మున్సిపల్‌ వ్యవస్థలు నిధులపై దృష్టి పెట్టాలి

2 Jun, 2017 01:13 IST|Sakshi

ఒంగోలు అర్బన్‌: ప్రజలకు మెరుగైన సేవలందించి మున్సిపల్‌ వ్యవస్థలు సొంత నిధులను పెంచుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార ప్రసారశాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు గురువారం అన్నారు. ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో నిర్మించిన కళాప్రాంగణం ప్రారంభించారు. రూ.40కోట్లతో ఏడుగుండ్లపాడు నుంచి ఒంగోలు వరకు ఏర్పాటు చేస్తున్న తాగునీటి పైపులైన్‌ పనులు, రూ.9కోట్లతో గోరంట్ల కాంప్లెక్స్‌ రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి పైలాన్‌లు ఆవిష్కరించారు. అనంతరం ఏ1 కన్వెన్షన్‌ హాలులో పౌర సన్మాన కార్యక్రమంలో మాట్లాడారు. స్మార్ట్‌ సిటీల ఏర్పాటులో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

నేటికీ దేశంలో మరుగుదొడ్లు, తాగునీరు వంటి కనీస సౌకర్యాలు లేని గ్రామాలున్నాయని చెప్పారు. మోదీ ప్రభుత్వంలో ప్రతి గ్రామానికి మౌలిక సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మున్సిపాలిటీలు ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందిస్తే పన్నుల రూపంలో నిధులు పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా మున్సిపాలిటీలకు రూ.85వేల కోట్లు కేటాయించామన్నారు. జిల్లాకి సంబంధించి రామాయపట్నం పోర్టు ఏర్పాటుకి కృషి చేస్తామని తెలిపారు.

వాన్‌పిక్‌ పై చర్యలు తీసుకొని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిపినట్లు చెప్పారు. నగరంలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీకి సంబంధించి డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపితే పరిశీలించి తప్పక సహకరిస్తానన్నారు. చీమకుర్తి నుంచ హైవే ఏర్పాటు చేస్తామని వివరించారు. తన రాజకీయ ప్రవేశం ఒంగోలు నుంచే ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. 1977లో ఎంపీగా మొదటిసారి ఒంగోలు నుంచే పోటీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు అధ్యక్షత వహించారు.

మరిన్ని వార్తలు