కూల్చిన మసీదు సంగతి తేల్చండి

17 Jun, 2018 03:53 IST|Sakshi
విజయవాడ రామవరప్పాడులో కూల్చిన మసీను పునర్నిర్మించాలంటూ సీఎంను నిలదీస్తున్న మసీదు సంరక్షణ కమిటీ అధ్యక్షుడు నూరుద్దీన్‌

రెండేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోరా?

ముఖ్యమంత్రి చంద్రబాబుని నిలదీసిన ముస్లింలు

కంగుతిన్న సీఎం చంద్రబాబు

ప్రశ్నిస్తున్న వ్యక్తిని పక్కకులాగేసిన పోలీసులు

లబ్బీపేట (విజయవాడతూర్పు): రంజాన్‌ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన నమాజ్‌ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో శనివారం లబ్బీపేట ఈద్గా కమిటీ, ముస్లిం డెవలప్‌మెంట్‌ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈదుల్‌ ఫితర్‌ నమాజు కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ముస్లింల కోసం తమ ప్రభుత్వం ఎంతో చేస్తోందని చెబుతుండగా ముందు విజయవాడ రామవరప్పాడులో కూల్చిన మసీదు పునర్‌నిర్మాణం సంగతి తేల్చాలంటూ  మసీదు సంరక్షణ కమిటీ అధ్యక్షుడు నూరుద్దీన్‌ ముఖ్యమంత్రిని నిలదీశారు.

గత పుష్కరాల సమయంలోనూ, జాతీయ రహదారి విస్తరణ సమయంలోనూ దేవాలయాలను, మసీదులను ప్రభుత్వం కూల్చివేసింది. రామవరప్పాడులో మసీదు కూల్చివేయడంపై ముస్లింలు అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో సభలో ఎదురైన ప్రశ్నలతో సీఎం చంద్రబాబు కంగుతిన్నారు. వెంటనే తేరుకుని కలెక్టర్‌ పక్కనే ఉన్నారు.. నెలరోజుల్లో పూర్తిచేయమని ఆదేశిస్తానన్నారు. చంద్రబాబు మాటలు నమ్మని ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. రెండేళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోలేదన్నారు. గత నవంబర్‌లోనూ మీరు ఇదే హామీ ఇచ్చారు? ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదంటూ నిలదీశారు. ఆ సమయంలో ముస్లింలు హర్షధ్వానాలు చేశారు. నూరుద్దున్‌ ఇంకా ఏదో చెప్పబోతుంటే పోలీసులు వచ్చి అతన్ని పక్కకు లాగేశారు. దీనిపట్ల పలువురు ముస్లింలు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

శాంతి, సౌభ్రాతృత్వాలకు ప్రతీక రంజాన్‌: సీఎం 
రంజాన్‌ పండుగ శాంతి, సౌభ్రాతృత్వాలకు ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో నివసించే ప్రతి ముస్లిం కుటుంబం నిర్భయంగా జీవించేలా భద్రతను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. కడప, విజయవాడల్లో హజ్‌హౌస్‌లు నిర్మాణం చేపడుతున్నామన్నారు. ముస్లింలకు త్వరలోనే 25 రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీలు కేశినేని శ్రీనివాస్, మాగంటి బాబు, ఎమ్మెల్యేలు బొండా ఉమా, గద్దె రామ్మోహన్, నగర మేయర్‌ కోనేరు శ్రీధర్, కృష్ణా జిల్లా కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం, ఈద్గా కమిటీ సభ్యులు ఎస్‌కే మునీర్‌ అహ్మద్, ఎండీఎస్‌ అధ్యక్షుడు సయ్యద్‌ ఇస్మాయేల్, జమాయతే ఇస్తామీ హింద్‌ రాష్ట్ర అధ్యక్షుడు రఫీఖ్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు