సై... అంటే సరికాదు...

31 Oct, 2018 07:29 IST|Sakshi
తడి పొడి చెత్త వేరు చేయటంలో అవగాహన లోపానికి నిదర్శనంగా నిలుస్తున్న పేరుకుపోయిన చెత్త

స్వచ్ఛత సర్వేక్షణ్‌–19లో దేశవ్యాప్తంగా మునిసిపాలిటీల పోటీ

విజయనగరంలో కానరాని సన్నాహక చర్యలు

జనవరి 4 నుంచే మొదలుకానున్న క్షేత్రస్థాయి పరిశీలన

గడచిన రెండేళ్లలో సాధించిన ర్యాంక్‌ అంతంతే...

సమన్వయలోపం... ప్రణాళిక లేకే విఫలం

ఏ అంశంలోనైనా పోటీ పడాలంటే దానికి తగ్గ కసరత్తు ఉండాలి. కనీసం ప్రయత్నమైనా చేయాలి. కానీ ఇవేవీ లేకుండా పోటీలో ఉన్నామని చెబితే మాత్రం గెలుపు సాధ్యమవుతుందా... ఇప్పుడు విజయనగరం మునిసిపాలిటీ పరిస్థితి అలాగే ఉంది. స్వచ్ఛత సర్వేక్షణ్‌ –19కోసం దేశవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీలు పోటీపడుతున్నాయి. అందులో విజయనగరమూ ఉంది. కానీ ఇక్కడ ఆ పోటీకి తగ్గట్టుగా ఎలాంటి ప్రణాళికా అమలు చేయడంలేదు. ఎక్కడి చెత్త అక్కడే ఉంది. కాలువలు కంపుకొడుతున్నాయి. దుర్వాసన వెదజల్లుతూనే ఉంది. మరి పోటీలో ఉంటే ఇలాగేనా పారిశుద్ధ్యం ఉండేది అన్నదే నగరవాసుల సందేహం.

విజయనగరం మున్సిపాలిటీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌–2019 పోటీ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ పోటీలో దేశంలోని అన్ని మున్సిపాలిటీలు పోటీ పడుతున్నాయి. ఇందులో విజయనగరం కూడా ఉంది. ఇప్పటికే మిగిలిన మున్సిపాలిటీలు పక్కా కార్యాచరణ రూపొందించుకుని పోటీకి సన్నద్ధమవుతున్నా యి. 2017లో 126వ ర్యాంక్, 2018లో 154వ ర్యాంకు దక్కించుకున్న విజయనగరం మున్సి పాలిటీ ఈ సారి ఏ స్థానాన్ని సాధిస్తుందన్నదే అందరిలోనూ ఉత్కంఠ. ఈ ఏడాది పోటీలోపాల్గొంటున్న మునిసిపాలిటీలు డాక్యుమెంటేషన్‌ ప్రక్రియతో పాటు దాని ఆధారంగా జరిగే క్షేత్ర స్థాయి పరిశీలనకు  సమాయత్తం అవుతుండగా... విజయనగరం మున్సిపాలిటీ ఇదేదీ ప్రారంభమే కాలేదు.

