మున్సిపల్‌ కార్మికుల సమ్మె తీవ్రతరం

10 Oct, 2018 14:38 IST|Sakshi
వెంకటగిరి: ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి చినవెంకటరమణయ్యను అరెస్టు చేస్తున్న పోలీసులు

కార్మికసంఘం నాయకుల అరెస్ట్‌

సీఎంకు వ్యతిరేకంగానినాదాలు చేసిన కార్మికులు

నెల్లూరు, వెంకటగిరి: వెంకటగిరి మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం తీవ్ర రూపం దాల్చింది. పట్టణంలో పారిశుధ్య పనులు చేపట్టేందుకు కమ్మవారిపల్లి, దగ్గవోలు, సాంబయ్యబావి దళిత, గిరిజన వాడల నుండి 100 మందికి పైగా ప్రయివేటు వ్యక్తులను  పనులకోసం ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ , మున్సిపల్‌ కమిషనర్‌ గంగాప్రసాద్‌లు మంగళవారం ఉదయం తీసుకువచ్చారు. వారిని కార్మిక సంఘాల నాయకులు అడ్డుకోవడంతో పోలీసుల రంగప్రవేశం చేసి 14 మందిని అరెస్టు చేసి డక్కిలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఆ సమయంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె. చినవెంకటరమణయ్య సీఎం చంద్రబాబు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. మధ్యాహ్నం అరెస్టు చేసిన కార్మిక సంఘాల నాయకులను  వ్యక్తిగత పూచీకత్తుతో విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎస్సై కొండపనాయుడు మాట్లాడుతూ సమ్మెలో అవాంఛనీయ సంఘటనలు జరకుండా ముందస్తు జాగ్రత్తల నేపథ్యంలో కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేసి అనంతరం విడుదుల చేసినట్లు తెలిపారు.  కార్మికుల సమ్మెను విరమింపజేసేందుకు ప్రయత్నించాల్సిన  అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు వారిని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసు కేసుల పేరుతో వారిని అరెస్టు చేసి ఉద్యమంపై ఉక్కుపాదం మోపడంపై కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. కార్మికులు విధులకు హజరుకాకపోతే ప్రయివేటు వ్యక్తులతో పారిశుధ్యం పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవడం అధికారపార్టీ నాయకుల మొండివైఖరికి నిదర్శనమని  కార్మిక సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ  ఆదేశాలతో ఇతర ప్రాంతాలనుంచి ప్రయివేటు వ్యక్తులను రప్పించి పారిశుధ్య పనులు చేయించడం ఏమిటని ప్రశ్నించారు. 

కార్మిక వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర
కావలిఅర్బన్‌: మున్సిపల్‌ కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని సీపీఎం పట్టణ కార్యదర్శి పి.పెంచలయ్య అన్నారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయం ముందు పారిశుద్ధ్యం కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా బుధవారం అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ప్రజాసంఘాలు, వైఎస్సార్‌ఎస్‌యూ, వామపక్షాల ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు ఈ ప్రదర్శన జరిగింది. అనంతరం పెంచలయ్య మాట్లాడుతూ 279 జీఓను తెచ్చి పారిశుద్ధ్య కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 15 మందిచేయాల్సిన పనిని కేవలం ఇద్దరు కార్మికులచేత చేయించాలని ప్రయత్నిస్తోందన్నారు.  సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు టి. మాల్యాద్రి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి  సత్యనారాయణ, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకుడు  అంకయ్య, పద్మ, మాలకొండయ్య, రమ, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

ప్రయివేటు కార్మికులను అడ్డుకున్న మున్సిపల్‌ కార్మికులు
ఆత్మకూరు: మున్సిపల్‌ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ కార్మికులతో పారిశుధ్యపనులను చేపట్టారు. వీరిని మంగళవారం రాత్రి మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు. రాత్రి సమయాల్లో కమిషనర్‌  ప్రయివేటు వ్యక్తులతో  పనులు చేయించడం దారుణమని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఎల్‌ఆర్‌పల్లి, జెఆర్‌పేట ప్రాంతాల్లో పనులు చేస్తున్న వారిని సమ్మె కార్మికులు అడ్డుకుని పనులు నిలిపివేయించారు. కమిషనర్‌ చర్యలను ఖండిస్తూ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక నాయకులు హజరత్తయ్య,  నాగరాజు, గడ్డం నాగేంద్ర, పెంచలయ్య, పలువురు మహిళా కార్మికులు ఉన్నారు.  

>
మరిన్ని వార్తలు