ఇంతకీ వాళ్లెవరు !

2 Aug, 2014 04:12 IST|Sakshi

వ్యాపారి కిడ్నాప్ కేసులో వీడని మిస్టరీ  
కొయ్యలగూడెం : కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన వ్యాపారి బొమ్మా హరినాథ్ (24) కిడ్నాప్ వ్యవహారం మిస్టరీగా మారింది. అతడిని జూలై 29న మావోయిస్టులు కిడ్నాప్ చేశారని.. రూ.10 లక్షలు డిమాండ్ చేశారని.. ఆ మొత్తాన్ని సమర్పించుకోవడంతో వదిలేశారని చెబుతున్నప్పటికీ హరినాథ్ ఆచూకీ మాత్రం శుక్రవారం రాత్రి వరకూ వెల్లడి కాలేదు. ఈ వ్యవహారంపై అతని కుటుంబ సభ్యుల్లోను, పోలీసు వర్గాల్లోను అనుమానాలు వ్యక్తమవుతున్నారుు. ఈ నేపథ్యంలో బొమ్మా హరినాథ్ తల్లి, మాజీ ఎంపీటీసీ జానకిరత్నం శుక్రవారం కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అందులో పేర్కొన్న వివరాలిలా ఉన్నాయి.

అవివాహితుడైన బొమ్మా హరినాథ్ తన తండ్రి గంట్లయ్యతో కలిసి ఫోర్ వీలర్స్ ఫైనాన్స్ కంపెనీ నిర్వహిస్తున్నారు. హరినాథ్ జూలై 29న రాత్రి ఖమ్మం జిల్లా మందలపల్లి, దమ్మపేట గ్రామాల్లో బాకీలు వసూలు చేయడానికి కన్నాపురం నుంచి అద్దె కారులో వెళ్లారు. ఆ రోజు రాత్రి 12 గంటలకు దమ్మపేట చేరుకున్న హరినాథ్ బాకీలు వసూలు కాలేదంటూ కారును వెనక్కి పంపించివేశారు. అదేరోజు తెల్లవారుజామున ఖమ్మం జిల్లా ముగలంపల్లిలోని క్వాయిన్ బాక్స్ నుంచి హరినాథ్ ఇంటికి ఫోన్ వచ్చింది. తాము మావోరుుస్టు దళ సభ్యులమని, హరినాథ్‌ను కిడ్నాప్ చేశామని అవతలి వ్యక్తులు చెప్పారు. రెండు మూడు గంటల వ్యవధిలో పలుమార్లు ఈ తరహా ఫోన్లు వచ్చాయి.

అతడి తల్లిదండ్రులు హరినాథ్ సెల్‌కు ఫోన్ చేయగా, స్విచ్‌ఆఫ్ చేసి ఉంది. జూలై 30న 99516 39387 నంబర్ నుంచి తల్లిదండ్రులకు మరో ఫోన్ వచ్చింది. ‘మీ అబ్బాయి మా దగ్గరే ఉన్నాడు. రూ.10 లక్షలు ఇస్తే వదిలేస్తాం. ఈ విషయూన్ని ఎవరికైనా చెబితే చంపేస్తా’మంటూ హెచ్చరించారు. ఆ తరువాత ఆగంతకులు హరినాథ్ సెల్‌నుంచే గంటకోసారి ఫోన్ చేసి బెదిరింపుల్ని కొనసాగించారు. దీంతో భయపడిన హరినాథ్ తండ్రి గంట్లయ్య, అతని బంధువు గ్రంధి శ్రీను జూలై 31న సాయంత్రం 3 గంటలకు రూ.10 లక్షలను బ్యాగ్‌లో పెట్టుకుని కొయ్యలగూడెం బయలుదేరారు. ఆ తరువాత అవతలి వ్యక్తులు ఫోన్‌లో చెప్పిన ప్రకారం కొయ్యలగూడెం నుంచి కరాటం వైజంక్షన్‌కు చేరుకున్నారు.

