భవిష్య నిధిలో ‘నిర్వహణ’ కోత

15 Nov, 2018 11:41 IST|Sakshi

మున్సిపల్‌ ఉపాధ్యాయులకు సర్కారు షాక్‌

పీఎఫ్‌ వడ్డీపై 2 శాతం నిర్వహణ చార్జీలు వసూలు చేయాలని నిర్ణయం

తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మున్సిపల్‌ టీచర్ల సంఘాలు

వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌

విశాఖ సిటీ : ఎక్కడా లేని విధంగా మున్సిపల్‌ ఉపాధ్యాయుల భవిష్య నిధి(పీఎఫ్‌) సొమ్ముపై వచ్చే వడ్డీలో 2 శాతం సొమ్మును నిర్వహణ చార్జీల పేరుతో వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని మున్సిపల్‌ ఉపాధ్యాయ సం ఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపా«ధ్యాయులు, ఉద్యోగుల జీతాలను గతంలో లోకల్‌ ఫండ్‌(ఎల్‌ఎఫ్‌) ఆడిట్‌ ద్వారా చెల్లించేవారు. వారి పీఎఫ్‌ ఖాతాలను మున్సిపాలిటీలే నిర్వహించేవి. అనంతరం 010 పద్దు కింద జీతాల చెల్లింపులను ప్రారంభించడంతో పీఎఫ్‌ అకౌంట్ల నిర్వహణ బాధ్యతలను మున్సిపాల్టీలు నిలిపివేశాయి.

దీంతో పీఎఫ్‌ ఖాతాలు ట్రెజరీ పరిధిలోకి వెళ్లాయి. తమను పీఎఫ్‌ ఖాతాల నుంచి జీపీఎఫ్‌ ఖాతాలకు మార్చాలంటూ మున్సిపల్‌ ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ శాఖాధికారులను కోరాయి. దీంతో డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌(డీఎంఏ) 2017 జూలై 10న మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే అమలు చేయాలని సూచించారు. కానీ, ఇప్పటికీ పట్టించుకోలేదు.

నిర్వహణ చార్జీల పేరుతో..
తమను జీపీఎఫ్‌ పరిధిలో చేర్చాలంటూ మున్సిపల్‌ ఉపాధ్యాయ సంఘాలు పదేపదే కోరడంతో ప్రభుత్వంలో కదలిక మొదలైంది. ఏడాది క్రితం డీఎంఏ జారీ చేసిన ఉత్తర్వులను పక్కనపెట్టి, మున్సిపల్‌ ఉపాధ్యాయులకు ట్రెజరీ పరిధిలో పీఎఫ్‌ అమలు కోసం కమిటీ వేశారు. ఇందులో మున్సిపల్‌ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధి ఒక్కరు కూడా లేరు. ఈ కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలు ఉపాధ్యాయుల పాలిట గొడ్డలిపెట్టులా మారాయి. మున్సిపల్‌ టీచర్ల పీఎఫ్‌ ఖాతాలను ప్రస్తుతం ట్రెజరీలు నిర్వహిసున్నారు. ఇందుకుగాను ప్రతి ఖాతా నిర్వహణకు 2 శాతం మెయింటెనెన్స్‌ చార్జీలు వసూలు చేయనున్నట్లు విధివిధానాల్లో పేర్కొన్నారు. పీఎఫ్‌ సొమ్ముపై వడ్డీలో ఈ 2 శాతం కోత విధించనున్నట్లు తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఇతర ప్రభుత్వ ఉద్యోగుల పీఎఫ్‌ ఖాతా నిర్వహణకు ఈ విధంగా మెయింటెనెన్స్‌ చార్జీలు వసూలు చేయడం లేదు. రాష్ట్రంలో 14 వేల మంది టీచర్లుండగా, వీరిలో 4 వేల మంది సీపీఎఫ్‌ పరిధిలోకి వస్తున్నారు. మిగిలిన 10 వేల మంది మున్సిపల్‌ ఉపాధ్యాయుల పీఎఫ్‌ ఖాతాల్లోంచి 2 శాతం కోత విధించనున్నారు.

మున్సిపల్‌ టీచర్లంటే చిన్నచూపా?
ఒకే డీఎస్సీలో ఎంపికైనా ఇతర ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో పోలిస్తే మున్సిపల్‌ పాఠశాలల టీచర్లు పలు హక్కుల్ని కోల్పోతున్నారు. మున్సిపల్‌ టీచర్లకు ఎల్‌టీసీ, జీపీఎఫ్‌ వంటి సౌకర్యాలను ప్రభుత్వం కల్పించలేదు. జిల్లా పరిషత్‌ పాఠశాలల హెచ్‌ఎంలకు ఉన్న డీడీవో అధికారాలు మున్సిపల్‌ స్కూళ్ల టీచర్లకు లేవు. 2009లో అప్పటి ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో మున్సిపల్‌ టీచర్ల పరిస్థితిపై అధ్యయనానికి ఒక కమిటీని నియమించింది. ఇతర రాష్ట్రాల్లో మున్సిపల్‌ టీచర్లకు డీడీవో అధికారాలు, జీపీఎఫ్‌ సౌకర్యాలు ఉన్నాయని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. దాంతో మున్సిపల్‌ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలు చెల్లించడంతోపాటు డీడీవో అధికారాలు, జీపీఎఫ్‌ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. కానీ, డీడీవో అధికారాలు, జీపీఎఫ్‌ సౌకర్యాలు ఇప్పటికీ అమల్లోకి రాలేదు.

ప్రభుత్వం పునరాలోచించాలి
‘‘పీఎఫ్‌ సొమ్ముపై వచ్చే వడ్డీ నుంచి 2 శాతం కోత విధించాలన్న సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనిపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. ఇతర రాష్ట్రాల్లో మున్సిపల్‌ ఉపాధ్యాయులకు జీపీఎఫ్‌ సౌకర్యం ఉంది. మన రాష్ట్రంలో పుంగనూరు మున్సిపల్‌ ఉపాధ్యాయులకు మాత్రమే జీపీఎఫ్‌ సౌకర్యం కల్పించారు. ఈ విధానాన్ని అన్నిచోట్లా అమలు చేయాలి’’
– బి.హేన, ఏపీ మున్సిపల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు, విశాఖపట్నం


జీపీఎఫ్‌ విధానం కావాలి
‘‘మున్సిపల్‌ టీచర్లకు పీఎఫ్‌ కాకుండా జీపీఎఫ్‌ విధానాన్ని అమలు చేయాలి. 2 శాతం నిర్వ హణ చార్జీలు వసూలు చేయాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరిం చుకోవాలి. మున్సిపల్‌ టీచర్ల భవిష్య నిధి విధివిధానాల్ని రూపొందించేందుకు నియ మించిన కమిటీలో మున్సిపల్‌ ఉపాధ్యాయులకు స్థానం కల్పించకపోవడం దారుణం’’     
– శ్రీనివాసరావు, మున్సిపల్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌

మరిన్ని వార్తలు