బంగారం కోసమే హత్య!

23 Nov, 2013 04:53 IST|Sakshi

తూర్పు గానుగూడెం (రాజానగరం), న్యూస్‌లైన్ :  జాతీయ రహదారి పక్కనున్న తూర్పు గానుగూడెం వద్ద పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కాకినాడకు చెందిన డింగిరి రమేష్ (30)దిగా పోలీసులు గుర్తించారు. ‘గుర్తు తెలియని మృతదేహం లభ్యం’ శీర్షికన శుక్రవారం ‘సాక్షి’లో వచ్చిన వార్తను చూసి ఇక్కడకు వచ్చిన మృతుని బంధువుల ద్వారా అతడి వివరాలు లభ్యమైనట్టు సీఐ ఏబీజీ తిలక్ తెలిపారు. రాజస్తాన్‌కు చెందిన రమేష్ కుటుంబం ఉపాధి కోసం కాకినాడలో ఉంటోంది. కాకినాడలోని రాజు జ్యుయలరీలో రమేష్ సేల్స్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 19న జ్యుయలరీ నుంచి 1600 గ్రాముల బంగారాన్ని హాల్‌మార్‌‌క ముద్రణ కోసం రాజమండ్రికి తీసుకువె ళ్లాడు.

ఆ రోజు నుంచి జ్యుయలరీకి కాని, ఇంటికి కాని అతడు తిరిగిరాలేదు. దీంతో కాకినాడ వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో రమేష్ అదృశ్యంపై జ్యుయలరీ యజమాని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదైంది. ఇదే సమయంలో రాజానగరం మండలం తూర్పు గానుగూడెం వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైన విషయం తెలుసుకుని అతడి బంధువులు శుక్రవారం ఇక్కడకు చేరుకున్నారు. రాజమండ్రి ప్రభుత్వాస్పత్రి మార్చురీలో ఉన్న రమేష్ మృతదేహాన్ని వారు గుర్తించినట్టు సీఐ తెలిపారు. మృతుడి వద్ద బంగారం ఏమీ లేదని, దీని కోసమే దుండగులు అతడిని హతమార్చి, రోడ్డు పక్కన పడేసి ఉండవచ్చని పోలీసులుఅనుమానిస్తున్నారు.
 కన్నీటిపర్యంతమైన బంధువులు
 ఉపాధి కోసం సొంత ప్రాంతాన్ని వదిలి ఇక్కడ ఉంటున్నామని, ఎన్నడూ ఎవరితోను మాట పడలేదని, కుటుంబాన్ని పోషించే వ్యక్తిని ఇలా కుటుంబానికి దూరం చేస్తారనుకోలేదంటూ రమేష్ బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. స్థానిక పోలీసు స్టేషన్ వద్దకు 9 నెలల పాపతో వచ్చిన, గర్భిణి అయిన రమేష్ భార్య రోదన చూపరులను కంటతడి పెట్టించింది. అతడి వద్ద ఉన్న బంగారాన్ని కాజేసేందుకే రమేష్‌ను హతమార్చి ఉంటారని అతడి బంధువులు అనుమానం వ్యక్తం చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా