పునరావాసం అయోమయం !

13 Feb, 2015 01:11 IST|Sakshi
పునరావాసం అయోమయం !

     నానా  అవస్థలూ  పడుతున్న నాగావళి  ముంపు గ్రామాల ప్రజలు
     స్థలాలివ్వరు...ఇచ్చిన స్థలాల్లో మౌలిక వసతులు కల్పించరు...
     ఇళ్లు కట్టుకునేందుకు ఇసుకకు కూడా ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన...
     పదేళ్లగా పాడుబడిన ఇళ్లలో కాపురాలు
     ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న తోటపల్లి నిర్వాసితులు

 
 పార్వతీపురం:తోటపల్లి ప్రాజెక్టులో తొలి సమిథులైన నిర్వాసితుల పునరావాసం కల్పన ఎప్పటిపూర్తవుతుందో తెలియక  ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఓ పక్క తోటపల్లి నుంచి ఈ ఏడాదికే పూర్తి స్థాయిలో నీరందిస్తామని పాలకులు, అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారని, అయితే  తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. గుణానుపురం, దుగ్గి, బాసంగి, గదబవలస, కళ్లికోట, నిమ్మలపాడు, బట్లభద్ర, తదితర గ్రామాల సమస్యలు ఎప్పుడు పరిష్కరిస్తారో అర్థంకావడం లేదని వారు తెలిపారు.   తోటపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురైన దాదాపు 20 గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉండగా, ఇప్పటికి 10 గ్రామాల వారికే   పునరావాసం కల్పించారు.
 
    ఏడు గ్రామాల వారికి కేటాయించిన  స్థలంలో చేపట్టిన ఇళ్లు నిర్మాణదశలో ఉన్నాయి,   మరో మూడు గ్రామాల వారికి స్థలం కేటాయింపు విషయంలో విభేదాలున్నాయి. దీంతో 10 గ్రామాల వారు పాత గ్రామాల్లోనే ఉన్న ఇళ్లను బాగుచేసుకోలేక, కొత్తవాటిని నిర్మించుకోలేక  అవస్థలు పడుతూ దాదాపు పదేళ్లగా జీవనం సాగిస్తున్నారు.   గట్టిగా వర్షం పడితే నాగావళి నీరు పొంగి గ్రామాల్లోకి చొచ్చుకొస్తోంది. దీంతో నిత్యం భయాందోళనల మధ్య బతుకీడుస్తున్నారు.  ఈ పరిస్థితుల్లో వచ్చే ఖరీఫ్ నాటికే ప్రాజెక్టునిర్మాణం పూర్తి చేసి పూర్తిస్థాయిలో సాగునీరు  అందించేందుకు  అధికారులు చర్యలు వేగవంతం చేశారు.  ఒక వేళ ప్రాజెక్టు పూర్తయితే తమ పరిస్థితి ఏంటని  నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు.   నీరు నిల్వ పెడితే ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కట్టుబట్టలతో రోడ్డునపడాల్సిందే.
 
 కనీస సౌకర్యాలు లేక అవస్థలు
    గుణానుపురం, దుగ్గి, కళ్లికోట, బిత్తరపాడు, చిన్నపుదొరవలస, బంటువానివలస, నిమ్మలపాడు, బట్లభద్ర, బాసంగి గదబవలస, సుంకి తదితర నిర్వాసిత గ్రామాల వారికి ఇప్పటికీ పునరావాసం పూర్తి కాలేదు. ఇళ్లు నిర్మించుకోడానికి కేటాయించిన స్థలంలో  కనీససౌకర్యాలు లేకపోవడంతో అక్కడ నిర్మాణాలు చేపట్టేందుకు  చాలా మంది వెనుకడుగువేస్తున్నారు.  అయితే  కొంతమంది నిర్వాసితులు సాహసించి తమకు కేటాయించిన  స్థలాల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు.   ఇళ్ల నిర్మాణానికి కనీస అవసరమైన నీరు, విద్యుత్ లేకపోవడంతో వారు నానా అవస్థలు పడుతున్నారు.  తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీరు నిల్వ చేస్తుండడంతో నాగావళి నీరు ఏ సమయంలో గ్రామాలపైకి వస్తుందోనని భయపడుతున్నారు.  వర్షాకాలం వచ్చేలోపే ఇళ్లు నిర్మించుకుందామని ఆశ పడుతున్న వారికి  ఏటా  నిరాశే ఎదురవుతోంది. దీంతో పాత గ్రామాల్లోని కూలిన ఇళ్లలోనే బతుకులు వెళ్లదీస్తున్నారు.  
 
 చిక్కుముడులు వీడని గుణానుపురం...
 నిర్వాసిత గ్రామం గుణానుపురం వ్యవహారం ఒక కొలిక్కి తీసుకొచ్చేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. గ్రామంలో ఉన్న అంతర్గత విభేదాల వల్ల ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటుండడంతో ఇప్పటికీ ఆ గ్రామానికి చెందిన చిక్కుముడులు వీడడం లేదు. అందులో 605 మందికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటికి 544 మందికి ప్యాకేజీ అందజేశారు. ఇంకా 61 మందికి ఇవ్వాల్సి ఉంది.  ఇప్పటికి 380 మందికి పునరావాసానికి సంబంధించి 31.80 ఎకరాలలో పట్టాలిచ్చారు.  ఇంకా సుమారు 143 మందికి 16 ఎకరాల మేరకు స్థల సేకరణ చేయాల్సి ఉంది. అయితే ఈ స్థల సేకరణే అధికారులకు తలనొప్పిగా మారింది.  జిరాయితీ భూమిలో ఇళ్లు ఉన్న  29 మందికి  పరిహారం ఇవ్వాలి.  డీ-పట్టాలకు సంబంధించి కూడా పరిహారం అందజేయవలసి ఉంది. అలాగే  64 మందికి రాయితీలు రావాల్సి ఉంది. 18 ఏళ్లు దాటిన సుమారు 42 మంది వారికి ప్యాకేజీ రావలసి ఉంది.
 
  దుగ్గిని వేధిస్తున్న మరో సమస్య...
 ఇక దుగ్గిని మరో  సమస్య వేధిస్తోంది. తమకు కేటాయించిన   స్థలాల్లో ఎస్సీలు ఇళ్ల నిర్మాణం చేపట్టడడంతో  బీసీలు ఇళ్లనిర్మాణానికి వెనుకడుగువేస్తున్నారు. తమకు ఇచ్చిన స్థలంలో గోతులున్నాయని, అందుకే కట్టడం లేదని వారు చెబుతున్నారు.  
 
  కదలని కళ్లికోట...
   ఇళ్ల స్థలాన్ని చదును చేసి ఇస్తేనే తాము కదులుతామని కళ్లికోట గ్రామస్తులు స్పష్టం చేశారు. గ్రామంలో 159 మందికి పట్టాలిచ్చారన్నారు. 39 మంది 18 ఏళ్ల వయస్సు వారికి పరిహారం అందించారన్నారు. అయితే పునరావాస స్థలంలో నిర్మించిన వాటర్ ట్యాంకు, అంగన్వాడీ, పాఠశాల భవనాలు ఇప్పుడే కొద్దిపాటి వర్షాలకే కారిపోతున్నాయన్నారు. వాటి నిర్మాణంలో నాణ్యత లోపించిందని వారు ఆరోపించారు. ఇక నిమ్మలపాడు, బట్లభద్ర తదితర గ్రామాల ప్రజలు సీమనాయుడు వలస వద్ద ఇళ్లనిర్మాణాలు చేపట్టినా మౌలిక వసతులు అందుబాటులో లేకపోవడంతో వెళ్లలేకపోతున్నామంటున్నారు.  ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని వారు వేడుకుంటున్నారు.
 

మరిన్ని వార్తలు