కోరినంత ఇస్తే కోరుకున్న చోటికి..

7 Sep, 2014 23:35 IST|Sakshi

- పురపాలికల్లో బదిలీలకు రంగం సిద్ధం
- సిఫారసులకు వెల పెట్టిన టీడీపీ ఎమ్మెల్యేలు!
- అనుకూలుర కోసం చైర్మన్ల ప్రయత్నం
 సాక్షి, రాజమండ్రి : ప్రభుత్వం బదిలీల జాతరకు తెర లేపడంతో అటు ఉద్యోగుల్లోనే కాక రాజకీయ నేతల్లోనూ హడావిడి మొదలైంది. పురపాలికల్లో తమ వారిని నియమించుకునేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే వ్యక్తిగత సర్వేలు ప్రారంభించారు. అంతే కాక తమ వద్దకు బదిలీల సిఫారసు లేఖల కోసం వచ్చే వారికి ఓ రేటు నిర్ణయించి, వ్యక్తిగత సహాయకుల (పీఏ) సహకారంతో ఇంట్లోనే దుకాణాలు తెరిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కాగా తమకు అనుకూలంగా ఉండగలరనుకున్న వారిని తమ పట్టణాలకు రప్పించుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్లు తాపత్రయపడుతున్నారు.
 
జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో బదిలీలకు పురపాలక శాఖ శనివారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక మున్సిపాలిటీలో మూడేళ్లు పని చేసిన వారు బదిలీకి అర్హులవుతారు. ఈ నెల 15లోగా అర్హులైన ఉద్యోగుల జాబితాలు తయారు చేసి  బదిలీలు చేపడతారు. ఈ నెల 30లోగా బదిలీలు పూర్తవ్వాల్సి ఉంటుందని ముందు సూచించినా అక్టోబర్ 10 వరకూ ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఈ ప్రకారం 11  నుంచి బదిలీలపై నిషేధం మళ్లీ అమలులోకి వస్తుంది.

మున్సిపాలిటీల  మినిస్టీరియల్ సిబ్బందికి అదేచోట విభాగం మారడం ప్రాతిపదికన కాక పట్టణం ప్రాతిపదికన బదిలీ ఉంటుంది. ఉపాధ్యాయులకు ఇతర ఉద్యోగులకు కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు నిర్వహిస్తారు. మున్సిపాలిటీల్లోని ఆరోగ్య విభాగం ఇతర విభాగాల ఉద్యోగులకు కూడా ప్రాంతాన్ని ప్రాతిపదికగానే బదిలీ అవుతుంది. మున్సిపాలిటీల వారీగా ఉద్యోగులు, వారి సీనియారిటీ జాబితాలను సోమవారం నుంచి తయారు చేసేందుకు కమిషనర్లు సిద్ధమవుతున్నారు.
 
కోట్లు దండుకునే అవకాశం..!
సాధారణంగా బదిలీలప్పుడు ఉద్యోగులు తమకు కావల్సిన ప్రాంతాలకు వెళ్లాలని ఆరాటపడుతూ, తమ ప్రాంత ఎమ్మెల్యేనో, మంత్రినో ఆశ్రయించడం పరిపాటి. ప్రస్తుతం మున్సిపల్ ఉద్యోగులు కూడా ఈ రకంగా క్యూలు కట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే అవకాశంగా జిల్లాలో అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలకు రేట్లు నిర్ణయించి, వాటి వివరాలను తమ పీఏల ద్వారా ఇప్పటికే ఉద్యోగులకు చేరవేసినట్టు తెలుస్తోంది. మినిస్టీరియల్ సిబ్బంది బదిలీ సిఫారసుకు రూ.మూడు లక్షల నుంచి రూ. ఐదు లక్షలు; క్లాస్-4 ఉద్యోగులకు కనీసం రూ. రెండు లక్షలు నిర్ణయించినట్టు సమాచారం. జిల్లాలో 2 వేల మంది మున్సిపల్ ఉద్యోగులు అనుకూల బదిలీల కోసం తమ ప్రయత్నాలు చేస్తారు కాబట్టి ఇదే అదనుగా కోట్లు దండుకునేందుకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఆరాటపడుతున్నారు.
 
మా ప్రాంతానికి మావారే రావాలి
కాగా పట్టణ ప్రణాళికా విభాగం వంటి కీలక విభాగాల్లో పని చేసే అధికారులు తమకు అనుకూలంగా పనిచేసే వారై ఉండాలని కోరుకుంటున్న మున్సిపల్ చైర్‌పర్సన్లు అందుకు ఎమ్మెల్యేల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు సంబంధిత ఉన్నతాధికారులతో, మంత్రితో మంతనాలు జరుపుతున్నట్టు టీడీపీ వర్గాలే అంటున్నాయి. జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ నగరపాలక సంస్థలు, ఏడు మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల్లో సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో మూడొంతుల మంది బదిలీలకు అర్హులవుతారని, ఈ నెల 15కల్లా దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు