'పర్యటనలతో ఎన్ని ఉద్యోగాలొచ్చాయి'

22 Jan, 2017 11:54 IST|Sakshi
'పర్యటనలతో ఎన్ని ఉద్యోగాలొచ్చాయి'

విజయవాడ :
ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే దావోస్‌ పర్యటనపై వస్తున్న ఆరోపణలపై శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్‌పార్టీ డిమాండ్‌ చేసింది. ఇప్పటి వరకు ఏపీలో ఎంతమందికి ఉపాధి కల్పించారో చెప్పాలని పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు మాజీ స్పీకర్, పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ లేఖ రాశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాద్యత ప్రభుత్వం పై ఉందని లేఖలో పలు అంశాలను పేర్కొన్నారు.

2015లో కూడా దావోస్‌ పర్యటనలో భాగంగా బిల్‌ గేట్స్‌, సత్యనాదెళ్లను కలిసినట్టు తెలిపారు. ఏపీలో మైక్రోసాఫ్ట్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు, హీరో మోటార్స్‌ కార్పొరేషన్‌, పెప్సీ, వాల్‌ మార్ట్‌, విప్రో లాంటి సంస్థలు త్వరలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులతో వస్తాయని ప్రకటించారు.

చంద్రబాబు మూడవసారి కూడా దావోస్‌ పర్యటించిన సందర్భంగా అనేక మంది వ్యాపార దిగ్గజాలను కలిసి భారీ ఒప్పందాలను చేసుకున్నట్టు అధికార యంత్రాంగం పదే పదే ప్రకటనలు విడుదల చేస్తున్నారు.

2016 దావోస్‌ పర్యటనలో పాల్గొని రూ. 2000 కోట్ల  పెట్టుబడితో ఘెర్జి టెక్స్‌ టైల్‌ మెగా పార్క్‌ను ఏపీలో స్థాపించబోతున్నట్టు ప్రకటించారు.

'స్మార్ట్‌ సిటీ, స్మార్ట్‌ విలేజ్‌, స్మార్ట్‌ ఆంధ్రప్రదేశ్‌' ఇదేనా అభివృద్ధి మంత్రం అంటూ 2016లో మీరు స్విట్జర్లాండ్‌ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిపారు. ఆయా సంస్థల గురించి ఇప్పుడు ఎందుకు కృషి చేయడం లేదో ప్రజలకు వివరించాలి.

పెట్టుబడులు ఆకర్షించడానికి మంత్రుల బృందం పర్యటనలకు అయిన ఖర్చులు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, లభించిన ఉపాధి వివరాలు వెల్లడించాలి.

12 జవవరి 2016న రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ను నిర్వహించింది. అప్పుడు జరిగిన ఒప్పందాల ద్వారా 4 లక్షల 78 వేల కోట్ల పెట్టబడులు రాష్ట్రానికి వస్తాయని, 6 లక్షల మందికి కొత్తగా ఉపాధి దొరుకుతుందని ఊదరగొట్టారు. కానీ, ఇప్పటి వరకు ఎంత మందికి ఉపాధి లభించిందో వాస్తవాలు తెలియజేయాలి.

40 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్వహించిన ఈ పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌ ద్వారా రాష్ట్ర ప్రజలలో ప్రత్యేకంగా యువతలో మీరు భారీ ప్రకటనల ద్వారా ఆశలను రేకెత్తించారు.

ఆర్భాటాలతో ప్రచారం కోసం ప్రజాధనం వృధాచేస్తుందన్న అనుమానాలకు ప్రభుత్వం వాస్తవాలు వివరించాలని లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు