ఆదాయానికి ‘నీళ్లొ’దిలారు...

12 Jun, 2014 01:57 IST|Sakshi

 విజయనగరం మున్సిపాలిటీ: మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అధికారుల నిర్లక్ష్యంతో  ఆ శాఖకు పెద్ద మొత్తంలో ఆదాయానికి గండిపడింది.  మూడేళ్ల నుంచి నీటి పన్ను వసూలు కాకపోవడంతో  రూ.అర కోటికి పైగా ఆదాయం నిలిచిపోయింది.  పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 2000 కుళాయి కనెక్షన్‌లకు మూడేళ్లుగా డిమాండ్ నోటీసులు జారీ చేయకపోగా... అనధికారికంగా పుట్టుకొచ్చిన మరో 500 వర కూ కుళాయి కనెక్షన్‌లు ఉన్నట్టు తెలిసినా వాటిపై చర్యలు తీసుకోలేదు.
 
 విజయనగరం మున్సిపాలిటీలో  19 వేల వరకు కుళాయి కనెక్షన్‌లుండగా, వాటి ద్వారా ఏడాదికి రూ.60 నుంచి రూ.70 లక్షల వరకు పన్ను రూపంలో ఆదాయం వస్తుంది. అయితే 2010-11 సంవత్సరంలో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు అదనంగా 2000 కుళాయి కనెక్షన్‌లు మంజూరు చేశారు. వీటికి సంబంధించిన వివరాలను రికార్డుల్లో చూపిస్తున్నప్పటికీ డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు వీలుగా  వాటిని ఆన్‌లైన్ చేయలేదు. దీంతో పన్ను వసూలు చేసేందుకు రెవెన్యూ విభాగం అధికారులకు అవకాశంలేకుండా పోయింది.  2000 కనెక్షన్లకు గత మూడేళ్లుగా ఒక్క నోటీసూ జారీకాలేదు. ఏడాదికి రూ. 14.40 లక్షల చొప్పున ఈ మూడేళ్లలో రూ.43 లక్షల 20వేల వరకు  ఆదాయానికి గండిపడింది.
 
 అంతేకాకుండా  ఇంజినీరింగ్ విభాగం అనుమతులు లేకుండా మరో 500 కనెక్షన్లు అనధికారికంగా ఉన్నట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. ఇవి కూడా మూడేళ్ల క్రితం నుంచి ఉన్నప్పటికీ వాటిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. దీంతో వీటి ద్వారా ఈ మూడేళ్లలో మరో రూ.10.80 లక్షల వరకూ రావలసిన ఆదాయానికి గండిపడినట్లు తెలుస్తోంది. అనధికారిక కుళాయి కనెక్షన్‌లు కంటోన్మెంట్ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిసినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లో మరేతర కార ణాలతోనో వాటిపై చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  ఫలితంగా ఈ మూడేళ్లలో అటు అధికారిక, ఇటు అనధికారిక కుళాయి కనెక్షన్‌ల నుంచి రావాల్సిన రూ 54 లక్షల ఆదాయానికి బ్రేక్ పడింది. వార్డు పర్యటనల్లో గమనించిన మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణ ఆరా తీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
 
 మున్సిపల్ ఇంజినీర్‌కు నోటీసులు  
 ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ ఆర్.సోమన్నారాయణను వివరణ కోరగా.. పట్టణంలో అధికారికంగా మంజూరు చేసిన 2000 కుళాయి కనెక్షన్‌లకు  మూడేళ్లుగా డిమాండ్‌నోటీసులు జారీ చేయకపోవడం వాస్తవమేనన్నారు. దీనిపై మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారి బాబుకు నోటీసుతో పాటు మెమో జారీ చేసినట్టు తెలిపారు.  విచారణ చేసేందుకు డీఈతో కమిటీ వేశామని, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనధికారికంగా 500 వరకు కుళాయి కనెక్షన్‌లు ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందని వాటిపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
 

>
మరిన్ని వార్తలు