టీడీపీలో అసమ్మతి 'రాజు'కుంటోంది

13 Oct, 2018 11:53 IST|Sakshi

టీడీపీలో క్షత్రియులకు మొండిచెయ్యి

పుంగనూరు, నగరి నుంచి ఔట్‌

నగరి టీడీపీలో విభేదాలు

గాలి భానుకు అసమ్మతి సెగ

ఒక్కటవుతున్న పాతకాపులు

టీడీపీలో క్షత్రియ సామాజిక వర్గం ప్రాభవం.. ప్రాధాన్యత రెండూ కోల్పోయింది.  పుంగనూరు నుంచి వెంకటరమణ రాజును పక్కకు తప్పించిన అధినేత నగరిలో అశోక్‌రాజుకు మొండిచెయ్యి చూపారు. మరో వైపు టీటీపీ అధినేత ముందస్తు అభ్యర్థుల ప్రకటన నగరిలో బూమ్‌రాంగ్‌ అయ్యింది. గాలి భాను అభ్యర్థిత్వంపై అసమ్మతి సెగలు కక్కుతోంది. ఒకే కుటుంబానికి ఏళ్ల తరబడి అవకాశం కల్పిస్తుండడంపై పాతకాపులు ఒక్కటవుతున్నారు. అధినేత వద్ద తాడోపేడో తేల్చుకొనేందుకు అమరావతికి పయనమవుతున్నారు.

పుత్తూరు: టీడీపీ అధినేత క్షత్రియ సామాజిక వర్గానికి మొండిచెయ్యి చూపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుంగనూరు అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని వెంకటరమణరాజు నుంచి తప్పించి అనీషా రెడ్డికి ప్రకటించిన చంద్రబాబునాయుడు, నగరి టీడీపీ పగ్గాలను దివంగత ఎమ్మెల్సీ ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్‌కు కట్టబెట్టడంపై క్షత్రియ సామాజిక వర్గం ఆగ్రహం తో రగలిపోతోంది. అధినేత తీసుకున్న నిర్ణయంతో జిల్లాలోనే కాకుండా రాయలసీమ ప్రాంతం నుంచి∙క్షత్రియ సామాజిక వర్గానికి చట్ట సభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయిందనే వాదనలు వినిపిస్తున్నాయి. 

జిల్లాలో పుంగనూరు, నగరి, గంగాధర నెల్లూరు, సత్యవేడు నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో క్షత్రియ సామాజిక వర్గం బలంగా ఉంది. గతంలో నగరి నియోజకవర్గం నుంచి డి.రాజగోపాలరాజు, టీడీపీ తరఫున ఈవీ గోపాలరాజు, దొరస్వామిరాజు ఎమ్మెల్యేలుగా గెలిచారు. పుంగనూరు నుంచి వెంకటరమణరాజును పక్కన పెట్టడంతో నగరి నుంచి క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాల చైర్మన్‌ అశోక్‌రాజుకు అవకాశం కల్పిస్తారనే ప్రచారంతో ఆ సామాజిక వర్గం మొత్తం ఆశగా ఎదురుచూసింది. అధినేత రిక్తహస్తం చూపడంతో క్షత్రియ సామాజిక వర్గం భగ్గుమంటోంది.

బయటపడుతున్న విభేదాలు..
నగరి టీడీపీలో విభేదాలు బయటపడుతున్నాయి. గాలి భానుప్రకాష్‌ అభ్యర్థిత్వంపై పాతకాపులు ఒక్కటవుతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ముద్దుకృష్ణమనాయుడికే అధిష్టానం అవకాశం కల్పించింది. మళ్లీ ఇప్పుడు వాళ్ల కుటుంబానికే ప్రాధాన్యతనివ్వడంపై అసమ్మతి రాజుకుంటోంది. ముద్దు మృతితో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని ఆయన భార్య సరస్వతమ్మకు కట్టబెట్టిన అ«ధినేత నగరి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం కూడా వారి కుటుంబానికే ఇవ్వడంపై ఆశావహులు ఆక్రోశం వెళ్ల్లగక్కుతున్నారు. ముద్దుకృష్ణమ ఉన్నంత వరకు ఆయన అడుగులకు మడుగులు ఒత్తే వాళ్లకే పార్టీలో, ప్రజాప్రతినిధులుగా అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అలాంటి వాళ్ల అభిప్రాయాలు తీసుకొని గాలి భాను అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తీరుపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు.

అమరావతికి పయనం..
టీడీపీకి అయువుపట్టయిన ఒక సామాజిక వర్గంలోనే గాలి భానుప్రకాష్‌ అభ్యర్థిత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం ఆర్థికంగా, సామాజికంగా అండగా ఉన్న నాయకులు వ్యతిరేకిస్తున్నారు. నగరికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు కృష్ణమూర్తినాయుడు, పుత్తూరు ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, టీడీపీ కీలక నాయకుడు కొరపాటి నరేంద్రబాబు, నిండ్ర, విజయపురం మండలాల్లోని సామాజిక వర్గం నాయకులు గాలి భాను అభ్యర్థిత్వాన్ని తీవ్రస్థాయిలో ఆక్షేపిస్తున్నట్లు సమాచారం. బీసీ సామాజిక వర్గం నుంచి పాకా రాజా, క్షత్రియ సామాజిక వర్గం నుంచి అశోక్‌రాజు, కమ్మ సామాజిక వర్గం నుంచి కృష్ణమూర్తినాయుడుకు అవకాశం కల్పించాలనే డిమాండ్‌తో శనివారం అమరావతికి పయనమవుతున్నారనే ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. అశావహుల్లో ముఖ్యడైన అశోక్‌రాజు మాత్రం ప్రస్తుతానికి గుంభనంగానే ఉన్నారు.

మరిన్ని వార్తలు