చంద్రబాబుది డాబుసరి

21 Jul, 2015 23:49 IST|Sakshi

మున్సిపల్ కార్మికుల పోరాటానికి అండగా ఉంటాం
 రౌండ్‌టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కేంద్రపాలకమండలి సభ్యుడు రాజన్నదొర
 సాలూరు: ముఖ్యమంత్రి చంద్రబాబుది డాబుసరి పరిపాలన అని సాలూరు ఎమ్మెల్యే,   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలకమండలి సభ్యుడు పీడిక రాజన్నదొర ఎద్దేవా చేశారు. మారిన మనిషినని ప్రజలను నమ్మించి తన నిజస్వరూపాన్ని చూపుతున్నారన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సీఐటీయు జిల్లా కార్యదర్శి ఎన్‌వై నాయుడు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమ్మెపై మంగళవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యోగాలను రెగ్యులర్ చేసేస్తానని, మెరుగైన జీతాలు అందిస్తానని స్పష్టం చేసిన చంద్రబాబు, అధికారంలోకి వచ్చాక  ఉన్న ఉద్యోగాలు ఊడపీకే పనిలో పడ్డారన్నారు.
 
  ప్రభుత్వం జారీ చేసిన జీఓలనే అమలుచేయడం లేదని ఆరోపించారు. మున్సిపల్ కార్మికులు కొత్త డిమాండ్లేమీ చేయడంలేదని, చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగానే ఉద్యోగాలు రెగ్యులర్ చేయమంటున్నారని, 10వ పీఆర్సీ ప్రకారం కనీస వేతనాలను చెల్లించాలంటున్నారన్నారు. గోదావరి పుష్కరాలు ముగిసిన అనంతరం అక్కడ పనిచేస్తున్న కార్మికులను రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పంపి, సమ్మె చేస్తున్న కార్మికుల సంగతి తేల్చేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్లు సమాచారముందన్నారు. అందువల్ల రాష్ట్ర స్థాయిలో కార్మికులు ఆందోళనలు, నిరసనలు ఉద్ధృతం చేయాలని సూచించారు. మున్సిపల్ కార్మికుల న్యాయమైన పోరాటానికి వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుందన్నారు. అంతకుముందు మాట్లాడిన రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి ప్రకాశ్ ముఖ్యమంత్రికి కార్మికుల సమస్యలు పట్టడంలేదని, ప్రజల ఆరోగ్యంతో ఆయనకు పనిలేకుండా పోతోందన్నారు. సీపీఐ సాలూరు ఏరియా కార్యదర్శి ఎస్ రామచంద్రరావు మాట్లాడుతూ కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ చట్టాలను చేస్తున్నాయన్నారు.
 
 కాంగ్రెస్ పార్టీ నాయకుడు కె చంద్రశేఖరరావు మాట్లాడుతూ గతంలో ఉన్న ప్రభుత్వాలు 8వ, 9వ పీఆర్సీలను చక్కగా అమలు చేశాయని, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం కూడా 10వ పీఆర్‌సీని కార్మికులకు వర్తింపజేయాలని డిమాం డ్ చేశారు. సమావేశంలో బీజేపీ పట్టణ నాయకుడు లక్ష్మణరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు జరజాపు ఈశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షుడు సువ్వాడ రమణ, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎం.గంగమ్మ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వంగపండు అప్పలనాయుడు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు గేదెల సత్యనారాయణ, ఐద్వా జిల్లా కార్యదర్శి వి.లక్ష్మి, సీపీఎం నాయకుడు శ్రీనివాస్, లోక్ సత్తా నాయకుడు రధంగపాణి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పువ్వల నాగేశ్వరరావు, వైఎస్సార్ సీపీ జిల్లా యువజన సంఘ ప్రధాన కార్యదర్శి నాగార్జున, కౌన్సిలర్‌లు ఎం.అప్పారావు, టి.రవి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు