మంత్రి ‘పల్లె’ కళాశాల సీజ్‌

8 Mar, 2017 02:19 IST|Sakshi
మంత్రి ‘పల్లె’ కళాశాల సీజ్‌

ఆస్తి పన్ను చెల్లించని ఫలితం
‘వాళ్లకెంత ధైర్యం.. వాళ్ల కథ నేను చూస్తాలే’ అంటూ సమాధానం  


కదిరి: ఆస్తి పన్ను చెల్లించని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథ రెడ్డికి సంబంధించిన ఓ కాలేజీని మున్సిపాలిటీ అధికారులు సీజ్‌ చేశారు.  కదిరిలో మంత్రి పల్లెకు చెందిన శ్రీనివాస జూనియర్‌ కాలేజీకి రూ. 1.61 లక్షల మేర ఆస్తి పన్ను బకాయి ఉంది. మున్సిపల్‌ కమిషనర్‌ భవానీప్రసాద్‌ మంగళవారం రెవెన్యూ సిబ్బందితో కాలేజీ వద్దకు వెళ్లి పన్ను చెల్లించాలంటూ గంటకు పైగా డప్పు వాయిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. ఆస్తిపన్ను గురించి  బిల్డింగ్‌ యజ మానితో మాట్లాడుకోవాలని ఆ కాలేజీ ప్రిన్సి పల్‌ సూర్యప్రకాశ్‌ చెప్పడంతో మున్సిపల్‌ కమిషనర్‌ అక్కడి నుంచే బిల్డింగ్‌ యజమాని రామ సుబ్బారెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. బిల్డింగ్‌ పన్నులన్నీ కడతానని మంత్రి పల్లె తనకు అగ్రిమెంట్‌ రాసిచ్చాడని ఆయన సమాధానం చెప్పారు.

నా కాలేజీలోనే డప్పు వాయిస్తారా!
ఇదంతా జరుగుతుండగానే సదరు కాలేజీ ప్రిన్సిపాల్‌ అసెంబ్లీలో ఉన్న మంత్రి పల్లెకు ఫోన్‌ ద్వారా సమాచారం చేరవేశారు. స్పందిం చిన మంత్రి ‘మన కళాశాల ఆవరణలోకి వచ్చి డప్పు వాయిస్తారా? వారికెంత ధైర్యం.. వాళ్ల కథ నేను చూస్తాలే.. ఆ విషయం నేను మున్సి పల్‌ మంత్రి నారాయణతో మాట్లాడతాను’ అని సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.  అయితే బకాయి కోసం వారం కిందటే రెడ్‌ నోటీస్‌ ఇచ్చామని చెప్పిన కమిషనర్‌..  కాలేజీ ఆఫీస్‌ రూం, స్టాఫ్‌ రూంలకు తాళం వేసి, సీల్‌ వేశారు. కాగా, కదిరిలోనే మంత్రి పల్లె నిర్వహిస్తున్న వివేకానంద డిగ్రీ కాలేజీ కూడా రూ. 84 వేల  ఆస్తి పన్ను బకాయి ఉంది.

ఆ పన్ను బిల్డింగ్‌ ఓనర్‌కే సంబంధం
కదిరిలో మా శ్రీనివాస కాలేజీ బిల్డింగ్‌కు సంబంధించి ఆస్తి పన్నుకు మాకు ఎలాంటి సబంధం లేదు. ఆ బకాయి బిల్డింగ్‌ యజమానే చెల్లించాలి. అయినప్పటికీ మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన బకాయి చెక్కు రూపంలో పంపాను.
    – మంత్రి పల్లె రఘునాథరెడ్డి

మరిన్ని వార్తలు