మంత్రి ఇంటి ముట్టడికి యత్నం

7 Oct, 2018 07:59 IST|Sakshi

మున్సిపల్‌ కార్మికులను అడ్డుకున్న పోలీసులు, కొద్దిసేపు వాగ్వాదం

ముఖ్య నాయకులుకలిసేందుకు అనుమతి

మంత్రి శిద్దాకు వినతిపత్రం అందజేత

ఒంగోలు టౌన్‌:  జీఓ నెం 279 రద్దుచేసి, ఆర్‌టీఎంఎస్‌ విధానాన్ని ఎత్తివేయాలని కోరుతూ మునిసిపల్‌ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం నాటికి మూడో రోజుకు చేరుకొంది. సమ్మెలో భాగంగా జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు ఇంటిని ముట్టడించాలని జిల్లా నాయకత్వం నిర్ణయించింది. స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి కార్మికులు, నాయకులు ప్రదర్శనగా బయలుదేరి మంగమూరురోడ్డులోని మంత్రి ఇంటిని ముట్టడించేందుకు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించడంతో రోడ్డు మొదట్లోనే ఆందోళనకారులను అడ్డుకున్నారు. 

తాము లోపలికి వెళతామంటూ ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. చివరకు మంత్రిని కలిసేందుకు ముఖ్య నాయకులకు అనుమతి ఇచ్చారు. మంత్రి శిద్దా రాఘవరావు ఛాంబర్‌ వద్దకు చేరుకొన్నారు. అక్కడే  కలెక్టర్‌ వినయ్‌చంద్, జాయింట్‌ కలెక్టర్‌ నాగలక్ష్మి ఉన్నారు. వారి సమక్షంలో మునిసిపల్‌ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. 

అంతకు ముందు మునిసిపల్‌ కార్మికులను ఉద్దేశించి సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు జీవీ కొండారెడ్డి మాట్లాడుతూ మునిసిపల్‌ కార్మికుల ఉనికికి గొడ్డలి పెట్టు అయిన జీఓ నెం 279ని ప్రభ్వుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తుంటే, ఆర్‌టీఎంఎస్‌ పేరుతో కార్మికులను ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు.   జేఏసీ నాయకుడు శ్రీరాం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో పారిశుద్ధ్య కార్మికులు అంకితభావంతో విధులు నిర్వర్తించడం వల్లనే రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచిందన్నారు.

 ఈ విషయాన్ని గుర్తెరగని నగర పాలక సంస్థ కమీషనర్‌ కార్మికులను ఇబ్బందులకు గురిచేసేందుకు ప్రయత్నించడం సరికాదన్నారు. నగర పాలక సంస్థ కార్యాలయంలోకి పారిశుధ్య కార్మికులు ప్రవేశించకుండా ఉండాలన్న ఉద్ధేశంతో గేట్లకు తాళాలు వేయించడం సరికాదన్నారు. కార్మికులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. జేఏసీ నాయకుడు ఎస్‌డీ సర్ధార్‌ మాట్లాడుతూ జీఓ నెం 279 రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. 11వ పీఆర్‌సీ ప్రకారం వేతన సవరణ చేయాలన్నారు. మునిసిపల్‌ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు తంబి శ్రీనివాసులు, టి.మహేష్, కె.శ్రీనివాసరావు, యూ రత్నకుమారి పాల్గొన్నారు. 

14 మందిపై కేసు నమోదు
ఒంగోలు: నగరపాలక సంస్థ కమిషనర్‌ సంకురాత్రి వెంకట కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 14 మందిపై ఒంగోలు వన్‌టౌన్‌ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఈనెల 4వ తేదీ నుంచి ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులు ఎక్కువమంది సమ్మె చేస్తున్నారు. కొందరు మాత్రం విధులకు హాజరవుతున్నారు. శనివారం  కార్మికులు చేస్తున్న పనికి ఆటంకం కలిగించడంతోపాటు శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ల విధులకు కోర్నిపాటి శ్రీనివాసరావు, కొల్లాబత్తిన గోపి, ఊదరగుడి సామ్రాజ్యం, కాకర్లమూడి సామ్రాజ్యం, తంబి శ్రీనివాసులు(సీఐటీయూ), ఊరగాయల నాగరాజు, రంపతోటి శ్రీనివాసరావు, కోర్నెపాటి రవికుమార్, కోర్నెపాటి బాలకృష్ణ, తేళ్ల విజయ, బందెళ సుబ్బారావు, శ్రీరామ్‌ శ్రీనివాసరావు, పిల్లి శారద, బండ్ల ఏడుకొండలు అనే వారు ఆటంకం కలిగిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 14 మందిపై కేసు నమోదు చేశారు.  

మరిన్ని వార్తలు