మునిసి‘పోల్’ కాక

6 Mar, 2014 03:26 IST|Sakshi

భీమవరం, న్యూస్‌లైన్ : మునిసిపల్ ఎన్నికల సంగ్రామంతో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. నామినేషన్ల గడువు సమీపించడంతో ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాల అన్వేషణలో పడ్డాయి. విజయమే లక్ష్యంగా పార్టీల నేతలు అభ్యర్థుల జాబితాల రూపకల్పనలో తలమునకలై ఉన్నారు. దీటైన అభ్యర్థుల కోసం కుస్తీపడుతున్నారు. జిల్లాలో భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, కొవ్వూరు, నిడదవోలు, జంగారెడ్డిగూడెం, ఏలూరులో ఈ నెల 30న ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 10వ తేదీ నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. దీంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్ ప్రారంభమైంది. సాధారణ ఎన్నికల ముందు ఊహించని విధంగా వచ్చిన మునిసిపల్ ఎన్నికల్లో సత్తా చాటి పైచేయి ప్రదర్శించాలని పార్టీలు ప్రయత్నిస్తున్నాయి.
 
 మునిసిపోల్ కాక
 అభ్యర్థుల వేటలో పార్టీలు : మునిసిపల్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ మధ్యే పోటీ నెలకొంది. జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలను కైవశం చేసుకునేందుకు వైసీపీ జిల్లా నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే 8 పురపాలక సంఘాలతో పాటు ఏలూరు కార్పొరేషన్‌లో బలమైన అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు కార్యాచరణ రూపొందిస్తున్నారు. టీడీపీ కూడా అభ్యర్థుల వేటలో తలమునకలై ఉంది. సీమాంధ్ర ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ పార్టీకి పురపాలక సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది. నామినేషన్‌లకు 4 రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో పార్టీల నేతలు అభ్యర్థుల కోసం తెగ హైరానా పడుతున్నారు.
 

మరిన్ని వార్తలు