వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులు రేపటికి వాయిదా

7 Nov, 2018 04:49 IST|Sakshi

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆకస్మిక సెలవే కారణం

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యా యత్నం నేపథ్యంలో దాఖలైన వ్యాజ్యాల విచారణ గురు వారానికి వాయిదా పడింది. ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్‌ ఆకస్మిక సెలవు నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యాజ్యాలకు గురువారం వచ్చే కేసుల విచారణ జాబితాలో స్థానం కల్పించాలని రిజిస్ట్రీని న్యాయ మూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. తనపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి కూడా పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ రెండు వ్యాజ్యాలపై గత వారం విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ శేషసాయి, జగన్‌పై హత్యాయత్నం నేపథ్యంలో విమానాశ్రయాల్లో భద్రతా లోపాలపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)తో ఈ రెండు వ్యాజ్యాలను జతచేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో  జగన్, వైవీ సుబ్బారెడ్డిలు దాఖలు చేసిన వ్యాజ్యాలు కూడా మంగళవారం కేసు విచారణ జాబితాలో ఉన్నాయి. ఈ మూడు వ్యాజ్యాలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారించాల్సి ఉంది. అయితే, మంగళవారం ఆయన ఆకస్మికంగా సెలవు పెట్టడంతో, అత్యవసరమున్న వ్యాజ్యాల గురించి మరో సీనియర్‌ న్యాయ మూర్తి జస్టిస్‌ రామసు బ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించే వెసులుబాటును రిజిస్ట్రీ కల్పించింది. దీంతో జగన్‌మోహన్‌రెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి తమ వ్యాజ్యాల గురించి జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. 

అందుకే స్వతంత్ర సంస్థ దర్యాప్తు కోరుతున్నాం..
హత్యాయత్నం జరిగిన గంటలోపు డీజీపీ విలేకరుల సమావేశం పెట్టి మరీ నింది తు డు ప్రచారం కోసమే జగన్‌పై హత్యాయత్నం చేశారంటూ మాట్లాడారని  మోహన్‌ రెడ్డి అన్నారు.  ముఖ్యమంత్రి సైతం ఈ ఘటనను తక్కువ చేసేలా మాట్లాడారని మోహన్‌రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశంలేదని, అందుకే రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో లేని స్వతంత్ర దర్యాప్తు సం స్థకు దర్యాప్తు బాధ్యతలను అప్పగించాలని కోరుతున్నామన్నారు. ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యం విమానాశ్రయాల్లో భద్రతా లోపాలపై దాఖలైందని తెలిపారు.

ఈ సమయంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన పిటిషనర్ల తరఫు న్యాయవాది కృష్ణమూర్తి జోక్యం చేసుకుంటూ, తాము కూడా సీబీఐ దర్యాప్తునకు కోరుతున్నామని, ఆ రెండు వ్యాజ్యాల్లోని అభ్యర్థనలాగే తమ అభ్యర్థన కూడా ఉందన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారిం చాల్సింది సీజే ధర్మాసనమని, సీజే సెలవు నేపథ్యంలో మొదటి కోర్టు బాధ్యతలను తాము తాత్కాలికంగా నిర్వర్తిస్తున్నామని తెలిపింది. ఈ మూడు వ్యాజ్యాలను కలిపి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనమే విచారించడం సబబని అభిప్రాయపడింది.

మరిన్ని వార్తలు