‘మున్సిపల్’ సమ్మె యథాతథం!

11 Feb, 2014 00:40 IST|Sakshi
‘మున్సిపల్’ సమ్మె యథాతథం!

మంత్రి మహీధర్‌రెడ్డితో చర్చలు విఫలం
డిమాండ్లు పరిష్కరించాలన్న కార్మికులు
ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయిన వైనం

 
 సాక్షి, హైదరాబాద్: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ చేపట్టిన సమ్మెను కొనసాగించాలని మున్సిపల్ కార్మికులు నిర్ణయించారు. పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డితో సోమవారం జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మధ్యంతర భృతిపై అటు మంత్రికి, ఇటు కార్మికులకు అవగాహన కుదరకపోవడంతో చర్చలు విఫలమైనట్టు తెలిపారు. మధ్యంతర భృతిని 50 శాతం ఇవ్వాలని కార్మికులు పట్టుబడుతుండగా, 25 శాతం ఇవ్వడానికి మంత్రి సుముఖత వ్యక్తం చేశారు. అయితే, తమ వేతనాలు చాలా తక్కువగా ఉన్నందున కనీసం 40 శాతమైనా ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
 
     ఆరోగ్య కార్డులు ఇచ్చేందుకు మంత్రి అంగీకరించారు. పే రివిజన్ కమిషన్ ఇచ్చే నివేదికలో చివరి గ్రేడు ఉద్యోగులకు చెల్లించే వేతనాలను ఇవ్వడానికి కూడా మంత్రి మహీధర్‌రెడ్డి పచ్చజెండా ఊపారు.
     కాగా, కార్మికులు పట్టుబడుతున్న మధ్యంతర భృతిపై సీఎంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పారు. ఈ మేరకు ఏఐటీయూసీ నాయకుడు కిర్ల కృష్ణారావు, బీఎంఎస్ నాయకుడు శంకర్, సీఐటీ యూ నాయకుడు పాలడుగు భాస్కర్‌లు  తెలిపారు.
 
     మరోపక్క, శనివారం నుంచి కొనసాగుతున్న సమ్మెతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోయి దుర్వాసన అలుముకుంది. పారిశుద్ధ్యంతోపాటు తాగునీటి సరఫరా, వీధి దీపాల సేవలను సైతం కార్మికులు సోమవారం నుంచి నిలిపివేయడంతో ప్రజలు మరిన్ని ఇక్కట్లు పడాల్సి వస్తోంది.

మరిన్ని వార్తలు