బంది  

కరోనా కట్టడికి పటిష్ట చర్యలు 
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పురపాలక శాఖ అన్ని చర్యలు చేపడుతోంది. పారిశుధ్య నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. కరోనా వైరస్‌ ప్రభావం తగ్గిన తరువాత కూడా ఇదే రీతిలో చర్యలు చేపట్టి పట్టణాలు, నగరాలను ఆరోగ్యంగా ఉంచేలా ప్రణాళిక రూపొందించాం     
– జీఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ (పురపాలక శాఖ కమిషన్‌ డైరెక్టర్‌)

ప్రతి రోజూ సమీక్ష 
గ్రామాల్లో కరోనా నియంత్రణ చర్యలపై రోజూ సమీక్ష చేస్తున్నాం. పాజిటివ్, అనుమానిత కేసులు గుర్తించిన చోట తరచూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గ్రామాల్లో సిబ్బందికి గ్లౌజులు, మాస్కులు సరిపడినన్ని కొనుగోలు చేయాలని ఆదేశించాం. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది పూర్తి సహకారం అందిస్తున్నారు 
– గోపాలకృష్ణ ద్వివేది (పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి)

మరిన్ని వార్తలు