మరీ ఇంత బరితెగింపా? 

31 Jul, 2019 09:11 IST|Sakshi
మునిసిపల్‌ స్థలంలో నిర్మాణం కోసం ఉంచిన ఇసుక

సాక్షి, చిత్తూరు : దీపం ఉన్నప్పుడే ఇల్లు ఎలా చక్కబెట్టుకోవాలనేది ప్రత్యక్షంగా చూడాలంటే చిత్తూరు నగరానికి రావాల్సిందే. అధికారంలో ఉండగానే ముందుచూపుతో దాదాపు రూ.5 కోట్ల విలువైన మునిసిపల్‌ స్థలాన్ని కొట్టేయాలని ప్లాన్‌చేశారు. ఇంకేముంది.. దీనికి కార్పొరేషన్‌లో పనిచేసే ఇద్దరు ఉద్యోగులు తోడవ్వడంతో చకాచకా పనికానిచ్చేశారు. చిత్తూరు నగరంలోని కొత్త బస్టాండును ఆనుకుని ఉన్న రూ.5 కోట్లు విలువ చేసే కార్పొరేషన్‌కు చెందిన 3,500 అడుగుల స్థలంలో భవన నిర్మాణ పనులు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు.

పక్కాగా ప్రణాళిక
20 ఏళ్ల క్రితం ఉద్యోగుల యూనియన్‌ కార్యాలయం కోసం ఆర్టీసీ బస్టాండులో స్థలాన్ని కేటాయించారు. దీన్ని తనకు లీజుకు ఇస్తే భవనం నిర్మించి, మొదటి అంతస్తును యూనియన్‌ కార్యకలాపాలకు, మిగిలిన దాన్ని తాము వాణిజ్య సముదాయంగా వినియోగిస్తామనే ప్రతిపాదనను టీడీపీ నేత కార్పొరేషన్‌లోని తనకు అనుకూలంగా ఉన్న ఉద్యోగి వద్ద చెప్పారు. వెనువెంటనే అప్పటివరకు ఉన్న ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని మార్చేసి కొత్త వ్యక్తిని ఆ పీఠంపై కూర్చోబెట్టారు. ముందుగా అనుకున్నట్లు తనవద్ద డ్రైవర్‌గా పనిచేసే వ్యక్తికి రూ.5 కోట్ల విలువ చేసే స్థలాన్ని 25 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేలా యూనియన్‌లో ఓ అజెండాను ప్రవేశపెట్టి తీర్మానం చేశారు. ఆర్నెల్ల క్రితం జరిగిన ఈ వ్యవహారం ఎవరికీ తెలియకుండా చాలా రహస్యంగానే ఉంచగలిగారు.

ఆ హక్కు ఉందా?
మునిసిపల్‌ స్థలాన్ని యూనియన్‌కు కేటాయించినా కమిషనర్‌ స్థాయి అధికారి స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసివ్వాలి. కానీ ఇప్పటివరకు ఆ స్థలం యూనియన్‌ పేరిట రిజిస్ట్రేషన్‌ కాలేదు. మూడేళ్లు, అయిదేళ్లు పాటు ఎవరికైనా స్థలా న్ని అద్దెకు ఇవ్వొచ్చు తప్ప 25 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వ డం, రిజిస్ట్రేషన్‌ చేసివ్వడం చట్టరీత్యా నేరం. కమిషనర్‌ అనుమతి లేకుండా మునిసిపల్‌ స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేసిచ్చినందుకు ఉద్యోగులను సస్పెండ్‌ చేసి, చట్టరీత్యా చర్యలు తీసుకునే అధికారం కమిషనర్‌కు ఉంటుంది.

ప్రభుత్వం మారడంతో వెలుగులోకి..
రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, ఇటీవల ఉద్యోగులతో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సమావేశం నిర్వహించినప్పుడు ధైర్యం చేసిన ఉద్యోగులు కార్పొరేషన్‌ స్థలం కబ్జా అవుతున్న విషయంపై నోరు విప్పారు. స్థలా న్ని ఎవరికీ లీజుకుగానీ, రిజిస్ట్రేషన్‌గానీ చేసివ్వొద్దంటూ ఎమ్మెల్యే మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. దీంతో వారం క్రితం కొత్త యూనియన్‌ను ఎన్నుకోవడానికి సమావేశం పెట్టడం, స్థలం లీజుకు ఇవ్వడం చెల్లదంటూ అందరూ ముక్తకంఠంతో ప్రశ్నించారు. అయితే ఇద్దరు మునిసిపల్‌ ఉద్యోగులు మాత్రం ఖాళీ స్థలంలో పనులు త్వరగా పూర్తిచేయాలని టీడీపీ నేతకు సూచించడంతో ప్రస్తుతం ఇక్కడ భవనం నిర్మించడానికి మట్టిని కూడా తీసుకొచ్చి సిద్ధమవుతున్నారు.

క్రిమినల్‌ కేసు పెట్టిస్తా
ఇది మునిసిపాలిటీ స్థలం. దీన్ని యూనియన్‌కు ఇచ్చినట్లు రిజిస్ట్రేషన్‌ పత్రాలు ఏవీ నాకు చూపించలేదు. ఈ స్థలాన్ని ఎవరూ ఎవరికీ లీజుకు ఇవ్వడం.. రిజిస్ట్రేషన్‌ చేసివ్వడం కుదరదు. ఒకవేళ ఎవరైనా లీజుకు తీసుకుని ఇక్కడ నిర్మాణాలు చేపడితే అతనితో పాటు కార్పొరేషన్‌ స్థలాన్ని ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేసిచ్చినందుకు ఉద్యోగ సంఘ నాయకులపై క్రిమినల్‌ కేసు పెట్టమని పోలీసులకు ఫిర్యాదు చేస్తా.
– చల్లా ఓబులేసు, కమిషనర్, చిత్తూరు నగర పాలక సంస్థ

మరిన్ని వార్తలు