సింగపూర్ ప్రభుత్వం మన మేనమామ కాదు..

26 May, 2015 03:34 IST|Sakshi
సింగపూర్ ప్రభుత్వం మన మేనమామ కాదు..

వైఎస్సార్‌సీపీ నేత మైసూరారెడ్డి
 సాక్షి, హైదరాబాద్ : రాజధాని మాస్టర్ ప్లాన్ ఫ్రీగా గీసీవ్వడానికి సింగపూర్ ప్రభుత్వమేమీ మన మేనమామ కాదని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి  అన్నారు. సింగపూర్ సంస్థలు అందజేసిన రెండో విడత మాస్టర్ ప్లాన్‌పై ‘సాక్షి’ టీవీ నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన పాల్గొన్నారు. ఇలాంటి ప్రణాళికలను ఎవరూ ఉచితంగా గీయరని మైసూరారెడ్డి చెప్పారు. సింగపూర్ ప్రభుత్వం గుణం మంచిది కాదని తెలిపారు. కాంట్రాక్ట్ పొలిటికల్ సిస్టమని చెప్పి చైనీయులు సింగపూర్‌ను  తరిమేశారన్నారు. ఏపీ రాజధాని నిర్మాణానికి సింగపూర్ రూపొందించిన మాస్టర్ ప్లాన్ అంతగా గొప్పగా లేదని చెప్పారు.
 
 ఈ ప్లాన్ గీయడానికి డబ్బులు, టెక్నాలజీ, ప్రభుత్వం అవసరం లేదన్నారు. ఇదే ప్లాన్‌ను పార్టీ తరపున కూడా గీయవచ్చని చెప్పారు.  రాజధాని ప్రభుత్వం చేతుల్లో ఉండాలని, ప్రైవేటు చేతుల్లో పెట్టకూడదని చెప్పారు. బ్లూ ప్రింట్, మాస్టర్ ప్లాన్ అమలుకు అసలు సమస్య డబ్బని చెప్పారు.సచివాలయం, హైకోర్టు నిర్మాణానికి నిధులిస్తామని విభజన బిల్లులో పొందుపచారని గుర్తు చేశారు. రాజధాని కోసం సమీకరించిన రైతుల భూములకు ప్రభుత్వం డెవలపర్ కాదని, కేవలం మధ్యవర్తిత్వం వహిస్తుందన్నారు. దీనిని పారిశ్రామిక అవసరాలకు తీసుకునే దాంతో పోల్చలేమన్నారు.  ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని తెలిపారు.
 
 దోచుకోవడానికే ‘మాస్టర్ ప్లాన్’: వాసిరెడ్డి పద్మ
 రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న పది వేల ఎకరాల భూమిని సింగపూర్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకే రాజధాని మాస్టర్ ప్లాన్‌ను వారి నుంచి రూపొందింప జేశారని, తెలుగువారికి ఇదో దుర్దినమని వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, సింగపూర్ సంస్థల కుటుంబీకులు, చంద్రబాబు కుటుంబ సభ్యులు, ఆయన బినామీలు పరస్పరం దండుకునేందుకే ఈ మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారని ధ్వజమెత్తారు.
 
  పరస్పరం ఇది ఓ ఎక్స్ఛేంజ్ ఆఫర్ లాంటిదన్నారు. తెలుగు వారి సంసృ్కతీ సంప్రదాయాలు, తెలుగుదనం ఉట్టిపడేలా నిర్మించాల్సిన రాజధాని మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడానికి తెలుగు వారిలో నిపుణులే కరవయ్యారా? అని ఆమె ప్రశ్నించారు.పది వేల ఎకరాలు సింగపూర్ సంస్థలకు అప్పగిస్తున్నారని ఓ ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తలపై ఇప్పటి వరకూ చంద్రబాబు నోరు విప్పలేదని, అసలు విషయం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, ఆయన కుటుంబీకుల పర్యటనల వివరాలు బయట పెడితే ఆ దేశంలో వారికున్న ఆస్తులేంటో, వారికి అనుబంధం ఉన్న కంపెనీల వివరాలేంటో బయట పడతాయని ఆమె అన్నారు.

మరిన్ని వార్తలు