ఇక ‘పుర’పోరు

20 Apr, 2019 04:58 IST|Sakshi

ఓటర్ల జాబితాకు మున్సిపల్‌ శాఖ కసరత్తు

మే 1న జాబితా ప్రకటన 

త్వరలో ఎన్నికల షెడ్యూల్‌ 

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు కసరత్తు ప్రారంభమైంది. ఈ నెల 9న మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణ విషయంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేయడంతో రాష్ట్రంలోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. అలాగే, ఓటర్ల జాబితాను వెంటనే రూపొందించాలని.. మే 1 నాటికి దానిని ప్రకటించాలని కూడా ఆదేశించింది. దీంతో మున్సిపల్‌ అధికారులు యుద్ధప్రాతిపదికన ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఓటర్ల జాబితాలను రూపొందించే పనిలోనూ నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో 13 కార్పొరేషన్లతో కలిపి 110 మున్సిపాల్టీలు ఉన్నాయి. ఇందులో నాలుగు సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాల్టీలు, ఏడు స్పెషల్‌ గ్రేడ్, 13 మొదటి గ్రేడ్‌.. 25 సెకండరీ గ్రేడ్, 23 థర్డ్‌ గ్రేడ్‌వి కాగా 25 నగర పంచాయితీలు ఉన్నాయి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితాలను పరిగణనలోకి తీసుకుని మున్సిపల్‌ ఓటర్ల జాబితా రూపొందించాల్సి ఉంది. ఈ మేరకు మున్సిపల్‌ అధికారులు జిల్లా ఎన్నికల సంఘాల నుంచి సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితాలను తీసుకుని జాబితాను రూపొందించే పనిలో ఉన్నారు. కాగా, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా రూపొందించేందుకు ఇంకా 12 రోజులే సమయం ఉండటంతో అధికారులు నానా హైరానా పడుతున్నారు. మున్సిపల్‌ ఓటర్లను వార్డుల వారీగా విభజన చేయనున్నారు. వీధులు, ఇంటి నెంబర్లు, పోలింగ్‌ కేంద్రాలను ఆధారంగా ఓటర్ల జాబితాను రూపొందిస్తారు. సాధారణంగా పట్టణాలు, నగరాల్లో విద్యార్థులు, వ్యాపారులు, ఉద్యోగులు అధికంగా ఉంటారు. వీరిని పరిగణనలోకి తీసుకుని ఓటరు ఇంటికి సమీపంలోనే పోలింగ్‌ కేంద్రాలు ఉండే విధంగా చూసుకోవాలని ఎన్నికల సంఘం అదేశించింది.

గ్రేటర్‌ విశాఖ, గుంటూరులో ‘విలీన’ సమస్యలు
ఇదిలా ఉంటే.. గ్రేటర్‌ విశాఖ, గుంటూరు కార్పొరేషన్లకు సంబంధించి విలీన గ్రామాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఓటర్ల జాబితాలో నెలకొనే సమస్యలను వివరిస్తూ ఎన్నికల కమిషన్‌కు అక్కడి అధికారులు లేఖ రాశారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా రూపొందించే పనిలో వారు ఉన్నప్పటికీ, డివిజన్ల వర్గీకరణ సమయంలో సమస్యలు తలెత్తుతాయని వివరించారు. దీనిపై తగు సూచనలు ఇవ్వాలని కోరారు. అలాగే, ప్రతిపాదిత గ్రేటర్‌ విజయవాడలో విలీనమయ్యేందుకు పలు గ్రామ పంచాయతీలు సుముఖంగా లేకపోవడంతో అక్కడ ఇప్పుడున్న కార్పొరేషన్‌ పరిధిలోనే ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాక.. అతిపురాతనమైన మచిలీపట్నం జూలై 3వ తేదీతో కార్పొరేషన్‌గా రూపొంతరం చెందనుంది. 42 డివిజన్ల కలిగిన ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్‌గా రూపాంతరం చెందితే డివిజన్ల సంఖ్య 50కు పెరుగుతుంది. ఈ 50చోట్లా ఎన్నికలు జరుగుతాయి. మరోవైపు.. తిరుపతి కార్పొరేషన్‌ను గ్రేటర్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ మేరకు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఓటర్ల జాబితా వెలువడిన తరువాత ప్రజల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ ముగిసిన తరువాత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. 

అభ్యర్థుల అన్వేషణలో పార్టీలు
కాగా, మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించడంతో రాజకీయ పార్టీలు కూడా పురపోరుకు సిద్ధమవుతున్నాయి. ధీటైన అభ్యర్థుల కోసం అన్వేషణ ప్రారంభించాయి. సమావేశాలు నిర్వహిస్తూ డివిజన్లలోని పరిస్థితులను సమీక్షిస్తున్నాయి.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా