కదం తొక్కిన కార్మికులు

25 Jul, 2015 02:16 IST|Sakshi

తహశీల్దార్, ఆర్డీవో కార్యాలయాల వద్ద ఆందోళన
చిత్తూరులో కలెక్టరేట్ ముట్టడి
మద్దతిచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులతో పాటు కార్మికుల అరెస్టు
నేటి నుంచి సమ్మెను ఉధృతం చేస్తామన్న నాయకులు

 
 తిరుపతి కార్పొరేషన్: జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఆరు మున్సిపాలిటీల్లో కార్మికులు చేస్తున్న సమ్మె 15వ రోజుకు చేరింది. సమ్మెలో ఉన్న కార్మికులు రోజుకో రీతిలో ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టు లేదు. ఒక పక్క పట్టణాల్లో చెత్త పేరుకుపోవడం, దుర్గంధం వెదజల్లి ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నాలుగు రోజుల్లో మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తీర్చకపోతే రాష్ర్టవ్యాప్త బంద్ చేస్తామని వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడంతో మున్సిపల్ కార్మికుల్లో నూతనోత్తేజం నెలకొంది. అందులో భాగంగానే కార్మికులు ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి నిరసన తెలిపారు.

చిత్తూరులో కలెక్టరేట్ ముట్టడించిన కార్మికులకు వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి మద్దతు తెలిపి, ఆందోళనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు గాయత్రితో పాటు కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొన్న ఏఐటీయూసీ నాయకుడు నాగరాజు, సీఐటీయూ నాయకులు చైతన్యతో పాటు 150మంది కార్మికులను అరెస్టుచేశారు. ఆపై సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మదనపల్లెలో కార్మికుల సమ్మెకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి, కౌన్సిలర్లు బాలగంగారెడ్డి, మస్తాన్ రెడ్డి, ఖాజీ మద్దతు పలికి, ధర్నాలో పాల్గొన్నారు.  తిరుపతిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నగరంలో పెద్ద ఎత్తున కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించారు.  పలమనేరు, పుత్తూరు, నగరిలో తహశీల్దార్ కార్యాలయాలను ముట్టడించారు. పుంగనూరులో కార్మికుల ధర్నా చేశారు. ఇక ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.   
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు