నాబార్డు నిధులతో రోడ్లకు మహర్దశ

5 Mar, 2020 13:10 IST|Sakshi

రూ.22.37 కోట్ల నాబార్డు నిధులతో 8 పనులు

గూడూరులో 2, కావలి డివిజన్లో 6 వర్కులు

ఎన్డీబీ ప్రాజెక్ట్‌ ద్వారా రూ.428.62 కోట్లతో మరిన్ని రహదారుల అభివృద్ధి

నెల్లూరు(బారకాసు): జిల్లాలోని కావలి, గూడూరు డివిజన్లలో గల పలు ప్రాంతాల్లో రోడ్లకు మహర్దశ పట్టనుంది. రూ.22.37 కోట్ల నాబార్డు నిధులతో ఆర్‌ అండ్‌ బీ అధికారులు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో రోడ్డు పనులను ప్రారంభించారు. ఇవి వివిధ దశల్లో ఉన్నాయి. త్వరలో న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్డీబీ) ద్వారా మరికొన్ని ప్రాంతాల్లో రోడ్ల పనులు చేపట్టేందుకు సంబంధిత అధికారులు చర్యలు ప్రారంభించారు. దీంతో మూడు నెలల్లోపు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రహదారులను సుందరంగా తయారు చేయనున్నారు. 

నాబార్డు నిధులతో 8 పనులు
నాబార్డు నుంచి విడుదలైన రూ.22.37 కోట్లతో 8 రోడ్ల పనులు చేపట్టారు. ఇందులో కావలి డివిజన్లో ఆరు, గూడూరు డివిజన్లో రెండు వర్కులు వివిధ దశల్లో ఉన్నాయి. గూడూరు డివిజన్లో ఏర్పేడు నుంచి చెన్నూరు వరకు 3.5 కిలోమీటర్లు, బంగారుపేట నుంచి చెన్నై, కోల్‌కతా రోడ్డు వరకు 4.9 కిలోమీటర్ల మేర తారు రోడ్డు పనులను ప్రారంభించారు. దీనికి రూ.6.85 కోట్లను వెచ్చించారు. కావలి డివిజన్లో ఆరు రోడ్ల పనులకు గానూ రూ.12.52 కోట్లు వెచ్చించారు. ఇందులో రెండు పనులు జరగ్గా, మిగిలిన నాలుగు పనులకు అటవీశాఖ అనుమతులివ్వకపోవడంతో నిలిచిపోయాయి. అల్లూరు నుంచి ఉడ్‌హౌస్‌పేట వరకు మూడు బ్రిడ్జిల పనులు జరుగుతున్నాయి. కావలి నుంచి తుమ్మలపెంట వరకు 0.5 కిలోమీటర్‌ వరకు రోడ్డు పనులను ఇప్పటికే పూర్తి చేశారు. ఉదయగిరి నుంచి బండగానిపల్లి, తిమ్మసముద్రం నుంచి చోడవరం, జంగాలకండ్రిగ నుంచి చెన్నూరు, కోవూరు నుంచి యల్లాయపాళెం వరకు జరగాల్సిన రోడ్డు పనులు అటవీ శాఖ అనుమతులు లభించక నిలిచిపోయాయి.

త్వరలో ఎన్డీబీ ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభం
ఎన్డీబీ ప్రాజెక్ట్‌ ద్వారా మరికొన్ని ప్రాంతాల్లో రోడ్డు పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా చేపట్టే రోడ్ల పనులకు చైనా వారు 70 శాతం నిధులను రుణంగా ఇవ్వగా, మిగిలిన 30 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. దీని కోసం ఆర్‌ అండ్‌ బీ అధికారులు అవసరమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే రోడ్ల నిర్మాణ పనులు ఎక్కడెక్కడ చేపట్టాలో గుర్తించడంతో పాటు అందుకు ఎంత నిధులు అవసరమో కూడా నిర్ణయించారు. ఫేజ్‌ – 1కు సంబంధించిన టెండర్లను పిలిచేందుకు సిద్ధం చేస్తున్నారు. ఫేజ్‌ – 2లో జరిపే పనుల కోసం అంచనాల్లో ఉన్నారు. 

నిధులను వెచ్చించనుంది ఇలా..
ఎన్డీబీ ప్రాజెక్ట్‌ ద్వారా రూ.428.62 కోట్లతో 15 రోడ్ల పనులు చేపట్టనున్నారు. ఆయా పనులను ఫేజ్‌ – 1, 2 ద్వారా పూర్తి చేయనున్నారు. ఫేజ్‌ – 1లో రూ.128.56 కోట్లతో ఆరు రోడ్ల పనులు, ఫేజ్‌ – 2లో తొమ్మిది రోడ్ల పనులకు రూ.300.06 కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో ఫేజ్‌ – 1 ద్వారా తోటపల్లిగూడూరు నుంచి సీఎస్‌పురం, సూళ్లూరుపేట నుంచి సంతవేలూరు, రాజుపాళెం నుంచి ఇస్కపల్లి, కావలి నుంచి తుమ్మలపెంట, బుచ్చి నుంచి దగదర్తి, ముంబై హైవే రోడ్డు నుంచి కోవూరు వరకు ఆరు పనులు చేపట్టనున్నారు. అదే విధంగా ఫేజ్‌ – 2 ద్వారా నందనం నుంచి ఉదయగిరి, సంగం నుంచి కలిగిరి, సంగం నుంచి విరువూరు మీదుగా కలువాయి, నెల్లూరు నుంచి తాటిపర్తి, నెల్లూరుపాళెం నుంచి వింజమూరు, పాత మద్రాస్‌ రోడ్డు నుంచి కోట, విద్యానగర్‌ మీదుగా సముద్ర తీర ప్రాంతం వరకు, ఏర్పేడు నుంచి నాయుడుపేట వరకు, రాపూరు రోడ్డు, సూళ్లూరుపేట నుంచి నాయుడుపేట, దుగరాజపట్నం వరకు, గూడూరు నుంచి జయంపు వరకు రోడ్డు పనులు చేపట్టేలా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.  

మూడు నెలల్లో పూర్తి
ఆర్‌ అండ్‌ బీ శాఖ ద్వారా ఆయా రోడ్డు పనులను మరో మూడు నెలల్లో పూర్తిచేసేందుకు యత్నిస్తున్నాం. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లకు మహర్దశ పట్టనుంది.– వివేకానంద, ఎస్‌ఈ, ఆర్‌ అండ్‌ బీ

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా