అమరేశ్వరుని సన్నిధిలో భక్తురాలి మృతి

11 Nov, 2014 01:21 IST|Sakshi
అమరేశ్వరుని సన్నిధిలో భక్తురాలి మృతి

అమరావతి
 ప్రసిద్ధ శైవక్షేత్రమైన గుంటూరు జిల్లా అమరావతి అమరేశ్వరుని కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని దర్శించేందుకు వచ్చిన ఓ భక్తురాలు పుణ్యలోకాలకేగిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం అదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కొమరగిరి గ్రామానికి చెందిన అల్లూరి పార్వతీదేవి మరో ఆరుగురు బంధువులతో కలిసి కాకినాడ అర్టీసీ డిపో బస్సులో పంచారామాల యాత్రకు బయలు దేరింది.

సోమవారం తెల్లవారుజామున మూడు గంటలకు పవిత్ర కృష్ణానదిలో పుణ్య స్నానాలు అచరించి అమరేశ్వరుని దర్శనం కోసం వచ్చిన ఆమె క్యూలైన్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో సుమారు ఆరు గంటలకు అలయంలోని ధ్వ జ స్తంభం వరకు రాగానే ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురై అపస్మారకస్థితికి చేరటంతో ఆలయ సిబ్బంది, పోలీసుల సహాయంతో స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఇక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణ అనంతరం పార్వతీదేవి మృతదేహాన్ని దేవాలయ అధికారులు ప్రత్యేకంగా అంబులెన్స్ ఏర్పాటు చేసి కొమరవోలు గ్రామానికి పంపించారు.

 తొక్కిసలాటవల్లేనా..?: కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా తెల్లవారుఝాముకు రాష్ట్రం నలుమూలలనుంచి పంచారామ యాత్ర చేయటానికి సుమారు 400 బస్సుల్లో వచ్చిన 20వేల మంది భక్తులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు ఏడువేల మంది భక్తులతో ఆలయం కిటకిటలాడింది. వీరి తాకిడికి ఆలయంలో ఏర్పాటు చేసిన బారికేడ్లు కూడా విరిగి పోవటంతో భక్తులు ఎటువెళ్లాలో తెలియక చిన్నపాటి తోపులాట చోటు చేసుకుంది.  పంచారామాల బస్సుల్లో వచ్చిన యాత్రికులంతా మిగిలిన నాలుగు క్షేత్రాల సందర్శనకు త్వరగా వెళ్లాలనే ఆతృతతో క్యూలైన్లలో హడావుడి చేయటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది.

మరిన్ని వార్తలు