మ్యుటేషన్‌.. నో టెన్షన్‌

20 Sep, 2019 11:28 IST|Sakshi

భూముల రికార్డుల ప్రక్షాళనకు ప్రభుత్వం కసరత్తు

అక్రమాలకు చెక్‌పెట్టేలా కొత్త చట్టం

తాత్కాలికంగా ఇబ్బందులు పడ్డా భూ రికార్డుల్లో అక్రమాలకు చెక్‌

రెవెన్యూ శాఖలో వేళ్లూనుకునిపోయిన అవినీతి, గత ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల సంస్కరణలు భూ యజమానుల హక్కులు.. చిక్కులుగా మారాయి. మ్యుటేషన్‌ (హక్కుల మార్పుల) కోసం చేసుకున్న చేసుకున్న దరఖాస్తులు కొన్నేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల్లో కుప్పలు తెప్పలుగా పడిపోయి ఉన్నాయి. సిటిజన్‌ చార్ట్‌ ప్రకారం నిర్దేశిత సమయంలో దరఖాస్తులను పరిష్కరించాల్సిన రెవెన్యూ శాఖ హక్కుల పత్రాలు పరిశీలన చేయకుండా విచ్చలవిడిగా తిరస్కరించేశారు. అమ్యామ్యాలు సమర్పించిన వారివి మాత్రం పరిష్కరించారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా 6 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితికి చెక్‌ పెట్టి భూ సమస్యలను సమూలంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. పైలెట్‌ ప్రాజెక్ట్‌గా జిల్లాలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టనుంది. అనంతరం జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామ రికార్డులను స్వచ్ఛీకరించే ప్రణాళిక రూపొందించనుంది. 

సాక్షి, నెల్లూరు: జిల్లాలో భూమి రికార్డులు అస్తవ్యస్తంగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ రికార్డుల నవీకరణ పేరుతో భూములను ఇష్టానుసారంగా సబ్‌డివిజన్ల ప్రక్రియ చేపట్టారు. ఇలా సబ్‌ డివిజన్‌ జరిగిన భూములు తాత్కాలిక ఖాతాల్లో ఉండిపోయాయి. ఇలాంటి ఖాతాలను శాశ్వత ఖాతాలుగా మార్పుకునేందుకు యాజమానులు ఇచ్చిన వినతులు బుట్టదాఖలు అయ్యాయి. ఈ క్రమంలో దశాబ్దాలుగా యజమానుల పేరుతో ఉన్న భూముల విస్తీర్ణాలు మరొకరి ఖాతాల్లో నమోదైపోయాయి. పట్టాదారు పాస్‌ పుస్తకాలు మాత్రం యజమానుల దగ్గర ఉన్నా.. ఆన్‌లైన్‌ అడంగళ్‌లో మాత్రం భూములు కనిపించకపోవడం, అధిక విస్తీర్ణం ఉండడం ఇలా లోపాలు తలెత్తాయి. వీటితో పాటు కొత్తగా భూములు కొనుగోలు చేసిన, వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ల ప్రక్రియ సాగడం లేదు.  

యజమానులకు తలనొప్పిగా మ్యుటేషన్‌
సాగుభూమి కొన్నామనే సంతోషం కొనుగోలు దారులకు దక్కాలంటే అంతా ఆషామాషీ కాదు. ఆ భూమి వారు పేరున మారాలంటే (మ్యుటేషన్‌) మాటల్లో అయ్యే పనికాదు. ఓ సర్వే నంబర్‌లో భూమి వివాదంలో ఉంటే.. ఆ పరిధిలోని అందరి భూములూ వివాదం జాబితాలోకి చేరిపోతాయి. ఫలితంగా వారికి మీ సేవ కేంద్రాల్లో అడంగళ్, 1బీ పత్రాలు రావటం లేదు. సంవత్సరం కిందట పత్రాల్లో మీ భూమి పూర్తి వివరాలుంటాయి. ఇప్పుడొకసారి పరిశీలిస్తే కొంత భూమి తగ్గిపోతుంది. అదేమని అధికారులను ప్రశ్నిస్తే దరఖాస్తు చేయండి సర్వే చేసి మార్పులు చేర్పులు చేస్తామంటారు. ఈ ప్రక్రియకు రోజులు.. నెలలు సంవత్సరాలు పట్టుతోంది. ఫలితంగా పంట రుణాలు అందక.. అప్పుల ఊబిలో రైతులు నలిగిపోతున్నారు.

మ్యుటేషన్‌ ప్రక్రియ ఇలా.. 
రైతుల భూములకు సంబంధించి రికార్డుల్లో పేర్లు మార్పులు, చేర్పులు చేయాలంటే మీ–సేవలో దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల పేరుతో 30 రోజుల పాటు జాప్యం జరుగుతున్నందున రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. నెల రోజులు దాటిన మ్యుటేషన్‌ కాకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. పంట రుణాలను పొందడానికి వీలు పడటం లేదు. భూముల క్రయ విక్రయాలు జరిగినా తర్వాత ఆ భూమి పేరు మారకపోతే రుణాలను పొందే అవకాశం ఉండడం లేదు.

గతంలో  దరఖాస్తు చేసినా..
మ్యుటేషన్‌ ప్రక్రియను మీ–సేవలో దరఖాస్తు చేసిన తర్వాత ఫారం–8 డ్రాప్ట్, నోటీసు వస్తుంది. 15 రోజుల తర్వాత దీనిపై విచారణ చేస్తారు. ఆ తర్వాత విచారణలో ఎలాంటి అభ్యంతరాలు లేవని వీఆర్వో, ఆర్‌ఐ, డీటీలు పేర్కొంటే తహసీల్దార్‌కు వెళుతుంది. అక్కడ సంతకం అయిన తర్వాత కంప్యూటరీకరణకు చేరుతుంది. ఆన్‌లైన్‌లో నవీకరించిన తర్వాత తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకం చేస్తారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌ పేరు మారినట్లు కనిపిస్తుంది. ఈ ప్రక్రియకు మొత్తం 30 రోజుల సమయం పడుతుంది. 30 రోజుల్లోగా పూర్తికాకపోతే ఆటో మ్యుటేషన్‌లోకి వెళుతుంది. సాంకేతికంగా ఎలాంటి సమస్యలు లేకపోతే కంప్యూటరే మ్యుటేషన్‌ చేస్తుంది. అయితే  ఈ లోపే ఏదొక కారణంతో ఆటో మ్యుటేషన్‌కు వెళ్లకుండా అధికారులు చేస్తున్నారనేది ఆరోపణ. 

ఇక అక్రమాలకు అడ్డుకట్ట..
తాజాగా నూతన సర్కార్‌ ఏపీ ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌–2019ని తీసుకొచ్చింది. 1937 తర్వాత భూముల రీ సర్వే జరగలేదు. కొత్త చట్టం ద్వారా రీ సర్వే చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. భ యజమానులకు కొనుగోలు చేసిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా రికార్డులను పకడ్బందీగా ఉంచేందుకు చట్టం ఉపకరిస్తుంది. అన్నీ ఉన్నా చాలా మంది భూమిపై పూర్తి స్థాయిలో హక్కులు పొందలేక పోతున్నారు. న్యాయస్థానాలు ప్రాథమిక ఆధారాలుగా మాత్రమే గుర్తిస్తున్నాయి. భూ వివాదాలు ఏర్పడితే పరిష్కారం లభించడంతో జాప్యం జరుగుతోంది. భూమి హక్కు నిరూపించుకోవాలంటే పట్టాదారు పాసుపుస్తకం ఉండాలి. 1బీ అడంగళ్‌లో పేరు నమోదు ఉండాలి. ఆ రికార్డుల్లోని వివరాలు వందల సంవత్సరాల కిందట తయారైన ఆర్‌ఎస్‌ఆర్‌లోని వివరాలకు ఆ తర్వాత రుపొందించిన అడంగళ్‌కు అనుసంధానం కుదరాలి.

లింక్‌ డాక్యుమెంట్లు ఉండాలి. ఇలాంటి ఆధారాలున్నా హక్కులు నిరూపణ కష్టంగా మారింది. కొత్త చట్టం ద్వారా ఒకే రికార్డు భూ యజమాన్య హక్కుల నిరూపణకు సరిపోతుంది. రికార్డుల్లో ఉన్న వివరాలకు ప్రభుత్వం హామీ ఇస్తుంది. దీనినే టైటిల్‌ గ్యారెంటీగా పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ చేపట్టడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రెండు నెలల్లో భూముల రికార్డుల ప్రక్షాళనను లోప రహితంగా చేసి యజమానులకు భరోసా కల్పించే దిశగా చర్యలు చేపట్టింది. అందులో భాగాంగా జిల్లాలో ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పైలెట్‌ ప్రాజెక్ట్‌గా భూరికార్డులు ప్రక్షాళన, రీ సర్వే ప్రక్రియ చేపట్టనుంది. ఇది పూర్తయితే జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ ప్రక్రియ చేపడుతుంది. భూ యజమానుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

భూ హక్కుల రిజిస్ట్రేషన్‌కు ప్రత్యేక వ్యవస్థ 
చట్టం అమల్లోకి వచ్చిన మరుక్షణమే భూ యజమానులకు భద్రత కల్పించే వ్యవస్థను తీసుకు రానున్నారు. భూ హక్కులను రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ వ్యవస్థ ఏర్పడుతుంది. భూమి ఏ విధంగా సంక్రమించినా కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. కోర్టు వివాదాలు ఉన్నా, భూసేకరణ జరిగినా, ప్రభుత్వమే భూ లావాదేవీలు జరిపినా, భూమి కుదువ పెట్టినా, పవర్‌ ఆఫ్‌ అటార్నీ ఇచ్చినా రిజిస్ట్రేషన్‌ ఆఫీసుకు తెలపాల్సి ఉంటుంది. దేశంలోనే తొలిసారిగా ఈ చట్టం మన రాష్ట్రంలో అమల్లోకి రాబోతుంది. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిని నియమిస్తారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ ట్రిబ్యునల్‌ ఏర్పడుతుంది. రాష్ట్ర స్థాయిలో అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ న్యాయమూర్తి నేతృత్వంలో పని చేస్తుంది.

రెండేళ్లుగా తిరుగుతున్నాను
డీసీపల్లి రెవెన్యూ పరిధిలో 0.77 సెంట్లు భూమి నా తండ్రి పేరుతో ఉంది. ఆ భూమిని తల్లి దండ్రులు, సోదరులు కలిసి నా పేరుతో రాసిచ్చారు. రెండేళ్ల క్రితమే స్థానిక వీఆర్‌ఓను కలిసి పూర్తి ఆధారాలు సమర్పించా. మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకున్నా. రెండేళ్లు గడిచినా కూడా మ్యుటేషన్‌ జరగలేదు. వీఆర్‌ఓకు అడంగళ్‌ మార్పు కోసం డబ్బులు కూడా  ఇచ్చుకున్నా ఫలితం లేదు.  
– పోలిచర్ల కవిత, డీసీపల్లి, మర్రిపాడు మండలం

మా హక్కు కలిగి అధీనంలో ఉన్న భూముల్లో ఇతరుల పేర్లు
మా హక్కు అధీనంలో ఉన్న భూములను ఆన్‌లైన్‌ అడంగళ్‌లో మాత్రం ఇతరుల పేర్లు  ఉన్నాయి. ఏడాది కాలంగా తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అడంగళ్‌లో పేరు మాత్రం మారలేదు. ఆ భూమి మాదేనంటూ అన్ని ఆధారాలు చూపించినా కూడా అధికారుల్లో స్పందన లేదు. పాత చట్టాలు తీసేసి కొత్త చట్టం రావాలి. మాలాంటి పేదలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా మా భూములు అడంగళ్‌లో మా పేర్లు ఉండేలా చేయాలి.
–  ఏసిపోగు వెంగయ్య, బోయలచిరివెళ్ల, ఆత్మకూరు మండలం

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు