‘ఏపీని బజారున పడేసింది టీడీపీనే’

8 Jul, 2017 14:21 IST|Sakshi
‘ఏపీని బజారున పడేసింది టీడీపీనే’

గుంటూరు: మూడేళ్లుగా వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కరువు వెంటాడుతోందని అన్నారు. టీడీపీ అసమర్థ పాలన కారణంగా వ్యవసాయ రంగం తీవ్ర దుర్భక్ష పరిస్థితులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలోని పలు మండలాలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయని వివరించారు. శనివారం ప్రారంభమైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్లీనరీలో రైతుల సమస్యలపై నాగిరెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఉన్న మండలాలలన్నీ కరువు మండలాలుగా ప్రభుత్వమే ప్రకటించింది. ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్సు చెల్లించకుండా టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది. పొలాల్లో పారుతుంది సాగునీరు కాదు.. టీడీపీ అవినీతి. రైతు రుణమాఫీ లేదు. ఎగువన ఉన్న తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే ఇక్కడ టీడీపీ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోంది. రైతు రుణమాఫీ కాదు కదా .. కనీసం వడ్డీ మాఫీ కూడా కాలేదు. మూడేళ్లతో పోల్చుకుంటే ఖర్చులు తీవ్రంగా పెరిగాయి. కానీ రైతుకు మధ్దతు ధర పెరగలేదు' అని నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

5వేల కోట్లతో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు. బేషరతుగా రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు తాను అసలు ఆ మాటే చెప్పలేదని మాట మార్చారని ధ్వజమెత్తారు. బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పడు ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదని తీర్మానం సందర్భంగా గుర్తు చేశారు. రైతులకు సంబంధించి ప్రతి అంశంలో మోసమే చేశారు. రైతాంగ చరిత్రలో ల్యాండ్‌ పూలింగ్, ల్యాండ్‌ అక్విజిషన్, ఇనాం భూముల స్వాధీనం, రికార్డుల మార్పు, తుపానుల పేరుతో రికార్డుల మాయంవంటివన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన చీకటి అధ్యాయం అని మండిపడ్డారు. అన్నపూర్ణగా పిలవబడే ఆంధ్రప్రదేశ్‌ను బజారున పడేసిన టీడీపీకి బుద్ధిచెప్పి, రాబోయే రోజుల్లో రైతులకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.