యువకుడి దారుణ హత్య..?

30 Aug, 2019 11:37 IST|Sakshi
ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌టీం

కాల్చి చంపి, షార్ట్‌సర్క్యూట్‌గా చిత్రీకరణ?

 ప్రతీకారం కోసం హత్య చేసినట్లు అనుమానాలు      

వివాహేతర సంబంధం కేసులో మృతునిపై పాత కక్షలు

సాక్షి, మదనపల్లె : మదనపల్లె మండలం, టేకుల పాళ్యంలో బుధవారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురైనట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యర్థులు పథకం ప్రకారం కాల్చి చంపి హతమార్చినట్లు స్థానికుల్లో చర్చసాగుతోంది. హత్యానంతరం షార్టుసర్క్యూట్‌తో మృతిచెందాడని చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన తీరు చూస్తుంటే ప్రత్యర్థులు ప్రతీకారం కోసం అతి కిరాతకంగా చంపినట్లు కనిపిస్తోంది. గతంలో స్థానిక మహిళతో వివాహేతర సంబంధంపై జరిగిన గొడవలే ఈ హత్యకు దారితీసి ఉండవచ్చని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గొడవ విషయమై అప్పట్లో రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో ఈ ఏడాది జూలై నెలలో కోర్టు ముద్దాయిలకు అపరాధం, లేకుంటే జైలుశిక్ష అనుభవించాలని తీర్పు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. మండలంలో తీవ్ర కలకలం రేపిన ఈ హత్య ఘటనపై రూరల్‌ పోలీసులు, మృతుని తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి..

మండలంలోని బొమ్మనచెరువు పంచాయతీ టేకులపాళ్యంకు చెందిన దంపతులు దేవరింటి ఆదికేశవులు, ఆదెమ్మలకు ఇద్దరు కుమారులు దివాకర్‌(23), లోకేష్‌(19). దివాకర్‌ మదనపల్లెలో చేనేత కార్మికునిగా పనిచేస్తున్నాడు. లోకేష్‌ ఇంటర్‌ పూర్తిచేసి ఇంటి పట్టునే ఉంటూ ఉపాధికోసం టేకులపాళ్యం–మదనపల్లె మధ్య షేర్‌ ఆటో నడుపుతున్నాడు. అడపాదడపా వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు లోకేష్‌ చేదోడువాదోడుగా ఉండేవాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఓ వివాహితతో రెండేళ్ల క్రితం లోకేష్‌కు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఆమె తరఫు బంధువులు లోకేష్, ఆదెమ్మ, దివాకర్‌లపై దాడికి పాల్పడ్డారు. వీరు కూడా వారిపై ఎదురు దాడి చేయడంతో ప్రత్యర్థులైన గంగులప్ప వర్గీయులు గాయపడ్డారు. గాయపడిన వారి ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

కోర్టులో కేసు విచారణ అనంతరం నిందితులపై నేరం రుజువుకావడంతో ఈ ఏడాది జూన్‌ 31న రెండు నెలల సాధారణ జైలుశిక్ష లేదా అపరాధం రూ.3 వేలు చెల్లించాలని స్థానిక కోర్టు తీర్పు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అపరాధం చెల్లించి బయట కొచ్చిన లోకేష్‌ రెండు నెలలుగా ఇంటి పట్టునే ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి తాను నిద్రిస్తున్న గదిలో లోకేష్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

నేలపై ఉన్న పరుపు మీదనే నిద్రలో ఉండగా కాలి మాడిపోయాడు. పక్క గదిలో ఉన్న తల్లిదండ్రులు పొగలు వస్తుండడం చూసి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అప్పటికే వారు బయటకు రాకుండా తలుపునకు ఉన్న చిలుకు గడి పెట్టడంతో గట్టిగా కేకలు వేశారు. స్థానికులు వచ్చి తలుపులు తీశారు. బిడ్డ లోకేష్‌ ఉంటున్న గదిలో అప్పటికే పొగలు కమ్ముకోవడం, లోకేష్‌ శరీరం పూర్తిగా కాలి మృతి చెందడం చూసి హతాశులయ్యారు. ప్రత్యర్థులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంటనే రూరల్‌ పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ వెంకటేశులు, ఎస్‌ఐ హరిహరప్రసాద్‌లు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీం, ట్రాన్స్‌కో అధికారులను పిలిపించి ఘటనపై క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. యువకుడిది హత్యా..? లేక ప్రమాదమా..? పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా