ఘటన ప్రాంతం మా పరిధిలోది కాదు

26 Oct, 2018 06:21 IST|Sakshi

మీడియా సమావేశంలో డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ వెల్లడి 

ప్రతిపక్ష నేత జగన్‌ కోరితే భద్రత పెంచుతాం

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగిన ప్రాంతం తమ పరిధిలోనిది కాదని, అది సీఐఎస్‌ఎఫ్‌ పరిధిలోనిదని డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ చెప్పారు. వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగిన తర్వాత మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. జగన్‌పై హత్యాయత్నం చేసిన జానిపల్లి శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లా ఠానేలంక గ్రామానికి చెందినవాడన్నారు. ఎయిర్‌పోర్టులోని ప్యూజియన్‌ రెస్టారెంట్‌లో ఏడాది నుంచి చెఫ్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో సెల్ఫీ దిగేందుకు వచ్చి జగన్‌కు అత్యంత సన్నిహితంగా వెళ్లి కోడి కాలికి కట్టే కత్తితో దాడి చేశాడని చెప్పారు.

ఈ దాడిలో జగన్‌ ఎడమ చేతికి గాయమైందన్నారు. వెంటనే జగన్‌ గన్‌మెన్‌లు దుండగుడిని పట్టుకుని సీఐఎఫ్‌ఎస్‌ అధికారులకు అప్పగించారని చెప్పారు. అతను జగన్‌ అభిమాని అని చెబుతున్నాడని, ఈ దాడి పబ్లిసిటీ కోసం అన్పిస్తోందని అన్నారు. పథకం ప్రకారమే ఈ దాడి జరిగినట్టు కనిపిస్తోందని, దీని వెనుక ఎవరున్నా రనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. అన్ని కోణాల్లో నూ ఈ కేసును దర్యాప్తు చేస్తామన్నారు. ఈ దాడికి సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిదే పూర్తి బాధ్యత అని డీజీపీ పేర్కొన్నారు.

దుండగుడు శ్రీనివాస్‌ను విచారించిన సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు అనంతరం తమకు అప్పగించారని డీజీపీ తెలిపారు. సీఐఎస్‌ఎఫ్‌ రిపోర్టు ఆధారంగా ఈ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. దాడికి పాల్పడిన శ్రీనివాస్‌ జేబులో ఒక లెటర్‌ను (తొమ్మిది, పది పేజీల లేఖ)ను కూడా సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది తమకు అందించారని తెలిపారు. నిందితుడి ఎడమ చేతిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కత్తి ఎయిర్‌పోర్టు లోపలికి ఎలా వెళ్లిందో తెలుసుకొనేందుకు సీఐఎస్‌ఎఫ్‌ అధికారులను ప్రశ్నిస్తున్నామని చెప్పారు. దాడికి గురైన ప్రతిపక్షనేత జగన్‌.. ప్రాథమిక చికిత్స అనంతరం విమానంలో హెదరాబాద్‌కు వెళ్లారన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌ కోరితే భద్రతను మరింత పెంచుతామని చెప్పారు. 

ప్రత్యేక దర్యాప్తు బృందం 
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసినట్టు డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం నార్త్‌ ఏసీపీ నాగేశ్వరరావు నేతృత్వంలో సిట్‌ దర్యాప్తు చేస్తుందని వెల్లడించారు. దాడికి పాల్పడిన దుండగుడు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు.

అప్పుడలా.. ఇప్పుడిలా.. 
కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని భావంచే విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందరూ చూస్తుండగానే రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో రాష్ట్ర పోలీసులు తప్పించుకునేలా దారులు వెదకడం విమర్శలకు తావిస్తోంది. హత్యాయత్నం వెనుక ఎవరున్నారు? ఎలా జరిగింది? గుండుసూదిని కూడా వెళ్లనివ్వని భద్రతా సిబ్బంది కత్తిని ఎలా పోనిచ్చారు? అనే వాటిపై దృష్టిపెట్టాల్సింది పోయి విమర్శలకు తావిచ్చేలా వ్యవహరిస్తున్నారు. సంచలనం రేపిన ఈ ఘటనపై డీజీపీ ఠాకూర్‌ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు ప్రభుత్వానికి వత్తాసు పలికేలా ఉన్నాయని రాజకీయ పక్షాల నేతలు తప్పుపడుతున్నారు.

భద్రతా వైఫల్యంతో విపక్ష నాయకునిపై హత్యాయత్నం జరిగితే ఏపీ పోలీసు బాస్‌ ఠాకూర్, సీఐఎస్‌ఎఫ్‌ ఐజీ సీవీ ఆనంద్‌ పరస్పర విరుద్ధంగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. విమానాశ్రయంలోకి వచ్చే ప్రయాణికులను పరిశీలించి పంపించడం వరకే తమ బాధ్యతని, వ్యక్తుల భద్రతాపరమైన అంశాలు తమ పరిధిలోకి రావని ఆనంద్‌ అంటే.. ఎయిర్‌పోర్టులో భద్రత తమకు సంబంధంలేదని సీఐఎస్‌ఎఫ్‌ చూసుకుంటుందని డీజీపీ మీడియాతో చెప్పారు. ఇదిలా ఉంటే.. విశాఖ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకున్న రెండు ప్రధాన ఘటనల్లో ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరు వారి ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోందని ప్రజలు ప్రస్తావిస్తున్నారు.

2017 జనవరి 26న ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు పలికేందుకు విశాఖకు వచ్చిన వైఎస్‌ జగన్‌ను అక్కడ విమానాశ్రయంలోని రన్‌వే పైనే అడ్డుకున్న వందలాది మందికి పైగా రాష్ట్ర పోలీసులు వ్యవహరించిన తీరును ప్రజలు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. తాజాగా.. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యా యత్నం ఘటనలో మాత్రం ఎయిర్‌పోర్టు తమ పరిధిలో లేదని డీజీపీ చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్ర పోలీసులు అప్పుడొకలా.. ఇప్పుడొకలా వ్యవహరించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.  

మరిన్ని వార్తలు