అన్ని మున్సిపాలిటీలు ఇక ఓడీఎఫ్

29 Sep, 2016 21:10 IST|Sakshi
అన్ని మున్సిపాలిటీలు ఇక ఓడీఎఫ్

అక్టోబర్ 2న సీఎం ప్రకటన చేస్తారన్న మంత్రి నారాయణ
రాష్ట్రంలో 10 సాలీడ్‌ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్


విజయవాడ: రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలను అక్టోబర్ 2వ తేదీన ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ (ఓడీఎఫ్) ప్రాంతాలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించనున్నారని మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. క్వాలిటీ కంట్రోల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం రానున్న మూడు నెలల్లో అన్ని మునిసిపాలిటీలలో పర్యటించి పరిస్థితుల్ని అధ్యయనం చేసి సర్టిఫికెట్లు ఇస్తోందని చెప్పారు. ఈమేరకు ఆయా మునిసిపాలిటీల్లో బహిరంగ మలమూత్ర విసర్జన కట్టడికి చర్యలు చేపట్టినట్లు వివరించారు. విజయవాడ నగరపాలక సంస్థకు ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ సర్టిఫికెట్ ప్రదానం సందర్భంగా కౌన్సిల్ హాల్లో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. భారతదేశంలోనే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీలో మొట్టమొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు.

2019 నాటికి నూరుశాతం ఓడీఎఫ్ సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించగా మూడేళ్ళు ముందే మనం ఉన్నామన్నారు. సాలిడ్ వేస్ట్ ఎనర్జీ నిర్వహణకు రాష్ట్రంలో 10 ప్లాంట్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 110 మునిసిపాలిటీల్లో రోజుకు 7,500 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోందని, ఎనర్జీ ప్లాంట్స్ ద్వారా 4,300 టన్నుల చెత్తను ఎనర్జీప్లాంట్స్ ద్వారా తగలబెట్టడం జరుగుతోందన్నారు. ఎనర్జీ ప్లాంట్స్‌కు 50 కి.మీ దూరంలో ఉన్న మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించనున్నట్లు పేర్కొన్నారు. క్వాలిటీ కంట్రోల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతినిధి రాహుల్ ప్రతాప్ సింగ్, మేయర్ కోనేరు శ్రీధర్, కమిషనర్ జి.వీరపాండియన్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు