పీఆర్ కండ్రీగ తల్లులకు నా భారతరత్న అంకితం

16 Nov, 2014 11:58 IST|Sakshi
పీఆర్ కండ్రీగ తల్లులకు నా భారతరత్న అంకితం

నెల్లూరు: తన కన్నతల్లితోపాటు పీఆర్ కండ్రీగ గ్రామంలోని తల్లులందరికీ తాను అందుకున్న అత్యున్నత పురస్కారం భారతరత్నను అంకితమిస్తున్నట్లు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రకటించారు. ఆదివారం నెల్లూరు జిల్లా పుట్టంరాజుగారి కండ్రీగ గ్రామంలోని గ్రామస్తులతో సచిన్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.... భార్తల కోసం, పిల్లల కోసం దేశంలోని మహిళలంతా ఎన్నో త్యాగాలు చేస్తున్నారన్నారు. అభివృద్ధి దిశగా ఈ గ్రామానికి తొలి ఇన్నింగ్స్ ఇప్పుడే మొదలైందని తెలిపారు. కానీ గ్రామంలోని అభివృద్ధి నిర్వహణలో రెండో ఇన్సింగ్స్ మాత్రం మీ చేతుల్లోనే ఉందని గ్రామస్తులకు గుర్తు చేశారు.

చేతులు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వల్ల చాలా వ్యాధులు వస్తున్నాయని... ఈ నేపథ్యంలో చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని మీ పిల్లలకు చెప్పాలని గ్రామంలోని తల్లిదండ్రులకు సచిన్ సూచించారు. గ్రామంలో టాయిలెట్స్ నిర్మిస్తామని... వాటిని ఎలా పరిశ్రుభంగా ఉంచుకోవాలో మీ పిల్లలకు తెలియజేయాలని అన్నారు. గ్రామాలను దత్తత తీసుకుని ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారని... ఆ సమయంలోనే ఇదే అంశంపై జిల్లా కలెక్టర్తో మాట్లాడుతున్నానని నాటి జ్ఞపకాలను సచిన్ ఈ సందర్బంగా పిఆర్ కండ్రీగ గ్రామస్తులకు వివరించారు.   
 

మరిన్ని వార్తలు