ముట్టడి.. కట్టడి

17 Oct, 2018 08:51 IST|Sakshi

మున్సిపల్‌ కార్మికులపై పోలీసుల ఉక్కుపాదం

ఉద్రిక్తతలకు దారితీసిన సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడి 

కార్మికులకు అండగా నిలచిన వైఎస్సార్‌ సీపీ, వామపక్ష ట్రేడ్‌ యూనియన్‌ నేతలు

పలువురు వైఎస్సార్‌ సీపీ నేతల అరెస్ట్‌ 

సాయంత్రం సమ్మె విరమణ 

తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్న మున్సిపల్‌ కార్మికులపై ఖాకీలు క్రౌర్యం ప్రదర్శించారు. మహిళలని కూడా చూడకుండా నిర్థాక్షిణ్యంగా ఈడ్చుకుపోయారు. కేవలం కార్మికులనే కాక వారికి మద్దతిచ్చిన వారిపై కూడా జులుం చూపించారు. జీవో నం. 279 రద్దు చేయాలని కోరుతూ రెండు వారాలుగా ఆందోళన చేపట్టిన మున్సిపల్‌ కార్మికులు మంగళవారం విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయ ముట్టడికి విఫలయత్నం చేశారు. కార్మిక సంఘ నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్‌ చేసి శివారు ప్రాంతాల పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

సాక్షి, అమరావతి బ్యూరో : మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 13 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు మంగళవారం అన్ని సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్‌సెంటర్‌ నుంచి ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయం ముట్టడికి కోసం చేపట్టిన ప్రదర్శనను నగర పోలీసులు అడ్డుకున్నారు. కార్మికుల సంక్షేమాన్ని విస్మరించేలా ఉన్న జీవో 279 రద్దు చేయకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని, తమ హక్కులను కాపాడేందుకు కార్మికుల చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవటం ప్రజాస్వామ్య విలువలను నిలువరించటమేనని పలువురు కార్మిక సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 రెండు వారాలుగా నిరవధిక సమ్మె చేస్తున్న కార్మికులకు మద్దతుగా వైఎస్సార్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పూనురు గౌతం రెడ్డి, మచిలీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, సీపీఎం రాష్ట్ర నాయకులు సీహెచ్‌ బాబూరావు, ఏఐటీమూసీ రాష్ట్ర నాయకులు ఆర్‌ రవీంద్రనా«థ్, పలువురు కార్మిక సంఘాల నిలిచారు. కార్మికుల ప్రదర్శనకు నేతలు మద్దతు ఇచ్చి పాల్గొనడంతో నగర పోలీసులు పలువురు నేతలను అరెస్ట్‌చేసి పమిడిముక్కల, తోట్లవల్లూరు, కంకిపాడు పెనమలూరు, ఉయ్యూరు, ఇబ్రహీంపట్నం, గన్నవరం, ఉంగుటూరు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా  గుడివాడ, మచిలీపట్నం, గుడివాడ, తిరువూరు తదితర ప్రాంతాల్లో ఆర్‌డీవో కార్యాలయాల ముట్టడిని పోలీసులు అడ్డుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. 

లెనిన్‌సెంటర్‌లో నాటకీయ పరిణామం 
మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన ఆందోళన  కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయటానికి పోలీసులు ఉక్కుపాదం మోపారు. కార్మికులను ఆందోళన చేపట్టే ప్రాంతానికి రాకుండా నలువైపులా అడ్డుకున్నారు. పోలీసుల చక్రవ్యూహాన్ని దాటుకుని లెనిన్‌సెంటర్‌లో జరుగుతున్న కార్యక్రమానికి హాజరైన నేతలు, కార్మికులు ప్రభుత్వ వ్యతిరేఖ విధానాలపై నినాదాలు చేస్తున్న సమయంలో ఎలాంటి హెచ్చరికలు లేకుండా అరెస్ట్‌ చేయటం ఉద్రిక్తలకు దారితీసింది. ఈ సందర్భంలో భారీ స్థాయిలో మోహరించిన పోలీసులకు, కార్మికులకు మధ్య తోపులాటలు జరిగాయి. 

కలెక్టరేట్‌ ముట్టడికి విఫలయత్నం
చిలకలపూడి(మచిలీపట్నం): గత కొద్ది రోజులుగా సమ్మె నిర్వహించి పోరాటం చేస్తున్న మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు నిరసన గళాన్ని విప్పారు. కలెక్టరేట్‌ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో కలెక్టరేట్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులకు, వివిధ పక్షాల నాయకులు, కార్మికుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో నాయకులను, కార్మికులను పోలీసులు విచక్షణారహితంగా ఈడ్చుకువెళ్లి పోలీస్‌వ్యాన్‌లోకి ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. 

కార్మికులకు సంతృప్తి అక్కర్లేదా
రాష్ట్రంలో ప్రజలందరూ సంతృప్తిగా ఉండాలని రియల్‌ టైం గవర్నెన్స్‌ ద్వారా పాలకులు ఫోన్లు చేసి తెలుసుకునే క్రమంలో మున్సిపల్‌ కార్మికుల ఆకలి కేకలు పాలకులకు వినిపించటం లేదా, కార్మికుల సంతృప్తి పాలకులకు అక్కర్లేదా అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు.  సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. నరసింహారావు మాట్లాడుతూ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్మికుల పోరాటంలో సమస్యను పరిష్కరించకుండా పాలకులు మీనమేషాలు లెక్కించడం సరికాదన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చౌటుపల్లి రవి మాట్లాడుతూ జీవో 279 ద్వారా కార్మికులకు మేలు జరుగుతుందని చెబుతున్న పాలకులు ఇంత వరకు ఏం మేలు చేశారని ప్రశ్నించారు. వైఎస్సార్‌ సీపీ పట్టణ కన్వీనర్‌ షేక్‌ సలార్‌దాదా, సీపీఎం నాయకులు కొడాలి శర్మ, మత్స్యకార్మిక సంఘం నాయకులు కొల్లాటి శ్రీనివాసరావు, కేవీపీఎస్‌ నాయకులు దాసరి సాల్మన్‌రాజు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు పవన్, కె. సుజాత, గోపి, ఏఐటీయుసీ నాయకులు కరపాటి సత్యనారాయణ, లింగం ఫిలిప్, వైఎస్సార్‌ సీపీ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు పల్లి శేఖర్, మున్సిపల్‌ ప్రతిపక్ష నాయకులు షేక్‌ అచ్చెబా పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలి
కంకిపాడు(పెనమలూరు): మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్‌ చేశారు. విజయవాడలో ఆందోళన చేస్తున్న మున్సిపల్‌ కార్మికులను అరెస్టు చేసి మంగళవారం కంకిపాడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి. సత్యబాబు, ఎం. బాబూరావు పాల్గొన్నారు.

సమ్మె విరమణ..
సాయంత్రం అధికారులతో జరిగిన చర్చల అనంతరం మున్సిపల్‌ కార్మికులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
తోట్లవల్లూరు: మున్సిపల్‌ కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి. గౌతంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆందోళనకు దిగిన వైఎస్సార్‌ సీపీ, సీపీఎం, ఏఐటీయూసీ కార్మిక సంఘాల నాయకులను పోలీసులు మంగళవారం విజయవాడలో అదుపులోకి తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు మాట్లాడుతూ కార్మికుల సమ్మెతో పట్టణాలు  మురికికూపాలుగా మారుతున్నా ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని విమర్శించారు. 

నేతల సంఘీభావం..
తోట్లవల్లూరు స్టేషన్‌లో పోలీసు నిర్బంధంలో ఉన్న గౌతంరెడ్డి, బాబూరావు, కార్మిక సంఘాల నాయకులను వైఎస్సార్‌ సీపీ పామర్రు నియోజకవర్గం సమన్వయకర్త కైలే అనిల్‌కుమార్‌ పరామర్శించి సంఘీబావం తెలిపారు. ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి మోర్ల రామచంద్రరావు, వైస్‌ ఎంపీపీ పీఎస్‌ కోటేశ్వరరావు, మండల యూత్‌ అధ్యక్షుడు గొరిపర్తి సూర్యనారాయణ, మండల పార్టీ కార్యదర్శి కిలారం రామకృష్ణ పరామర్శించిన వారిలో ఉన్నారు. 

మరిన్ని వార్తలు