మూఢవిశ్వాసంతోనే హత్య

19 Jan, 2014 00:19 IST|Sakshi

మొయినాబాద్, న్యూస్‌లైన్:  మూఢ విశ్వాసమే వృద్ధుడి హత్యకు దారితీసింది. వృద్ధుడు బాలయ్య తన కుటుంబానికి బాణామతి చేసి భార్య, తల్లి మృతికి కారణమయ్యాడని అనుమానించి ఆయనను చంపేసినట్లు నిందితుడు యాదయ్య అంగీకరించాడని సీఐ రవిచంద్ర తెలి పారు. మండల పరిధిలోని బాకారంలో ఈనెల 15న జరిగిన బాలయ్య హత్య మిస్టరీని పోలీసులు ఛేదించి శనివారం నిందితుడిని రిమాండుకు తరలించారు. సీఐ రవిచంద్ర విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.

 నిందితుడు ఎలా చిక్కాడు..?  
 బాకారం గ్రామానికి చెందిన మాల బాలయ్య(70)ను అదే గ్రామానికి చెందిన కాశ యాదయ్య(42) ఈనెల 15న సాయంత్రం దారుణంగా కొట్టిచంపాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు.
 కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. యాదయ్య శంషాబాద్ పరిసర ప్రాంతాలకు పారిపోయాడనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు నిఘా వేశారు. ఈక్రమంలో శుక్రవారం సాయంత్రం యాదయ్య శంషాబాద్ బస్టాండు సమీపంలో తిరుగుతుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసి మొయినాబాద్ ఠాణాకు తరలించి విచారించారు.
 
 ఎందుకు చంపేశాడు..?
 బాలయ్య బాణామతి చేస్తాడని గ్రామస్తులు విశ్వసించేవారు. యాదయ్య 11 ఏళ్ల వయసులో ఉన్నపుడు వారి పూరి గుడిసె తగులబడిపోయింది. దానికి బాలయ్యే కారణమని యాదయ్య బలం గా విశ్వసించాడు. పదిహేడేళ్ల క్రితం యాదయ్య చేవెళ్ల మండలం మల్కాపూర్‌కు చెందిన అరుణను వివాహం చేసుకున్నాడు. రెండేళ్ల తర్వాత ఆమె గర్భవతిగా ఉండగా మృతిచెందింది. బాలయ్య బాణామతి చేయడంతోనే తన భార్య మృతిచెందిందని యాదయ్య నమ్మి పగ పెంచుకున్నాడు. అనంతరం ఆయన మంజులను రెండో వివాహం చేసుకున్నాడు.

 ఇదిలా ఉండగా ఏడాది క్రితం యాదయ్య తల్లి ముత్తమ్మ మరణించింది. ఆమెను సైతం బాలయ్యే బలిగొన్నాడని విశ్వసించాడు. తన కుటుంబాన్ని బాలయ్య పొట్టనబెట్టుకున్నాడని భావించాడు. ఈక్రమంలో బాలయ్య హత్యకు గురయ్యేకంటే వారం రోజుల ముందు యాదయ్య అతడిపై దాడి చేశాడు. గ్రామస్తులు అడ్డుకుని అతణ్ని పోలీసులకు అప్పగించా రు. యాదయ్యను పోలీసులు నగరంలో ని ఎర్రగడ్డ మానసిక వైద్యశాలకు తరలించారు.

సంక్రాం తి పండుగ నేపథ్యం లో ఆయనను కుటుంబీకులు ఇటీవల ఇంటికి తీసుకొచ్చారు. ఇదే అదనుగా భావించిన ఆయన ఈనెల 15న సాయంత్రం బాలయ్య మేకలు మేపుతుండగా అతడి దగ్గరకు వెళ్లాడు. ‘నా కుటుంబాన్ని ఎందుకు నాశనం చేశావ’ని గొడవపడ్డాడు. యాదయ్య తన చేతిలో ఉన్న కర్రతో వృద్ధుడి తలపై బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాలయ్య అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.
 కటాకటాల్లోకి యాదయ్య..
 యాదయ్యను శనివారం మొయినాబాద్ పోలీసులు రిమాండుకు తరలిం చారు. మూడు రోజుల్లోనే నిందితుడిని పట్టుకున్న ఎస్సై సైదులు, కానిస్టేబుళ్లు రమేష్, కృష్ణ, చంద్రయ్య, రాజమల్లేష్, పండరి, నర్సింలును ఈ సందర్భంగా సీఐ రవిచంద్ర అభినందించారు. సమావేశంలో ఏఎస్సై అంతిరెడ్డి, సిబ్బంది ఉన్నారు.

>
మరిన్ని వార్తలు