దాచేపల్లి, గురజాలకు మున్సిపాలిటీ హోదా

26 Sep, 2019 10:57 IST|Sakshi
దాచేపల్లి ఏరియల్‌ వ్యూ

ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్‌ పరిపాలన శాఖ

నేరవేరిన దశబ్దాల కల.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు  

సాక్షి, దాచేపల్లి: దశాబ్దాల కల సాకరమైంది. దాచేపల్లి, గురజాల పట్టణ ప్రజలు ఎదురు చూస్తున్న మున్సిపాల్టీల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి మున్సిపల్‌ పరిపాలన శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధికారంలోకి వచ్చిన కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే దాచేపల్లి, గురజాల పట్టణాలకు మున్సిపాల్టీలల హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది . ఎన్నికల సమయంలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి దాచేపల్లి, గురజాల పట్టణాలకు మున్సిపాల్టీ హోదాను కల్పిస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి ప్రజల కలను నిజం చేశారు. దాచేపల్లి, నడికుడి జంట గ్రామాలను కలిసి దాచేపల్లి మున్సిపాల్టీగా, గురజాల, జంగమహేశ్వరపురం గ్రామాలను కలిసి గురజాల మున్సిపాల్టీలుగా రూపాంతరం చెందనున్నాయి. మున్సిపాల్టీల ఏర్పాటుతో పాటు అందుకు అవసరమైన సిబ్బంది, కార్యాలయం, ఫర్నిచర్‌తో ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మున్సిపాల్టీలతో అభివృద్ధి..
దాచేపల్లి, గురజాల పట్టణాలను మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ గత దశాబ్దాల నుంచి వినిపిస్తోంది. గత టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు మున్సిపాల్టీలుగా మారుస్తున్నామని గొప్పలు చెప్పారే తప్ప ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయారు. అయితే ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పల్నాడు అభివృద్ధికి ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం ఏర్పడగానే నియోజకవర్గానికి రూ.66 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారు. ఆ తర్వాత తంగెడ, మాచవరం గ్రామాల పరిధిలో ఎత్తిపోతల నిర్మాణాలకు రూ.188 కోట్ల ప్రతిపాదనలకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. దాచేపల్లి, నడికుడి, గురజాల, జంగమహేశ్వరపురంలో ఉన్న జనాభా, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక, మానవ వనరులను పరిగణలోకి తీసుకుని దాచేపల్లి, గురజాల పట్టణాలను మున్సిపాల్టీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మున్సిపాల్టీలు ఏర్పడితే ప్రతి రోజు పూర్తిస్థాయిలో పారిశుద్ధ్యం, ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీరు అందుతాయి. మున్సిపాల్టీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ప్రత్యేకంగా నిధులు వస్తాయి. తమ కల ఇన్నాళ్లకు నెరవేరతుండటంతో దాచేపల్లి, గురజాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే పిడుగురాళ్ల మున్సిపాల్టీగా ఉండటంతో తాజాగా దాచేపల్లి, గురజాల పట్టణాలు కూడా ఆ జాబితాలో చేరనున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా