అది హత్యాయత్నమే

29 Oct, 2018 01:28 IST|Sakshi

ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ను అంతం చేయడానికే కత్తితో దాడి

కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేసిన పోలీసులు

అదృష్టవశాత్తూ జగన్‌ కుడి వైపునకు తిరగడంతో ముప్పు తప్పింది

ఎడమపక్క భుజంపై రక్తం కారే బలమైన గాయం తగిలింది 

మళ్లీ పొడిచేందుకు దుండగుడి ప్రయత్నం

వైఎస్సార్‌సీపీ నేతలు అతడి నుంచి బలవంతంగా కత్తిని లాక్కున్నారు

ఆ కత్తిపోటు గొంతులో దిగి ఉంటే ప్రాణాలు దక్కేవి కావు

నిందితుడిపై ఐపీసీ సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేశాం

నిందితుడి వద్ద నుంచి 2.5 అంగుళాల కత్తి, గులాబీ రంగు కలిగిన మరో  బ్లేడు, లేఖ స్వాధీనం చేసుకున్నాం

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం:  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై గురువారం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన కత్తి దాడి ముమ్మాటికీ హత్యాయత్నమేనని పోలీసులు స్పష్టం చేశారు. జగన్‌ అదృష్టవశాత్తూ యాదృచ్ఛికంగా పక్కకు తిరగడంతో ముప్పు తప్పిందని, ఆ కత్తిపోటు గొంతులో దిగి ఉంటే ప్రాణాలు దక్కేవి కావని తేల్చిచెప్పారు. జగన్‌ను అంతం చేయాలనే ఉద్దేశంతోనే దుండగుడు శ్రీనివాసరావు కత్తితో దాడి చేశాడని వెల్లడించారు. ఎడమ చేతి భుజంపై కత్తి దింపి, వెనక్కి తీసి మరోసారి పొడిచేందుకు యత్నించగా.. పక్కనే ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలు అతడి నుంచి బలవంతంగా కత్తిని స్వాధీనం చేసుకున్నారని వివరించారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఈ విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు.


రిమాండ్‌ రిపోర్ట్‌లో ఏముందంటే.. 
అక్టోబర్‌ 25, మధ్యాహ్నం 12.20 గంటలు: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరం జిల్లా పార్వతీపురం సమీపంలో ప్రజా సంకల్ప యాత్ర ముగించుకుని, హైదరాబాద్‌ వెళ్లడానికి విశాఖ పట్నం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఒంటి గంట సమయంలో ఆయన విమానంలో బయల్దేరాల్సి ఉంది.

మధ్యాహ్నం 12.22 గంటలకు: ఎయిర్‌పోర్టులోని వీవీఐపీ లాంజ్‌కు జగన్‌ చేరుకున్నారు. ఆయన వెంట వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, అధికారులు ఉన్నారు. కొద్దిసేపు అక్కడ కూర్చున్న తర్వాత వీవీఐపీ లాంజ్‌లో తూర్పు వైపునగల టాయిలెట్‌కు జగన్‌ వెళ్లారు. రెండు నిమిషాల తరువాత టాయిలెట్‌ నుండి బయటకు వచ్చి సోఫాలో కూర్చున్నారు.

12.30 గంటలకు: జగన్‌మోహన్‌రెడ్డి కోసం పార్టీ నేతలు ఎయిర్‌పోర్ట్‌ లాబీలో ఉన్న ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో టీ ఆర్డర్‌ చేశారు. రెస్టారెంట్‌కు చెందిన సర్వీస్‌ అసిస్టెంట్‌ రమాదేవి టీ కప్పులతో వస్తుండగా, తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం థానేలంక నివాసి, ఫ్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో సర్వీస్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న జనుపల్లి శ్రీనివాసరావు మంచినీటి సీసాను అందించే నెపంతో ఆమెను అనుసరించాడు. పార్టీ నేతలు ‘జగన్‌ సార్‌ టీ తాగరు. కాఫీ తీసుకుంటారు’ అని చెప్పడంతో కాఫీæ తెచ్చేందుకు రమాదేవి రెస్టారెంట్‌కు తిరిగి వెళ్లారు. శ్రీనివాసరావు మాత్రం అక్కడే ఉండిపోయాడు.

12.38 గంటలు: రమాదేవి కాఫీ తీసుకుని వీవీఐపీ లాంజ్‌కు తిరిగి వచ్చారు. అదే సమయంలో రెవెన్యూ అధికారులు వైఎస్‌ జగన్‌తో..‘ఫ్లైట్‌కు టైమైంది సార్‌.. బోర్డింగ్, చెకప్‌కు వెళ్లాలి’ అని అధికారులు సూచించారు. 12.39 గంటలకు: జగన్‌ కాఫీ సేవించడం ముగించుకుని సెక్యూరిటీ చెకింగ్‌కు బయల్దేరారు. సరిగ్గా అదే సమయంలో శ్రీనివాసరావు సార్‌తో సెల్ఫీ తీసుకుంటానని మాట కలిపి జగన్‌ ఎడమ చేతి పక్కనే నిలుచున్నాడు. ఇంతలో జగన్‌తో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ సెల్ఫీ తీసుకుంటుండగా శ్రీనివాసరావు ఒక్క ఉదుటున కత్తితో జగన్‌పై దాడి చేశాడు. నిందితుడికి కుడిపక్కకు జగన్‌ తిరగడంతో ఎడమపక్క భుజంపై రక్తం కారే బలమైన గాయం తగిలింది. దీంతో జగన్‌ చిన్నగా అరిచారు. దుండగుడు మళ్లీ పొడిచేందుకు యత్నించడంతో పార్టీ నేతలు బలంవంతంగా అతడి నుంచి కత్తిని లాక్కున్నారు. అతడిని కొట్టవద్దని పార్టీ నేతలను జగన్‌ వారించారు. అనంతరం ప్రథమ చికిత్స చేయించుకుని షెడ్యూల్‌ ప్రకారం ఇండిగో విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లారు.

ఆ కత్తి గొంతులో దిగి ఉంటే..
‘‘కత్తితో దాడి చేయడం వల్ల జగన్‌కు తీవ్రంగా రక్తం కారే గాయమైంది. నిందితుడు హత్యకు ప్రయత్నించినా జగన్‌మోహన్‌రెడ్డి అదృష్టవశాత్తూ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆ కత్తి గొంతుకు తగిలి ఉంటే జగన్‌ చనిపోయి ఉండేవారు. కాబట్టి నిందితుడు ప్రతిపక్ష నేతను హత్య చేసేందుకు ప్రయత్నించినందున ఐపీసీ సెక్షన్‌ 307 కింద కేసు నమోదు చేశాం. 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నందున బెయిల్‌ మంజూరు కాకుండా కోర్టుకు పంపించాం. నిందితుడి వద్ద నుంచి 2.5 అంగుళాల కత్తి, గులాబీ రంగు కలిగిన మరో బ్లేడు, లేఖ స్వా«ధీనం చేసుకున్నాం’’ అని పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

నిందితుడు నేరం అంగీకరించాడు
‘‘విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడు. మధ్యవర్తుల సమక్షంలో నిందితుడి వాంగ్మూలాన్ని 25వ తేదీ రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య రికార్డు చేశాం. శ్రీనివాసరావుపై తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం పోలీస్‌ స్టేషన్‌లో క్రైం నంబరు 48/2017, సెక్షన్‌ 323, 506 కింద కేసులు నమోదై ఉన్నట్టు తేలింది. అరెస్టు సమయంలో సర్వోన్నత న్యాయస్థానం సూచనలను పాటించాం. కేసు రాజకీయంగా సున్నితమైంది కావడం వల్ల మధురవాడ ఏసీపీ బీవీఎస్‌ నాగేశ్వరరావు నేతృత్వంలో ప్రత్యేక విచారణ బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేశాం’’ అని కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో ఎయిర్‌పోర్ట్‌ పోలీస్‌స్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మళ్ల  శేషు తెలియజేశారు.

లేఖ పేజీలపై అస్పష్టత
మొదటి నుంచీ అనుమానిస్తున్న విధంగానే దుండగుడు శ్రీనివాసరావు నుంచి స్వాధీనం చేసుకున్న లేఖపై రిమాండ్‌ రిపోర్ట్‌లో అస్పష్టత నెలకొంది. 10 పేజీల లేఖ అని ఓసారి, 11 పేజీల లేఖ అని మరోసారి రిపోర్టులో పేర్కొన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని హత్య చేయడానికే శ్రీనివాసరావు కత్తి దూశాడని రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేసిన పోలీసులు అతడు జగన్‌ అభిమాని అని, వైఎస్సార్‌సీపీకి గట్టి మద్దతుదారు అని పేర్కొనడం గమనార్హం.  

>
మరిన్ని వార్తలు