గత ఏడాది జనవరి 4 నుంచి మార్చి 4వ తేదీ వరకు పోటీలు నిర్వహించగా ఈ సారి మరింత కఠినతరం చేసిన కేంద్రం పోటీ గడువును కుదించింది. వచ్చే ఏడాది జనవరి 4 నుంచి 31వ తేదీ వరకే పరిశీలిస్తామని పేర్కొంది. గతంలో నాలుగు వేల మార్కులకు ఈ పోటీ నిర్వహించగా.. ప్రస్తుతం 5వేల మార్కులకు నిర్వహించనుంది. డాక్యుమెంటేషన్‌ ఆధారంగా నిర్వహించే  క్షేత్ర స్థాయి పరిశీలనల అంశంలో తప్పుడు సమాచారం ఇస్తే మైనస్‌ మార్కులు అమలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో 100శాతం డాక్యుమంటేషన్‌ పక్కాగా ఉండేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదీ స్వచ్ఛ సర్వేక్షణ్‌ ముఖ్య ఉద్దేశం
స్వచ్ఛ భారత్‌లో బాగంగా దేశ వ్యాప్తంగా పరిశుభ్రత అమలు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేను ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా నగరాలు, పట్టణాల మధ్య స్వచ్ఛత పోటీలు నిర్వహించి తద్వారా పరిశుభ్రమైన నగరాలుగా తీర్చిదిద్ది ప్రజలకు ఆరోగ్యవంతమైన, ఆహ్లాదకరమైన జీవన విధానాన్ని అందించటమే లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తోంది. మెరుగైన స్వచ్ఛతను అమలు చేస్తున్న నగరాలకు అవార్డులు, రివార్డులు ఇవ్వడంతో పాటు మరిన్ని మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకారం అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థలు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాయి. ఇందులో భాగంగా జనవరి 4 నుంచి 31 తేదీలోగా  కేంద్ర ప్రభుత్వానికి చెందిన క్వాలిటీ కంట్రోల్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు పట్టణంలో పర్యటించి స్వచ్ఛతను పరిశీలించనున్నారు.

విజయనగరంలో ఇంకా వెనుకబాటే...
2019 స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేకు సమాయత్తం అవుతున్న విజయనగరం మున్సిపాలిటీ ఇంకా పలు అంశాల్లో వెనుకబడే ఉంది. ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తే స్వచ్ఛత  సాధ్యపడటంతో పాటు మెరుగైన ర్యాంకు సాధించేందుకు అవకాశాలున్నాయి. ప్రధానంగా ఓడీఎఫ్, ప్లాస్టిక్‌ నిషేధం, పందులు, కుక్కల నియంత్రణ, తడి పొడి చెత్తను వేరు వేరుగా సేకరించటం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం 5వేల మార్కులకు నిర్వహించే పోటీలో సీనియర్‌ సిటిజన్స్‌ ఫీడ్‌బ్యాక్‌కు 1250 మార్కులు, క్షేత్ర స్థాయి తనిఖీలకు 1250 మార్కులు, డాక్యుమెంటేషన్‌కు 1250 మార్కులు, సర్టిఫికేషన్‌కు 1250 మార్కులు ఇవ్వనున్నారు.

ఎక్కడికక్కడే చెత్త
నగరంలో ఎక్కడ చూసినా ఇంకా చెత్త కనిపిస్తూనే ఉంది. మురుగునీటి కాలువలు ఇంకా పూర్తిస్థాయిలో శుభ్రం చేయాల్సి ఉంది. ఓ వైపు వాటిని శుభ్రం చేస్తున్నా... పెండింగ్‌లో ఉన్న విస్తరణ పనులవల్ల ఎక్కడా స్వచ్ఛత కానరావడం లేదు. అధికారుల మధ్య సమన్వయం ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇటీవల ముఖ్యమంత్రి వస్తారన్న ఆత్రంలో ఏవో అరకొర పనులు చేపట్టినా... ఆ తరువాత వాటిపై పెద్దగా శ్రద్ధ చూపించకపోవడంతో ఎక్కడా స్వచ్ఛత ఆనవాళ్లు కానరావడం లేదు. ఇదే పరిస్థితి సర్వే సమయానికీ కనిపిస్తే ఇక ర్యాంకులో మరింత వెనుకబడక తప్పదన్న వాదన వినిపిస్తోంది.

మెరుగైన ర్యాంక్‌ సాధనకు ప్రణాళిక
స్వచ్ఛ సర్వేక్షణ్‌–2019 సర్వేలో మెరుగైన ర్యాంకు సాధించే దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నాం. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. ఇప్పటి నుంచే ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మున్సిపాలిటీ తరఫున చిన్న చిన్న లోపాలను అధిగమించేలా చర్యలు చేపడుతున్నాం. దేశ వ్యాప్తంగా జరుగుతున్న పోటీలో విజయనగరం పట్టణాన్ని మెరుగైన స్థానంలో నిలబెట్టేలా ప్రయత్నం చేస్తాం.               – టి.వేణుగోపాల్, కమిషనర్, విజయనగరం మున్సిపాలిటీ

మరిన్ని వార్తలు