వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం

26 Oct, 2018 03:18 IST|Sakshi

ఏపీ సర్కారు పెద్దల క్రూర పరిహాసం

పక్కా పథకం ప్రకారం ‘పెద్దల’ డైరెక్షన్‌లో జరిగిన దాడి

టీడీపీ నాయకుడి హోటల్లో వెయిటర్‌గా పనిచేస్తున్న దుండగుడు

జరిగిన దాడిపై అవహేళనకు దిగిన ముఖ్యమంత్రి, మంత్రులు

ఘటన జరిగిన అరగంటకే ప్రచార దాడిగా తేల్చిన డీజీపీ

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనుక్షణం సీఐఎస్‌ఎఫ్‌ బలగాల పహారా ఉండే విశాఖ ఎయిర్‌పోర్టు ఓ దారుణ దాడికి వేదికైంది. ప్రజా సంక్షేమమే వజ్ర సంకల్పంగా పాదయాత్ర సాగిస్తున్న రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిపై ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో హత్యాయత్నం జరగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అక్కడి రెస్టారెంట్‌ వెయిటరే ఈ దాడికి తెగబడటం.. పందెంకోళ్లకు కట్టే చిన్నపాటి పదునైన కత్తిని గొంతులోకి దించడానికి ప్రయత్నించడం.. జగన్‌మోహన్‌రెడ్డి అప్రమత్తతతో కత్తి ఆయన భుజంలో దిగబడి లోతైన గాయం కావడం క్షణాల్లో జరిగిపోయాయి. ఊహించని ఈ దాడితో అక్కడున్న పార్టీ నేతలు, ప్రయాణికులు నిర్ఘాంతపోయారు. క్షణాల్లో ఈ దాడి వార్త దావానలంలా వ్యాపించడంతో ఎయిర్‌పోర్టుకు పెద్ద సంఖ్యలో చేరుకున్న పార్టీ నేతలు, అభిమానుల ఆగ్రహావేశాలు, ఆందోళనలతో ఎయిర్‌పోర్టుతోపాటు సమీపంలోని జాతీయ రహదారి అట్టుడికిపోయాయి. జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. (వైఎస్‌ జగన్‌కు కేసీఆర్‌ ఫోన్‌)

అసలు ఏం జరిగింది?
విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సాలూరు నియోజకవర్గం మక్కువ మండల చప్పబచ్చమ్మపేట నుంచి గురువారం ఉదయం 10 గంటలకు కారులో బయల్దేరారు. సరిగ్గా 12.15 గంటలకు విశాఖ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న ఆయన నేరుగా వీఐపీ లాంజ్‌లోకి వెళ్లారు. అక్కడ తన కోసం ఉన్న విశాఖ నేతలతో ముచ్చటించి వాష్‌రూమ్‌కు వెళ్లి తిరిగి వచ్చారు. సరిగ్గా 12.32 గంటల సమయంలో ఎయిర్‌పోర్టులోని ప్యూజన్‌ ఫుడ్స్‌ రెస్టారెంట్‌లో పనిచేస్తున్న జనుపల్లి శ్రీనివాసరావు తన సహచర వెయిటర్స్‌ సురేష్, రమాలతో కలిసి టీ, మంచినీటి బాటిల్స్‌తో వీఐపీ లాంజ్‌లోకి వచ్చారు. అందరికీ టీ సర్వ్‌ చేయగా, జననేత మాత్రం తనకు కాఫీ కావాలని కోరారు. (వాస్తవాలు చెప్పడం అందరి బాధ్యత: మోహన్‌బాబు)

వెయిటర్‌ రమా తీసుకొచ్చిన కాఫీని సేవిస్తున్న సమయంలో అక్కడే ఉన్న శ్రీనివాసరావు ‘మీరు సూపర్‌ అన్నా.. ఈసారి మీరు తప్పకుండా 160 సీట్లు గెలుస్తారు. మీదే విజయం’ అని మాటలు కలపడంతో జననేత చిరునవ్వుతో స్పందించారు. అదే అదనుగా  శ్రీనివాసరావు ‘సార్‌.. మీతో సెల్ఫీ కావాలని ఎప్పటి నుంచో వెయిట్‌ చేస్తున్నాను..  అని అనగా, జగన్‌ చిరునవ్వుతో దగ్గరకు రమ్మన్నారు. అదే సమయంలో శ్రీకాళహస్తి పార్టీ కో ఆర్డినేటర్‌ మధుసూదనరెడ్డి మరికొంత మంది నేతలు జగన్‌ను కలిసేందుకు వచ్చారు.

అప్పటి వరకు వెయిటర్‌ చెప్పిన మాటలు విన్న జగన్‌ తనను కలిసేందుకు వచ్చిన నేతలను పలుకరించేందుకు ఎడమ చేతివైపు ఒక్కసారిగా తిరిగారు. అప్పటికే పక్కా పథకంతో వాటర్‌ బాటిల్‌ రేపర్స్‌లో దాచి తీసుకొచ్చిన పందెం కోళ్లకు కట్టే కత్తిని సరిగ్గా 12.38 గంటల సమయంలో బయటకు తీసి వెయిటర్‌ శ్రీనివాసరావు జననేతపై దాడికి తెగపడ్డాడు. మెడపై పొడిచేందుకు యత్నించగా..సరిగ్గా అదే సమయంలో జననేత ఎడమచేతి వైపు తిరగడంతో కత్తి గురితప్పి భుజంలోకి దూసుకెళ్లింది. (‘వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కచ్చితంగా కుట్రే’)

ప్రాథమిక చికిత్స అందించిన ఎయిర్‌పోర్టు వైద్యసిబ్బంది
ఘటన జరిగిన వెంటనే ఎయిర్‌పోర్టు వైద్య సిబ్బంది హుటాహుటిన వీఐపీ లాంజ్‌లోకి వచ్చి జగన్‌ మోహన్‌రెడ్డికి ప్రాథమిక చికిత్స ప్రారంభించారు. అన్నా రక్తం ఎక్కువగా పోతోంది.. రండన్నా ఆస్పత్రికి వెళ్దాం అంటూ నేతలు ఎంత ఒత్తిడి చేసినా పర్వాలేదు  ప్రజలు, దేవుని ఆశీస్సులున్నాయి. నాకేం కాదు అంటూ ఆయన వారించారు. ఓ వైపు రక్తం కారుతున్నా బాధను పంటికింద అదిమిపెట్టి చిరునవ్వుతోనే కంగారు పడకండి అంటూ నేతలకు ధైర్యం చెప్పారు. అక్కడకు చేరుకున్న ఎయిర్‌పోర్టు వైద్యురాలు లలితా స్వాతి తమ సిబ్బందితో జగన్‌కు ప్రాధమిక వైద్యం చేశారు. రక్తం కారకుండా కట్టడి చేశారు. సెప్టిక్‌ కాకుండా ముందుజాగ్రత్తగా టీటీ ఇంజక్షన్‌ చేశారు. (ఎవరూ ఆందోళన చెందొద్దు: వైఎస్‌ జగన్‌)

ఆస్పత్రికి వెళ్దామన్న నేతలు.. వారించిన జగన్‌
ఆ తర్వాతైనా పదండన్నా ఆస్పత్రికి వెళ్దాం అని నేతలు ఎంతగా బ్రతిమిలాడినా పర్వాలేదు..నాకేం కాదు.. మీరు ధైర్యంగా ఉండండంటూ వడివడిగా అడుగులేస్తూ ముందుకు సాగారు. తాను హైదరాబాద్‌ వెళ్లాల్సిన 6ఈ–809 ఇండిగో విమానం బయలుదేరే సమయం (13.05 గంటలు) దగ్గరపడుతోందని, తనవల్ల తోటి ప్రయాణికులు ఇబ్బంది పడకూడదంటూ.. విమానంవైపు కదిలారు. మధ్యాహ్నం 1.10 గంటలకు ప్రయాణికులతో కలిసి జగన్‌ ఎక్కిన ఇండిగో విమానం హైదరాబాద్‌ బయలుదేరింది. హత్యాయత్నం అనంతరం తనపై పార్టీ నేతలు దాడి చేస్తారన్న భయంతో నిందితుడు శ్రీనివాసరావు నన్ను అరెస్ట్‌ చేయండి..నన్ను అరెస్ట్‌ చేయండి అంటూ బిగ్గరగా కేకలు వేశాడు. జగన్‌ వారించడంతో నేతలు అతడ్ని సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి అప్పగించారు. అనంతరం వైద్యురాలు స్వాతి నిందితుడికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు.

నిందితుడిని పోలీసులకు అప్పగించేందుకు హైడ్రామా
నిందితుడ్ని పోలీసులకు అప్పగించేందుకు ఎయిర్‌పోర్టులో పెద్ద డ్రామాయే నడిచింది. జగన్‌పై దాడి జరిగిందని తెలిసి పెద్ద ఎత్తున చేరుకున్న పార్టీ శ్రేణులు ఎయిర్‌ పోర్టు ఇన్‌గేట్, అవుట్‌గేట్‌ల వద్ద ఆందోళనకు దిగారు. దీంతో నిందితుడిని సుమారు ఐదుగంటల పాటు ఎయిర్‌పోర్టులోనే ఉంచి విచారణ కొనసాగించారు. ఆ తర్వాత వెనుక గేటు నుంచి నిందితుడ్ని ఎవరికీ కన్పించకుండా తరలించారు. 

అమ్మా అంటూ బిగ్గరగా కేక వేసిన జగన్‌
‘అమ్మా’ అంటూ జగన్‌ బిగ్గరగా కేక వేయడంతో ఏం జరిగిందో తెలియక అక్కడున్న నేతలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక ఆందోళనకు గురయ్యారు. తొలి ప్రయత్నం విఫలమై జగన్‌ ఎడమ చేతి భుజంలోకి కత్తి దూసుకెళ్లడంతో మరోమారు ప్రయత్నించేందుకు దుండగుడు కత్తితీస్తుండగా జగన్‌ వ్యక్తిగత సహాయకులు కేఎన్‌ఆర్‌ వెంటనే తేరుకుని శ్రీనివాసరావును పక్కకు నెట్టేశారు. జగన్‌ ఎందుకిలా కేక పెట్టారో తేరుకునే సరికి ఎడమచేయి పూర్తిగా రక్తమోడింది. (వైఎస్‌ జగన్‌పై దాడి.. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు)

శ్రీనివాసరావు పొడిచిన కత్తి ఆయన ఎడమ చేతిలోకి మూడు సెంటిమీటర్ల మేర చొచ్చుకుపోయి ఉండటంతో దాన్ని బయటకు తీశారు. చొక్కా పూర్తిగా రక్తసిక్తమైంది. ఉబికి వస్తున్న రక్తాన్ని అదిమిపట్టి జగన్‌ ఒక్కసారిగా మళ్లీ సోఫాలో కూర్చుండి పోయారు. ఆ వెంటనే జగన్‌మోహన్‌రెడ్డిపై దాడి జరిగిందని గ్రహించిన పార్టీ నేతలు ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు గురై దాడి చేసిన శ్రీనివాసరావును చుట్టుముట్టారు. ఓ వైపు రక్తం కారుతోంది.. మరో వైపు బాధను తట్టుకోలేని స్థితి.

అయినా సరే ఆ బాధను పంటికింద అదిమిపట్టి తనపై దాడి చేసిన దుండగుడిని ఏమీ చేయొద్దంటూ పార్టీ నేతలను వారించారు. ఎందుకు చేశావ్‌?..ఎవరు చేయమన్నారు? అని పార్టీనేతలు దుండగుడిని నిలదీశారు. తనపై దాడి చేస్తారన్న భయంతో దండగుడు శ్రీనివాసరావు కేకలు వేయడంతో అక్కడకు చేరుకున్న సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌) సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకొని సెక్యూరిటీ చాంబర్‌లోకి తీసుకెళ్లిపోయారు.

జగన్‌ అప్రమత్తంగా ఉండకపోతే..
దాడి జరిగిన సమయంలో జననేత ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఆ కత్తి నేరుగా మెడలోకి దూసుకెళ్లేది. నేతలను పలకరించేందుకు కుడిచేతి వైపు తిరగడం, దాడి చేసే సమయంలో అప్రమత్తంగా ఉండడంతో మెడలోకి దూసుకెళ్లాల్సిన కత్తి కాస్తా భుజంలోకి దూసుకెళ్లింది. జగన్‌ అప్రమత్తంగా ఉండి ఉండక పోతే జరగరాని ఘోరం జరిగేది. పైగా దాడి జరిగిన వెంటనే క్షణాల్లో వ్యక్తిగత సిబ్బంది, పార్టీనేతలు తేరుకుని అతడ్ని పక్కకు నెట్టేయడం వల్ల కూడా పెను ప్రమాదం తప్పినట్టయ్యింది. జగన్‌పై హత్యాయత్నాన్ని  అడ్డుకున్న పార్టీ నేతలు మళ్ల విజయప్రసాద్, చిన్న శ్రీనులు నిందితుడి నుంచి వెంటనే కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఆ కత్తిని వెంటనే సీఐఎస్‌ఎఫ్‌ అధికారి దినేష్‌కుమార్‌కు అప్పగించారు. 
 

మరిన్ని వార్తలు