ప్రాధాన్యత రంగానికి లక్షల కోట్లు

19 Feb, 2020 04:56 IST|Sakshi

రుణ అంచనాలు రూపొందించిన నాబార్డు 

వ్యవసాయ రంగానికి రూ.1.46 లక్షల కోట్లు

2019–20తో పోల్చితే సాగు రుణాల అంచనా 18.87 శాతం పెరుగుదల  

2020–21 ఫోకస్‌ పత్రం ఇటీవలే సీఎం చేతుల మీదుగా విడుదల

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రాధాన్యత రంగానికి రూ.2,11,865.38 కోట్లు అవసరమని నాబార్డు రుణ అంచనాలు రూపొందించింది. ఈ మేరకు 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫోకస్‌ పత్రాన్ని నాబార్డు ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా విడుదల చేసింది. నాబార్డు రూపొందించిన రుణ ఆవశ్యకత పత్రం ఆధారంగా వార్షిక రుణ ప్రణాళికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సిద్ధం చేయనుంది.  

సాగుకు అగ్రస్థానం.. 
ప్రాధాన్య రంగంలో వ్యవసాయానికి రూ. 1,46,301.95 కోట్ల రుణాలు అవసరమని నాబార్డు అంచనా వేసింది. ఇందులో పంటల ఉత్పత్తి, నిర్వహణ, మార్కెటింగ్‌కి రుణ అంచనా రూ.1,05,033.62 కోట్లుగా పేర్కొంది. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఇది 18.87 శాతం ఎక్కువని నాబార్డు ఫోకస్‌ పత్రంలో తెలిపింది. పంట రుణాలతోపాటు మార్కెట్‌ యార్డులు, శీతల గిడ్డంగుల నిర్మాణం, ఫుడ్‌ ప్రాసెసింగ్, అగ్రికల్చర్‌ క్లినిక్స్, అగ్రి బిజినెస్‌ కేంద్రాలకు నాబార్డు రుణాలను ప్రతిపాదించింది. జలవనరులు, ఉద్యానవన, మత్స్య, పశు సంవర్థక రంగాలకు నాబార్డు రుణ ప్రతిపాదనలు రూపొందించింది. గృహ నిర్మాణం, విద్య, ఎగుమతులకు రుణాల ప్రతిపాదనలున్నాయి. సామాజిక మౌలిక వసతుల కల్పన, రాష్ట్ర ప్రతిపాదిక పథకాలకు నాబార్డు రుణాలను ప్రతిపాదించింది. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు పెట్టుబడి రుణాలను నాబార్డు ఫోకస్‌ పత్రంలో పేర్కొంది.  

మరిన్ని వార్తలు