ధర ఎక్కువ.. నాణ్యత ప్రశ్నార్థకం

7 Mar, 2020 11:42 IST|Sakshi

పొట్టేళ్ల చాటున గొర్రె, మేక మాంసం అమ్మకాలు

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న విక్రయదారులు

జాడ లేని జంతు వధశాల పర్యవేక్షణ కమిటీ  

అధికారులకు పట్టని మాంస ధరల నియంత్రణ

కర్నూలు(అగ్రికల్చర్‌): కొన్నాళ్లు గడిస్తే మాంసం కొనలేని, తినలేని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే పేదలు, మధ్యతరగతి ప్రజలకుమాంసం ధరలు షాక్‌ కొడుతున్నాయి. దీనికితోడు కొన్ని చోట్ల విక్రయిస్తున్న మాసం  పొట్టేలుదో, గొర్రెదో.. మేకదో.. అనారోగ్యంతో ఉన్న వాటిదో తెలియని పరిస్థితి. చనిపోయేవాటిని  కూడా  విక్రయానికి వినియోగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.  గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే కర్నూలు నగరంలో మాంసం ధరలు ఏకంగా 20 నుంచి 30  శాతం  ఎక్కువ. ఇక్కడి వ్యాపారులు  సిండికేట్‌ అయి అడ్డగోలుగా ధరలు పెంచుతూ పోతున్నారు.  దీనిని నియంత్రించే అధికారం ఎవ్వరికీ లేదా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. 

జీవాల ఆరోగ్యం దేవుడెరుగు
ధర ఎక్కువ తీసుకుంటున్నప్పుడు  నాణ్యమైన పొట్టేలు మాంసం ఇవ్వాలి. అలా  కాకుండా మేక, గొర్రె మాంసం కూడా కిలో రూ. 680 నుంచి రూ.700 వరకు విక్రయిస్తున్నారు.  వినియోగదారులు చూసేందుకు ఎదురుగా  ఒక  పొట్టేలు తల పెట్టి  దాని దాపున గొర్రె, మేకల మాంసం విక్రయిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.   నిబంధనల ప్రకారం   మాంసానికి వినియోగిస్తున్నా జీవం ఏదైనా అది ఆరోగ్యంగా ఉందా లేదా అని పశుసంవర్ధకశాఖ వైద్యులు పరీక్షించాలి. లేకపోతే బ్రూసెల్లోసిస్, అంత్రాక్స్‌ వంటి వ్యాధుల బారిన పడిన జీవాలను  మాంసానికి వినియోగిస్తే అవి మనుషులకు సంక్రమించే ప్రమాదం ఉంది. అందుకే జీవాన్ని పరీక్షించిన తర్వాతే విక్రయించాలని నిబంధన పెట్టారు. జిల్లాలోని మున్సిపాలిటీ, మేజర్‌ పంచాయతీల్లో  ఈ నిబంధన ఎక్కడా  అమలు కావడం లేదు. కర్నూలులో  జీవాలను జవ  చేయడానికి ప్రత్యేకంగా కమేళా ఉంది. అక్కడ పశువైద్యుడు జీవాల ఆరోగ్యం పరీక్షించిన తర్వాత జవ చేయాలి.   నగరపాలక సంస్థ అధికారులు పట్టించుకోకపోవడంతో జీవాల ఆరోగ్యాలను పరీక్షించే పశువైద్యులు అక్కడ లేరు. దీంతో మాంసం వ్యాపారం ఇష్టారాజ్యమైంది. నగరంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లపై బహిరంగంగా మాంసం విక్రయాలు చేస్తున్నారు. దీనిని అడ్డుకుని సదరు వ్యాపారులపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటం గమనార్హం.

కర్నూలులో చికెన్‌ ధరలు కూడా ఎక్కువే  
జిల్లా కేంద్రానికి  30 కిలో మీటర్ల దూరంలో ఉన్న కోడుమూరు, వెల్దుర్తి తదితర పట్టణాల్లో చికెన్‌ కిలో రూ.120 మాత్రమే. కర్నూలు నగరంలో మాత్రం రూ.200 వరకు అమ్మకాలు చేస్తున్నారు. బతికిన కోడి కిలో రూ.40 వరకు ఉంది. చికెన్‌ దగ్గరకు వచ్చే సరికి ఎక్కడా లేని విధంగా కిలో రూ.200 వరకు ధర పెట్టి అమ్మకాలు సాగిస్తుండటం గమనార్హం. లైవ్‌ ధరల ప్రకారం చూస్తే కిలో చికెన్‌ రూ.100 నుంచి రూ.110కి మించదు. కాని వినియోగదారుల నుంచి 200 వసూలు చేస్తుండటంపై  సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మాంసం, చికెన్‌ అనేవి నిత్యావసరాలు కాదుగదా.. అంటూ  అడ్డగోలుగా   ధరలు పెంచుకోవడానికి అధికార యంత్రాంగమే వ్యాపారులకు అవకాశం ఇచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

జంతు వధశాల పర్యవేక్షణ కమిటీ సమావేశం ఏదీ?
మూడు నెలలకు ఒకసారి జంతు వధశాల పర్యవేక్షణ కమిటీ సమావేశం జరుగాల్సి ఉంది. ఈ కమిటీకి జేసీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పశుసంవర్ధకశాఖ జేడీ, నగరపాలక సంస్థ కమిషనర్‌ తదితరులు సభ్యులుగా ఉంటారు. కాని రెండేళ్లలో ఒక్కసారి కూడా సమావేశమైన దాఖలాలు లేవు. అంటే ప్రజారోగ్యం పట్ల అధికార యంత్రాంగానికి దృష్టి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

పట్టని మాంసం ధరల నియంత్రణ
మాంసం ధరల నియంత్రణకు జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఉంటుంది. ఇందులో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, మార్కెటింగ్‌ శాఖ అధికారి తదితరులు సభ్యులుగా ఉంటారు. ధరల నియంత్రణ కమిటీ ఏ నాడు కూడా మాంసం ధర పెరుగుదలపై దృష్టి సారించిన దాఖలాలు లేవు. దీంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకుంటూ పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

ధరలను నియంత్రించాలిమాంసం
ధరలను వ్యాపారులు అడ్డగోలుగా పెంచుకుంటుపోతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. కిలో మాంసం ధర రూ.680కు పైగా పెంచినా నాణ్యమైన మాంసం ఇస్తున్నారనేది ప్రశ్నార్థకమే. అనారోగ్యవంతమైన జీవాల మాంసం తినడంతో  ప్రజలు కూడా అనారోగ్యాలకు గురవుతున్నారు. నిబంధనల ప్రకారం పశువైద్యులు పరిశీలించిన తర్వాతనే జీవాలను మాంసానికి వినియోగించాలి. అలా జరగడం లేదు.  దీనిపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.– శివనాగిరెడ్డి, అధ్యక్షుడు, రైతుసంఘాల ఐక్యవేదిక, కర్నూలు

మరిన్ని వార్తలు