చంద్రబాబు వైఖరి స్పష్టం చేయాలి

11 Aug, 2013 03:13 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజనపై ముఖ్యంగా హైదరాబాద్‌పై చంద్రబాబునాయుడు నుంచి మరింత స్పష్టత రావలసిన అవసరముందని తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి వ్యాఖ్యానించారు. విభజనపై ప్రజలు లేవనెత్తిన సందేహాలకు జవాబు ఇవ్వాలని ప్రధానికి లేఖ రాసిన బాబు.. ముందు తన వైఖరి స్పష్టంగా వెల్లడించాలన్నారు. శనివారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన వలన కలిగే నష్టాలపై మాట్లాడిన సీఎం కిరణ్‌ను అభినందించాలని చెప్పారు. సీఎం బహిరంగంగా మాట్లాడిన తర్వాతే చంద్రబాబుకు ధైర్యం వచ్చిందని,అందుకే ప్రధానికి లేఖ రాశారని తెలిపారు. రాష్ట్ర విభజనపై దిగ్విజయ్‌సింగ్ అసలు ఏ హోదాలో మాట్లాడుతున్నారని? అసలు ఆయన ఎవరని ప్రశ్నించారు. తక్షణం రాష్ట్ర బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రుల అభ్యంతరాలను వినడానికి ఏర్పాటు చేసిన ఆంటోని కమిటీతో ప్రజలెవరూ మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. విభజన కోరుకునేవాళ్లే కొత్త రాజధానిని వెతుక్కోవాలన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, అసెంబ్లీ తీర్మానం లేకుండా ముక్కలుచేస్తే రక్తపాతం జరుగుతుందని హెచ్చరించారు. తక్షణం ప్రధాని జోక్యం చేసుకుని దేశాన్ని ముక్కలు చేసే అరాచక ప్రయత్నాలను ఆపాలని కోరారు.
 
 

>
మరిన్ని వార్తలు