అక్కడకు వెళ్లిన తర్వాత జంగారెడ్డిగూడెం గంగానమ్మ గుడి వద్దకు రమ్మని చెప్పడంతో అక్కడకు చేరుకున్నారు. అనంతరం పద్మా థియేటర్ రావాలని.. అక్కడకు వెళ్లగా పారిజాతగిరి సమీపంలోని ప్రధాన రహదారిపైకి రావాలని ఆగంతకులు కోరారు. వారు పారిజాతగిరి ప్రాంతానికి చేరుకోగా, క్యాష్ బ్యాగ్‌ను మీ బైక్‌పై పెట్టి వెళ్లిపోండని సూచించారు. హరినాథ్‌ను చూపిస్తే గానీ సొమ్ములు ఇచ్చేది లేదని తండ్రి గంట్లయ్య అవతలి వ్యక్తులతో ఫోన్‌లో చెప్పగా.. ‘మీరు మమ్మల్ని నమ్మాల్సిందే.. మోసం చేసే స్థితిలో మేం లేం’ అని అవతలి వ్యక్తులు అనడంతో చేసేదేమీ లేక జనసంచారం లేని ప్రాంతంలో బైక్‌ను పార్క్‌చేసి, దానిపై క్యాష్‌బ్యాగ్ ఉంచిన హరినాథ్ తండ్రి, బంధువు సుమారు 200 గజాల దూరం వెళ్లి నిలబడ్డారు.

కొద్దిసేపటికి ముసుగులు ధరించిన ఇద్దరు వ్యక్తులు వేగంగా ఎర్ర రంగు మోటార్ సైకిల్‌పై వచ్చి క్యాష్ బ్యాగ్ తీసుకుని అశ్వారావుపేట రోడ్డు వైపు వెళ్లిపోయారు. ఐదు నిమిషాల తర్వాత ఫోన్ చేసిన ఆగంతకులు ‘డబ్బు మాకు చేరింది. మీ కొడుకుని వదిలేస్తున్నాం. మీ కుమారుడికి మాకు ఎటువంటి సంబంధం లేదు. కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేయమనడంతో సుపారి తీసుకుని మీవాణ్ణి కిడ్నాప్ చేశా’మని చెప్పారు. అయితే, హరినాథ్ ఆచూకీ శుక్రవారం రాత్రి వరకూ తెలియలేదు. అతని కోసం తమవాళ్లు అశ్వారావుపేట, మందలపల్లి ప్రాంతాల్లో వెతుకుతున్నట్టు అతని తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం సీఐ అంబికా ప్రసాద్ పర్యవేక్షణలో ఎస్సై గంగాధర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
మావోల పనేనా..
హరినాథ్ కిడ్నాప్ వ్యవహారంపై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. తొలుత ఆగంతకులు హరినాథ్ తల్లిదండ్రులకు చెప్పినట్టు ఇది నిజంగా మావోయిస్టుల పనేనా.. లేక అదే వ్యక్తులు చివరగా చెప్పినట్టు ఇతర వ్యక్తులెవరైనా కావాలని అతణ్ణి కిడ్నాప్ చేయించారా అనేది అంతుచిక్కడం లేదు. ఇది కచ్చితంగా మావోయిస్టుల పనేనని.. హరినాథ్, అతని తండ్రి గంట్లయ్య భారీగా సొమ్ము ఆర్జించిన విషయం మావోయిస్టుల దృష్టికి వెళ్లిందని చెబుతున్నారు.

మావోయిస్టులు గతంలో కొన్నిసార్లు పార్టీ ఫండ్ ఇవ్వాల్సిందిగా హరినాథ్‌ను అడిగారని, అతడు పట్టించుకోకపోవడంతో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మరికొందరు మాత్రం మావోయిస్టుల ప్రమేయూన్ని కొట్టిపారేస్తున్నారు. అవివాహితుడైన హరినాథ్ విలాసంతమైన జీవితానికి అలవాటుపడినట్టు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఖర్చుల విషయమై హరినాథ్‌ను తల్లిదండ్రులు కట్టడి చేయడంతో డబ్బు కోసం అతడే ఈ డ్రామా ఆడించి ఉంటాడనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నారుు. పోలీసులు వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు