వార్..వన్‌సైడే!

5 Apr, 2016 23:38 IST|Sakshi

 నగరపాలక సంస్థ ఎన్నిక
 ‘డెరైక్టే’?
  వైఎస్సార్‌సీపీకే అవకాశం?
  పెరుగుతున్న ఆశావహులు
 టీడీపీలో వర్గవిభేదాలు

 స్థానిక ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలోనే జరగనున్నాయి. ప్రభుత్వం ఈ మేరకు పూర్తిస్థాయిలో కసరత్తు మొదలెట్టింది. మరికొద్దిరోజుల్లో ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల సహా ఇతర స్థానిక ఎన్నికలన్నీ ప్రత్యక్ష పద్ధతిలోనే జరిపేందుకు నిర్ణయించిన సంగతి అధికార పార్టీ నాయకులు తెలుసుకుని లోలోన కుమిలిపోతున్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థకు ఎప్పుడు ఎన్నికలు జరిగినా..వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఫలితం అనుకూలంగా వస్తోందని జనం అభిప్రాయపడుతున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుతుండడంతో ఇప్పుడున్న పరిస్థితిల్లో ఏ ఎన్నిక వచ్చినా ప్రజల మద్దతు కూడగట్టుకునే పరిస్థితి లేదనే అభిప్రాయం అన్నివర్గాల నుంచి వ్యక్తమవుతోంది. వాస్తవానికి గతంలో స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో పరోక్ష పద్ధతి కొనసాగేది. ప్రజలు తమ వార్డు, డివిజన్ సభ్యుల్ని ఎన్నుకుంటే ఎన్నికైన వారంతా తిరిగి అధ్యక్షుడిని ఎన్నుకునేవారు. ఆ పద్ధతి వల్ల కొంత నష్టపోయే అవకాశం ఉందని ఆలోచించిన టీడీపీ ప్రభుత్వం ఇకపై జరిగే ఎన్నికలన్నీ ప్రత్యక్షంగా ఉండవచ్చనే సంకేతాలిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లా నేతలు కూడా త్వరలో శ్రీకాకుళం కార్పొరేషన్‌కు జరగనున్న ఎన్నికలపై దృష్టిసారించారని తెలుస్తోంది.

  అధికార పార్టీ నేతల్లో చర్చ
  కార్పొరేషన్ ఎన్నికలకు తరుణం ఆసన్నమైన నేపథ్యంలో టీడీపీ నేతలు తమ అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే ఓ అంచనాకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే భర్త మేయర్ పదవిపై దృష్టిసారించారంటూ వచ్చిన వార్తలపై చర్చ కూడా జరుగుతోంది. ఒకప్పుడు పార్టీ అధినేతనే నేరుగా దూషించిన విషయాన్ని తమ్ముళ్లు గుర్తు చేస్తున్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వేస్తున్న వ్యూహంగానే చెబుతున్నారు.
 
 వార్డులెన్ని, డివిజన్లకే ఎన్నికలు జరుగుతాయా? విలీన పంచాయితీల పరిస్థితేంటి? అన్న అంశాలు పూర్తవకముందే టీడీపీ నేతలు తమ మేయర్ ఫలానా వ్యక్తే అంటూ కారుకూతలు కూయడాన్ని ఆ పార్టీలో కొంతమంది జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో రోజురోజుకూ వర్గవిభేదాలు పెరిగిపోతున్నాయి. ఒకరంటే ఒకరికి పడడం లేదు. అభ్యర్థులే లేని పార్టీలో అప్పుడే మేయరా? అంటూ తమ్ముళ్లు తమ మనసులోని ఆవేదనను సీనియర్ల వద్ద ప్రస్తావిస్తున్నారు.
 
 ఏం సాధించారని?
 టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. జిల్లాలో ఒక్కరికీ ఇల్లు ఇవ్వలేదు. సహజ సిద్ధంగా దొరికే ఇసుకనూ పచ్చచొక్కాలు సొమ్ము చేసుకున్నాయి. ఒక్క అభివృద్ధి పనీ పూర్తి కాలేదు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనుల్నీ తమ గొప్పేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోవడంతో జనం టీడీపీ నేతల ఇళ్ల ముందు ప్రశ్నించేందుకు క్యూ కడుతున్నారు. నగరంలో మంచినీటి సమస్య దారుణంగా ఉంది. దోమల బాధ తప్పడం లేదు. పశుసంచారాన్ని నిరోధించే వాళ్లే కరువయ్యారు. అభివృద్ధి మాట అటుంచితే పన్నుల మోత తప్పడం లేదు. 73, 74వ రాజ్యాంగ సవరణ అంటూనే గడువు ముగిసినా ఎన్నికలకు వెళ్లకపోవడం, క్రమబద్ధీకరించిన ఇళ్లకూ కొత్తగా పన్నులు వసూలు చేసేందుకు అధికారులు సిద్ధమైపోయారు. అమలయ్యేందుకు అవకాశం లేకపోయినా ఇష్టానుసారంగా నేతలు హామీలు గుప్పించేస్తున్నారు. ఈ తరుణంలో ఇప్పటికప్పుడు ఎన్నికలంటూ జరిగితే జనం టీడీపీని ఛీదరించుకోవడం ఖాయమనే వినిపిస్తోంది.
 
 దివంగత నేత వైఎస్సార్ ఈ జిల్లాకు చేసిన సేవల్ని గుర్తుచేసుకుంటున్నారు. రిమ్స్, యూనివర్సిటీ, వంశధార, ఆఫ్‌షోర్ ప్రాజెక్టు కోసం చేసిన సేవల్ని తెరమీదకు తెస్తున్నారు. 80 అడుగుల రోడ్డు, చినబజార్ రోడ్డు, పెద మార్కెట్, మంచినీటి వ్యవస్థతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు అప్పట్లో నాంది పలికినా, కొన్ని అంశాల్లో ఇప్పటికీ టీడీపీ నేతలు దృష్టిసారించకపోవడాన్ని ఆక్షేపిస్తున్నారు. టీడీపీకి ప్రజామద్దతు లేకపోవడంతో స్థానిక ఎన్నికల్లో వార్ వన్‌సైడే అవుతుందని, వైఎస్సార్‌సీపీకే పూర్తి మెజార్టీ వస్తుందని జనం అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు